ఈ పరీక్షలన్నీ నాకే ఎందుకు వస్తాయో తెలీదు
కష్టాలన్నీ గుంపుగా ఒకదానివెనక ఒకటి వస్తాయెందుకో
నాకు భగవంతుని లీలలు అర్థం కావు ,
నా సుఖాలెందుకు చిరకాలముండవో
నా ఆశలన్నీ ఎందుకు త్వరలోనే మట్టిపాలవుతాయో
అయినా, నేను నమ్మకాన్ని విడవను.
ఆశల ఆకాసం మీద ఎప్పుడూ దట్టమైన నీలినీడలే తారాడతాయి
ఈ ప్రపంచం నిండా దుఃఖమే నిండి ఉన్నట్టు కనిపిస్తుంది
కానీ ప్రశాంతతతో, అతను చేసిన కమ్మని వాగ్దానాన్నే నమ్ముతాను
ఎన్నడూ మాట తప్పని ఆ చెయ్యిని విడిచిపెట్టను
జీవితంలో ఎంత గొప్ప కష్ట సమయం ఆసన్నమయినా
ఒక్కసారి తల పైకెత్తి చూస్తాను, నమ్మకం విడవను.
నా జీవితం అతని చేతుల్లో భద్రం అని ఎరుగుదును
ఏది జరిగినా, చివరకి, భగవంతుని పూర్తిగా నమ్మి
సేవచేసే వాళ్ళకీ, ఆశలు ఎంత అణగారి మట్టిపాలయినా
పిల్లలు ఆధారపడినట్లు అతనిపై ఆధారపడే
వారికీ, అందరికీ మంచినే ఒనగూర్చాలి;
నేను ఇప్పటికీ అతన్ని విశ్వసిస్తాను.
.
డేనియల్ వెబ్స్టర్ డేవిస్
(1862 – 1913)
అమెరికను కవి.

వ్యాఖ్యానించండి