కొత్త సంవత్సరం నాకు ఏ బహుమతి అందించాలా
అని గనక ఆలోచిస్తూంటే, అది, కళలపట్ల
ఆమెకున్న మక్కువ గురించి కథలుగా చెప్పుకునే
మా ముత్తవ్వ వైఖరి లాంటిది కావాలని కోరుకుంటాను.
ఎనిమిదిమంది సంతానంతో, పాపం ఆమెకు ఎన్నడూ
బొమ్మలు గీయడానికి అవకాశం చిక్కలేదు;
ఒక రోజు ఆమె స్విట్జర్లాండు దేశంలో ఒక నది ఒడ్డున
చాలా ఎత్తైన కొండగుట్టపై కూర్చుంది.
దూరంగా ఆమె రెండో కొడుకు మంచునీటిప్రవాహం మీద తేలుతూ
పట్టుతప్పి ప్రవాహదిశలో ఎనభై అడుగుల దిగువన
రాళ్ళమీద పడుతున్న జలపాతంవైపు కొట్టుకుపోడం చూసింది.
ఆమె రెండవ కూతురు, ఆమె ధరించిన దుస్తులవల్ల
నిస్సందేహంగా అసౌకర్యం అనుభవిస్తూనే తమ్ముడికి
చివరి ఆశగా ఇనుప ఊచ ఉన్న ఒక కర్రని అందించింది.
(అదృష్టవశాత్తూ, కొట్టుకుపోతూనే అతను దాన్ని అందుకోగలిగాడు);
ఆ పరిస్థితుల్లో చెయ్యడానికి నిజంగా ఏమీ లేదు;
ఒక కళాకారుడికి ఉండే నిర్లిప్తమైన దృష్టితో
మా అవ్వ తొందర తొందరగా ఒక చిత్రాన్ని గీసింది.
ఈ సంఘటన నిజమనడానికి ఋజువుగా ఆ చిత్రం ఇప్పటికీ ఉంది.
ఓ కొత్త సంవత్సరమా, నువ్వు మాతృదినోత్సవపు కానుక ఇంకా నిశ్చయించుకోకపొతే,
మరొకసారి గతంలోకి వెళ్ళి, ఆ బొమ్మగీస్తున్నపుడు ఆమె చేతిలోని స్థైర్యాన్ని పట్టి తీసుకురా!
.
జూడిత్ రైట్
(31 May 1915 – 25 June 2000)
ఆస్ట్రేలియన్ కవయిత్రి, పర్యావరణ, ఆదీవాసీల భూమిహక్కులకై పోరాడిన కార్యకర్త
.

వ్యాఖ్యానించండి