“ఇవాళ నేను బడికి వెళ్ళలేను”
అంది పెగ్గీ ఏన్ మెకే.
నాకు మశూచిసోకిందో, గవదబిళ్ళలు లేచాయో
అక్కడక్కడగాట్లూ, దద్దుర్లూ, ఎర్రగా పొక్కులూ ఉన్నాయి.
నా నోరు తడిగానూ, గొంతు పొడారిపోతూనూ ఉంది
నాకు కుడికన్ను కనిపించడం లేదు.
నా టాన్సిల్స్ బండరాయిల్లా తయారయ్యాయి
నేను లెక్కెట్టేను పదహారు అమ్మవారుపోసిన పొక్కులున్నాయి
ఇదిగో, దీనితో కలిపి పదిహేడు
నా ముఖం నీకు పచ్చగా కనిపించటం లేదూ?
నా కాలుకి దెబ్బతగిలింది, కళ్ళు వాచిపోయాయి…
బహుశా అప్పుడే ఫ్లూ జ్వరం వచ్చిందేమో.
నాకు దగ్గూ, తుమ్ములూ, ఆయాసంతో ఊపిరాడటం లేదు
నా ఎడంకాలు విరిగిపోయిందని బలమైన నమ్మకం…
నా దవడకదిపితే తుంటి నొప్పెడుతోంది.
చూడు నా బొడ్డు ఎంతలోతుకిపోతోందో.
నా వీపు వొంగిపోయింది, చీలమండ బెణికింది
చినుకులు పడ్డప్పుడల్లా నా ‘ఎపెండిక్స్’ నొప్పెడుతోంది
నాకు రొంపజేసింది, కాలివేళ్ళు కొంకర్లుపోయాయి,
నా బొటకనవేలు చూడు చీరుకుపోయింది,
నాకు మెడ పట్టేసింది, మాట నీరసంగా వస్తోంది,
మాటాడుతుంటే గుసగుసలాకూడా పెగలడం లేదు,
నోరంతా పూచి నాలుక మొద్దుబారిపోయింది
ఏమిటో, జుట్టంతా రాలిపోతున్నట్టు అనిపిస్తోంది
నా మోచెయ్యి వంగిపోయింది, వెన్ను తిన్నగా నిలబడడం లేదు
జ్వరం 108 డిగ్రీలుందేమో అనిపిస్తోంది
నా మెదడు కుదించుకుపోయింది, నాకు వినిపించడం లేదు,
నా కర్ణభేరికి పెద్ద కన్నం పడిపోయినట్టుంది.
నా వేలిగోరు ఊడిపోయింది… నా గుండె… ఏమిటీ?
ఏమంటున్నావూ? ఏమన్నావో మరోసారి చెప్పూ?
ఇవాళ శనివారం అనా? సరే అయితే!
టాటా! నేను ఆడుకుందికి పోతున్నా!
.
షెల్ సిల్వర్ స్టీన్
(September 25, 1930 – May 10, 1999)
అమెరికను కవి


వ్యాఖ్యానించండి