ఇది దేముడి గురించి చెప్పినా, ఇది అందరి విశ్వాసాలకూ వర్తిస్తుంది. విశ్వాసం అంటే మనకు చెదురుమదురుగా అన్ని విషయాలపట్లా ఉండే నమ్మకం కాదు. మనజీవన మార్గాన్ని నిర్ణయించుకుని మార్గదర్శకాలుగా ఎంచుకుని ఆచరిస్తున్న కొన్ని విలువలు, నమ్మకాలపై మనకు ఉండే అచంచలమైన విశ్వాసం.
ప్రకృతి ఎంత చిత్రమైనదీ, ఎంత పెంకిదీ అంటే, మనవిశ్వాసాలనూ ఎప్పుడూ పరీక్షకు పెడుతూ, మనం ఓడిపోయినప్పుడల్లా, మన నమ్మకాలకి వ్యతిరేకంగా ఉన్నదే నిజమేమో, మనం పొరబడ్డామేమో అనుకుని మన బలహీన క్షణాల్లో మన ప్రస్తుత విశ్వాసాన్ని విడిచిపెట్టి దానికి వ్యతిరేకమైన అభిప్రాయాన్ని, లేదా నమ్మకాన్ని అక్కునచేర్చుకునేలా చేస్తుంది. పోనీ అక్కడితో ఊరుకుంటుందా? మరుక్షణంలో, మనం విడిచిపెట్టిన విశ్వాసమే సరియైనదని ఋజువుచేస్తూ మనముందు వరుసపెట్టి అనేకమైన దాఖలాలు ఉంచుతుంది మనల్ని tease చేస్తూ, తిరిగి అభిప్రాయాన్ని మార్చుకుంటామేమోనని పరీక్షించడానికి.
ప్రకృతిని మించిన నిర్దాక్షిణ్యమైన శిక్షకుడు ఎవరూ ఉండరు.
.
హుఁ! దేముడికోసం పనిచెయ్యడం మహా కష్టం,
అతనికోసం నిలబడి, భూమిమీద
అతని తరఫున పోరాడినపుడు
ఒకోసారి ధైర్యం కోల్పోతాం.
అసలు దేముడే లే డనిపించేట్టుగా
ఒకోసారి చాలా చిత్రంగా దాక్కుంటాడు.
దుర్మార్గపు శక్తులన్నీ మనల్నిచుట్టుముట్టినపుడు
కంటికి కనిపించకుండా మాయమైపోతాడు.
లేదా, ఇకమనం ఓడిపోకతప్పదన్న క్షణంలో
మనల్ని ఒంటరిగా విడిచి దిక్కులేనివాళ్లను చేస్తాడు
అతని అవసరం మనకి ఎప్పుడు ఎక్కువనుకుంటామో
అప్పుడే మనలని మన మానాన్న విడిచిపెడతాడు.
అధర్మం ధర్మాన్ని ఓడిస్తుంది. మంచి
అతిసుళువుగా చెడుగా మారిపోతుంది;
అన్నిటికంటే కనికిష్టం, మంచికీ
మంచికీ ఎన్నడూ పొత్తుకుదరదు.
దేముడు మన భావనలకి అతీతుడు;
అతని ఆలోచనలు మన తర్కానికి
అందుబాటులో లేనంత ఉత్కృష్టమైనవి.
పసిపిల్లలంతప్రేమతోనే అందుకోగలం.
ఓ భగవంతుని సేవకులారా! ధైర్యంకోల్పోవద్దు.
దేముడు ఏ రూపంలో ఉంటాడో తెలుసుకోండి;
అప్పుడే మీకు అత్యంత నిస్సహాయ స్థితిలో
అతనికోసం ఎక్కడ వెతకాలో తెలుస్తుంది.
భగవంతుడు కంటికి ఎక్కడా కనరానప్పుడు
మనతోపాటే యుద్ధభూమిలో పోరాడుతున్నాడని
తెలుసుకోగల సహజలక్షణం
కలిగిన వ్యక్తి ముమ్మారు ధన్యుడు.
నిజమైన ధర్మం ఎటు ఉందో
సరిగా కనిపెట్టగలిగినవాడే ధన్యుడు,
అప్పుడే, పొరలుకమ్మిన మనిషి కంటికి
తప్పనిపించినా, ఆ పక్షం చేరి పోరాడతాడు.
దేముడు దేముడే; గనుక ధర్మమెప్పుడూ ధర్మమే;
వర్తమానంలో ధర్మమెప్పుడూ జయించాలి;
శంకించడం అంటే అవిధేయత,
తప్పటడుగువెయ్యడం … పాపంచెయ్యడమే.
.
ఫ్రెడెరిక్ విలియం ఫేబర్
(28 June 1814 – 26 September 1863)
ఇంగ్లీషు కవి.


వ్యాఖ్యానించండి