ప్రభూ! నా జీవితం ఆహ్లాదకరమైన
రాజమార్గంలా ఉండాలని నిన్ను అభ్యర్థించను;
ఆ భారంలో లవలేశమైనా
నిన్ను భరించమని కోరను;
నా పాదాలక్రింద ఎప్పుడూ
పువ్వులు విరియాలని నిన్ను అడుగను;
వెగటుపుట్టేంత తియ్యగా ఉండే జీవితంలోని
విషాదమూ, చేసే గాయాలూ నాకు బాగా అనుభవమే.
ప్రభూ! పరమాత్మా! నేను నిన్ను కోరుకునేదొక్కటే:
శరీరంలో శక్తి సన్నగిల్లనీ, హృదయం రక్తమోడనీ
శాంతికిరణపు వెలుగులో
నేను సరియైన దారిలో నడవగలిగేలా అనుగ్రహించు!
ప్రభూ! ఇక్కడ నీ పరిపూర్ణమైన వెలుగులు
ప్రసరించాలని కూడా అభ్యర్థించను;
నేను నిర్భయంగా నడవగలిగేలా
ఒకే ఒక్క శాంతికిరణాన్ని అనుగ్రహించు. చాలు!
నేను మోస్తున్న బరువును అర్థంచేసుకోమని గానీ
నా మార్గాన్ని కనిపెట్టమని గానీ వేడుకోను;
చిమ్మచీకటిలోకూడా నిన్ను అనుసరించగలిగేలా
నీ చేతిస్పర్శను అనుభూతిచెందే కనీస జ్ఞానాన్నివ్వు.
సంతోషం తీరికలేకుండా గడిచే రోజు లాంటిది
కానీ దివ్యమైన ప్రశాంతత కలతలులేని రాత్రి వంటిది:
ఓ ప్రభూ! ఆ పవిత్రమైన రోజు వచ్చేదాకా
శాంతి కిరణపు వెలుగులో నన్ను నడిపించు!
.
ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్,
(30 October 1825 – 2 February 1864)
బ్రిటిషు కవయిత్రి

వ్యాఖ్యానించండి