నా కృతజ్ఞతలు … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి
నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఉండేవాడు
తర్వాత నేను మామూలు మనిషిని కాలేకపోయాను.
నన్ను అంతలా మార్చిన ఆ చెలిమికి కృతజ్ఞతలు.
అతని పేరు నేను చెప్పను.
అతనిప్పుడు నాకొక ప్రతీక
పువ్వులనాలన్నా, రువ్వలనాలన్నా.
సంగీతానికీ అతను ఒక ప్రతీక
భగ్నవీణ కీ అతనే.
అతన్ని ఒక పుస్తకంద్వారా తెలుసుకున్నాను
ఎన్నడూ చెయ్యీ చెయ్యీ కలిపింది లేదు.
అతనిప్పుడు లేడు…అతని కోసం
ఏ పచ్చని చేలల్లోనూ వెతకక్కరలేదు.
స్వర్గం ఉండకపోవచ్చు. నాకు నమ్మకం లేదు,
కానీ నాకో చిన్న కోరిక ఉంది…
నా కడపటి శ్వాస తర్వాత నా ఆత్మ
నన్ను కెరటంలా మీదకి ఎత్తి
చుక్కల్లోకి తీసుకుపోయి ప్రకటించాలి,
అతని స్నేహం స్వర్గ తుల్యం అని;
అతని జీవితాన్ని కమ్ముకున్న మేఘాలు తొలగి
ఇప్పటికైనా వెలుగు ప్రసరించాలని ప్రార్థించాలి.
అతను నా యవ్వనంలో ఎంతగా ప్రకాశించేవాడంటే
పరిగెత్తడం నేర్చుకుని ఆనందించానని చెప్పాలి!
అతన్ని ఒక చిట్ట చివరి కోరిక కోరాలి…
ఒక్క సారి తన గొంతు వినిపించమని.
నన్ను అమితంగా కదిలించిన వ్యక్తి ఉండేవాడు
నేను మునపటి మనిషిని కాలేకపోయాను;
నేనూ ప్రార్థిస్తాను, నేనూ ఎవరో ఒకరి హృదయాన్ని
చురుక్కు మనే మంటలా స్పృశించగలగాలని!
వ్యాఖ్యానించండి