పగలల్లా గాలి రొద వింటూనే ఉన్నాను
అది ఏమి చెప్పదలుచుకుందో దానితో సహా.
రాత్రల్లా గాలి చేసిన చప్పుళ్ళు విన్నాను
పోరాటానికి పోతూ అదిచేసిన హాహాకారాలతో సహా.
గాలి ఆగగానే వర్షమూ
వర్షం ఆగగానే గాలీ
కొండమీద దాడి చెయ్య సాగేయి
అది మాత్రం నిశ్చలంగా ఉంది.
పగలల్లా సముద్రం
నేలని స్థిరంగా ఉండనీలేదు,
రాత్రల్లా నేలమీదకి సముద్రంలోని
ఇసక అంతా పోగుపెడుతూనే ఉంది
రాత్రంతా అది తెల్లగా
మెరవడం చూశాను
ఘోరమైన దాని జుత్తు విరబోసుకుని
ఇప్పటికీ… ఇంకా…
పగలల్లా ఆ కొండకి
గాలి ఎంత బలంగా తాకుతుందో తెలిసింది;
రాత్రల్లా ఆ కొండ
సముద్రపు పోటుని తట్టుకుంది;
కిటికీలోంచి చూస్తున్న నాకు
సందేహమూ ఆశ్చర్యమూ కలిగేయి:
అంత బలమైన శక్తులు అంతసేపు
సమ ఉజ్జీ అయిన బలిమితో తలపడాలా అని.
.
జాన్ మెయిస్ ఫీల్డ్
1 June 1878 – 12 May 1967
ఇంగ్లీషు కవి

వ్యాఖ్యానించండి