హాయిగా కూచుని ప్రపంచానికి
ఉత్తర్వులిచ్చే దేవతలారా!
నాకు ఆకలి, బాధా, లేమీ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి;
కీర్తీ, సంపదల దర్వాజాలనుండి నన్ను
పరాజయ, పరాభవాలతో వెలివేయదలుచుకుంటే వెలివెయ్యండి;
ఎంత దీనమూ, కఠినమైన దారిద్ర్యాన్నివ్వాలనుకుంటే ఇవ్వండి.
కానీ, కొంచెం ప్రేమని మాత్రం నాకు మిగల్చండి.
రోజు ముగిసిన పిదప మాటాడుకుందికి మరో మనిషినివ్వండి,
మేరలేని ఏకాంతాన్ని పారదోలుతూ
చీకట్లో నన్ను అనునయంగా తడమగల ఒక హస్తాన్నివ్వండి.
సూర్యాస్తమయ దృశ్యాలు
సంధ్యాచిత్రాన్ని మసకపరుస్తున్న వేళ
దారితప్పి తిరుగుతున్న ఒక చిన్ని పడమటి చుక్క
క్రీనీడల అంచుల్లోంచి తొంగి చూస్తోంది.
మనసా! పద, కిటికీ పక్కకి నడుద్దాం.
సంజవెలుగుల్లో జీరాడుతున్న పొద్దు నీడల్ని
అక్కడనుండి గమనిస్తూ
ఒక చిన్నపాటి ప్రేమ రాకకై
ఆశగా ఎదురుచూద్దాం.
.
కార్ల్ సాండ్ బర్గ్
వ్యాఖ్యానించండి