చవకబారు సత్రం….ఛార్లెస్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి
చవకబారు సత్రంలో
నువ్వు ఎన్నడైనా ఉండి ఉండకపోతే
నీకు జీవితం అంటే ఏమిటో తెలియనట్టే…
అక్కడ ఒక్కటే బల్బూ
56 మంది మనుషులూ
మంచాలమీద ఇరుక్కుంటూ…
అందరూ ఒకేసారి గురకపెడుతూ;
అందులో కొందరి గురక
నమ్మలేనంత
దీర్ఘంగా,
గట్టిగా
ఘోరంగా
అమానుషంగా ఉండి
సాక్షాత్తూ
నరకంనుండి
వస్తున్నాయా అనిపిస్తుంది.
ఆ మృత్యుఘోషని
మరపించే గురకకి
దానితో కలగలిసిన
దుర్గంధానికీ
నీకు మతిపోయినంత
పనిజరుగుతుంది:
ఎన్నడూ
ఉతికి ఎరగని మేజోళ్ళూ
మలమూత్రాల
వాసన పట్టెసిన
లో దుస్తులూ
వాటిమీదనుండి
మూతలేని
పెంటబుట్టలమీద నుండి
వచ్చే దుర్వాసనలా
అక్కడక్కడే
తిరుగుతున్న గాలి;
చీకట్లో
కొన్ని సన్నగా
కొన్ని లావుగా
కొన్ని వంగీ,
చేతుల్లేనివీ,
కాళ్ళు లేనివీ
మతిలేనివీ
శరీరాలు,
అన్నిటికీ మించి
వాటిలో
ఎక్కడా
ఏ కోశానా
ఆశ అన్నఊసులేకుండా
కప్పి ఉన్న నిరాశ.
వాటిని
భరించడం కష్టం.
నువ్వులేచి
బయటకి పోతావు
వీధుల్లో
కాలిబాటల్లో
అటూ ఇటూ
పచార్లు చేస్తూ,
సందు మలుపులోని
భవనాలు దాటీ
తిరిగిన వీధే
తిరుగుతావు
ఆ మనుషుల గురించి
ఆలోచిస్తూ:
వీళ్ళంతా ఒకప్పుడు
పిల్లలే గదా
వీళ్ళకేమయింది?
అసలు నాకేమయింది?
వ్యాఖ్యానించండి