కాగితం మీద సంతకం చేసిన హస్తం ఒక నగరాన్ని పడగొట్టింది,
సర్వాధికారాలు గల ఐదువేళ్ళూ ఊపిరిని కప్పం కట్టమన్నాయి
ఒక దేశజనాభా సగానికి తగ్గించి, మృతులప్రపంచాన్ని రెట్టింపుచేసింది,
ఈ ఐదుగురు రాజులూ, మరో రాజుని మట్టుపెట్టారు.
ఆ శక్తిమంతమైన హస్తం వాటమైన భుజానికి చేర్చుతుంది
వేళ్ళకణుపులు సున్నంతో బిరుసెక్కాయి;
ఒక బాతు ఈక కలం హత్యల్ని పరాకాష్ఠకి తీసుకెళ్లింది
అది వాక్స్వాతంత్ర్యానికి భరతవాక్యం పలికింది.
ఒడంబడికపై సంతకం చేసిన హస్తం ఒక ఆవేశాన్ని రగిలించింది,
కరువు విజృంభించింది, మిడతలదండు వాలింది
ఒక పేరు గెలకడంద్వారా
ఒక దేశాన్ని శాశించగల హస్తం గొప్పదే మరి!
ఈ ఐదుగురు చక్రవర్తులూ మృతుల్ని లెక్కిస్తారు గాని,
కరుడుగట్టిన గాయాన్ని మాన్పనూలేరు, నొసటిచెమట తుడవనూలేరు;
ఒక హస్తం స్వర్గాన్నేలితే, ఇంకొక హస్తము రాజ్యం చేస్తుంది.
అయినా, హస్తానికేముంది, కార్చడానికి దానికి కన్నీళ్ళుండవు కదా!
.
డిలన్ థామస్,
27 అక్టోబరు 1914 – 9 నవంబరు 1953
వెల్ష్ కవి
.

వ్యాఖ్యానించండి