బాబ్! లాయర్లకి చాలా ఎక్కువ తెలుసు.
వాళ్ళు జాన్ మార్షల్ పుస్తకాలకు సహపాఠులు.
వాళ్లకి అన్నీ తెలుసు, చనిపోయినవాడు ఏమిటిరాసేడో
బిగుసుకున్న మృతహస్తం, కూలుతున్న వేలి కణుపులూ,
మెత్తగా, తెల్లగా పొడిలా రాలుతున్న చేతి ఎముకలూ.
లాయర్లకి బాగా తెలుసు
చనిపోయినవాడి మనసులోని మాట ఏమిటో.
బాబ్! గీచి గీచి బేరమాడే లాయర్ల మాటల్లో
‘అయితే’లు, ‘కానీ’లు, ‘అయినప్పటికీ’లు సులభంగా జారుతాయి.
చాలా ‘ఇంతకుముందు చెప్పినప్పటికీ’లు …
రావడానికీ పోవడానికీ చెప్పలేనన్ని ద్వారాలు.
బాబ్! లాయర్లు పని పూర్తిచేసేరంటే,
ఇంకేమిటి మిగులుతుంది చెప్పు?
ఒక ఎలుక కొరకడానికి ఏమైనా ఉంటుందా?
పంటికి చుట్టడానికి ఏమైనా మిగులుతుందా?
లాయర్లు సొమ్ముచేసుకున్నప్పుడు ఎప్పుడూ
ఎందుకు రహస్యంగా పాటలు వినిపిస్తాయి?
లాయరు శవపేటిక లాగుతున్న గుర్రం
ఎందుకు హేళనగా శకిలిస్తుంది?
ఇటుకలు పేర్చేవాడి పని ఆకాశాన్ని తాకుతుంది;
ఒక భవనం నిర్మించేవాడి పని, ఆచంద్రార్కం ఉంటుంది;
రైతు దున్నే నేల అతను మళ్ళీ రావాలని కోరుకుంటుంది.
పాటలు పాడే వాళ్ళూ, నాటకాలు రాసేవాళ్ళూ
ఏ గాలీ కూల్చలేని ఇళ్ళు కట్టగలరు.
కానీ లాయర్లు… ఒక విషయం చెప్పు,
ఒక లాయరు శవాన్ని లాగుతున్న గుర్రం
ఎందుకు హేళనగా శకిలిస్తుంది?
.
కార్ల్ సాండ్ బర్గ్
January 6, 1878 – July 22, 1967
అమెరికను కవి.
.

వ్యాఖ్యానించండి