కాలం ఏ ఉపశాంతీ ఇవ్వదు; మీరుచెప్పినదంతా పచ్చి అబద్ధం.
కాలమే నా బాధని మాన్పుతుందని చెప్పిందెవడు?
ఈ హోరుమంటున్న రాత్రిలో అతని తోడులేమి వెలితే.
సముద్రం ఆటులో ఉన్నప్పుడు తను నాప్రక్కనుంటే బాగుణ్ణు
ప్రతి కొండ వాలులోనూ మంచు కరిగి ప్రవహిస్తోంది.
క్రిందటేడువి ఆకులు ప్రతివీధిలో దర్శనమిస్తున్నాయి;
కానీ, ఆలోచనలలోనే మిగిలిన క్రిందటేటి గాఢమైన ప్రేమ
నా గుండెల్లో భద్రంగా పేరుకుంది.
నేను వెళ్ళడానికి భయపడే స్థలాలు వంద.
ఎందుకంటే అవన్నీ అతని జ్ఞాపకంతో పొర్లుతుంటాయి.
ప్రశాంతతకోసం, అతని పాదం మోపనీ, కనులు చూడని
ఏకాంత ప్రదేశం వెతుక్కుని వెళ్ళవలసి వస్తోంది.
“హమ్మయ్య ఇక్కడ అతని జ్ఞాపకాలు లేవు,” అనుకుంటానా
మళ్ళీ అతన్నే తలుచుకుంటూ అక్కడ బాధతో నిలబడిపోతాను.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
22 ఫిబ్రవరి 1892 – 19 అక్టోబరు, 1950)
అమెరికను కవయిత్రి, నాటక రచయిత, స్త్రీవాది.
.

వ్యాఖ్యానించండి