మా మిత్రుడు పియానోదగ్గరకి వెళ్ళి, స్టూలు
కొంచెం ఎత్తుగా చేసుకుని, నోట్లో పైపుని పక్కనబెట్టి,
అల్మారాలోంచి ఒక లావుపాటి పుస్తకం ఎంచుకున్నాడు;
దాన్ని ఠప్ అని అసహనంగా తెరిచాడు.
అతని వేళ్ళు అలవోకగా మెట్లమీద పరుగులుతీసాయి
కత్తులు దూసుకుంటున్నట్లు…
ఆటవికదళాల మొరటు డప్పుదరువులకనుగుణంగా
ఆయుధాలను ఝళిపిస్తూ, పిడుగులు వర్షించినట్టు పెడబొబ్బలు పెడుతూ,
అకస్మాత్తుగా ‘గాలి కోట’మీద సేనల దాడి ప్రారంభమైంది…
మెరుపులు కదంతొక్కుతున్నాయో అన్నట్టు కవాతుచేస్తూ
భీతిగొలిపే పతాకాలతో, హతమార్చి తగలెయ్యడానికి దివిటీలతో
తుఫానుమేఘాల్లా జరజరా పాకుతూ….
మెరుస్తున్న శిరస్త్రాణాలతో, రధాల గణగణలతో,
భయంకరమైన పాతకాలపు యుద్ధాలని తలపింపజేస్తూ…
కొమ్ము బూరాల ధ్వనుల నేపధ్యంలో.
అవి రాజసంగా నిష్క్రమించాయి ముందుకి
అందినంతమేరా ఆక్రమించుకుంటూ, తొక్కుకుంటూ…
చీకటిని చీల్చుతున్న మండే కరవాలంలా
ఆ జ్వాల, మన జీవితాలని ఒక ఉదాత్తమైన వేడుకగా మారుస్తూ !
ఈ సంగీతలహరి
మనిషి ఒంటరిపోరాటాన్ని వమ్ముచేసి, అతని
పూర్ణ దాస్యానికి అంగీకరిస్తూ వేసే లక్కముద్ర:
నగరాల్ని జయించి, వన్నెవన్నెల సాగరాల్ని దాటి,
వచ్చిన ఈ గాలి సాహసగాధని పచ్చికబీళ్ళలో పాడుతున్నారు;
బలహీనమైన చేతికిజవాన్నీ, మనసుకి నిబ్బరాన్నీ ఇచ్చి
చేతకాని మాటలనుండి చేవగలపనులకి మళ్ళించగలదు
నిలువునా ధైర్యంతో నింపి!
వీణని కుదుపుతూపోయిన పిల్లగాలిలా
ఆ చివరి స్వరం నాకు వాడిగా తగిలి
నన్ను కుదిపింది భయంకరంగా.
మా మిత్రుడు మళ్ళీ స్టూలు మావైపు తిప్పుకున్నాడు.
దేవలోకంలో విహరిస్తున్నమేము నేలమీదికి దిగాం.
“ఎంత బాగుంది!” అని ముక్త కంఠంతో అన్నాము;
అని మళ్ళీ యధాప్రకారం మా మాటల్లో మేము మునిగిపోయాం.
.
స్టీఫెన్ విన్సెంట్ బెనెట్
జులై 22, 1898 – మార్చి 13, 1943
అమెరికను కవీ, రచయితా.
.

వ్యాఖ్యానించండి