రాతి మీది నాచు… జోస్ మెండోంకా, పోర్చుగీసు కవి

సాహసయాత్రికులూ, దేశదిమ్మరులూ,

ఎన్నడో అదృశ్యమైపోయారనుకుంటున్న యాత్రీకులూ,

బెర్బరులూ, ఆలమందలుతోలుకునే సంచార జాతులూ,

దేశబహిష్కృతులూ…

క్షణక్షణమూ

ఎదురయ్యే

ఊహించలేని అవసరాలు కాక

పవిత్రగ్రంధాలే ధర్మశాస్త్రాలుగా భావించే

మనలాటివాళ్ళకి ఏమి చెప్పగలరు?

మన చైతన్య పరిధికి అతీతంగా, వాళ్ళు వసించే చోటులలో

ఒక ప్రేతాత్మల భాష ఉంది

అది ఏ భాషా చెప్పలేని విషయాలు

చెబుతుంది:

నక్షత్రాలు ఒకదాన్నొకటి ఢీకొన్నపుడు

వెలుగుతునకలు పుడతాయనీ;

తరుము కొస్తున్నపుడు జింక పిల్ల

ఎన్నో అక్షరాల సోయగాలతో పరుగెడుతుందనీ;

అఖండ హిమపాతము తర్వాత,

మొనదేలిన పర్వత సానువులకి పచ్చదనం

పునరాగమిస్తుందనీ…

.

జోస్ మెండోంకా

(15th Dec 1965 –  )

పోర్చుగీసు కవి.

(Translated by Richard Zenith from Portuguese).

(Copyrighted Material. Visit the source.

http://www.amazon.com/New-European- Poets…/dp/1555974929#reader_1555974929)

పైన పేర్కొన్న సంకలనంలో కొన్ని అనువాదాలు ఏమీ బాగులేవు. అందులో కవి ఏమి చెప్పదలుచుకున్నాడో ఊహించలేకపోయాను. అందులో ఇంగ్లీషు కూడా సవ్యంగా లేదు. (ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

రాతిమీద నాచుని  ఒక మెటఫర్ గా తీసుకుని  కవి ఏమి చెప్పదలుచుకున్నాడు ఈ కవితలో?

అనువాదం బాగుండడం వల్ల, ఈ కవితలో కొంత పారదర్శకత కనిపిస్తుంది. మూలం కొంతలో కొంత సులభంగానే ఊహించుకో వచ్చు.  రాతి మీద నాచు ఎన్నాళ్లయినా అక్కడే పట్టి ఉంటుంది.  అలా మనం మనం మతగ్రంధాలని దైవశాసనాలుగా భావిస్తున్నాం తప్ప, నిత్యం మనకు ఎదురవుతున్న సవాళ్ళకి (అవసరాలకి) తగినట్టుగా వాటిని మర్పుచేసుకోలేక (లేదా అన్వయించుకోలేక) పోతున్నాం.  వాటిని శిలాశాసనాలుగా తీసుకోనక్కరలేదనీ, కాలానికి తగ్గట్టుగా వాటిని అన్వయించుకోవడమో, మార్పుచేసుకోవడమో చెయ్యాలనీ కవి భావనగా నేను అర్థం చేసుకున్నాను. కవితలో పేర్కొన్న వాళ్ళందరూ  చూపించిన లక్షణం నిరంతర చైతన్యం, ప్రకృతిని తమకు అనుకూలంగా మలుచుకుంటూ, తమని దానికి అనుకూలంగా సర్దుకోవడం.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.