రోజులెందుకున్నాయి?
మనం బ్రతికేది వాటిలోనే.
అవివస్తుంటాయి, పదేపదిసార్లు
మేల్కొలుపుతూ ఉంటాయి.
మనం సుఖంగా బ్రతకవలసింది అందులోనే.
వాటిలో తప్ప ఇంకెక్కడ మనం బ్రతకగలం?
ఆహ్! ఈ సమస్యకి సమాధానం కనుక్కోడమే తడవు
వైద్యుడూ, పురోహితుడూ
వాళ్ళ వాళ్ళ పొడవాటి దుస్తుల్లో
పొలాలంబడి పరిగెత్తుకుంటూ వస్తున్నారు.
.
ఫిలిప్ లార్కిన్
9 ఆగష్టు 1922 – 2 డిశంబరు 1985
ఇంగ్లీషు కవీ, నవలాకారుడూ, గ్రంధాలయాధికారి.
ఈ కవితలో చివరి పాదాల్లో చూపించిన చమత్కారంతో దీని సౌందర్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక్కడ పురోహితుడంటే అపరకర్మలు చేసే పురోహితుడుగానే తీసుకోవాలి. మనం “జీవితం ఇక్కడే జీవించాలి , ఇక్కడ సుఖపడటం తప్ప వేరే మార్గం లే”దన్న సత్యం తెలుసుకోగలిగితే, మన ఆరోగ్యమూ కుదుటపడుతుంది, మనకి వైద్యుడి అవసరమూ ఉండదు, పురోహితుడి అవసరమూ ఉండదు. మనుషులకి ఆ ఎరుక లేనంతకాలమే వాళ్ళ వృత్తి లాభసాటిగా నడుస్తుంది. ప్రజలకి ఈ తెలివికలిగితే, వాళ్లకి జీవిక దొరకదు. అందుకనే వాళ్ళు పుంజాలుతెంపుకుంటూ పొలాలవెంబడి పరిగెత్తుకొస్తున్నది. అదే ఈ కవితలోని చమత్కారం.
.
Philip Larkin
.
Days
.
వ్యాఖ్యానించండి