నువ్వో కవిత కావాలంటావు
నీకో గడ్డిపరక అందిస్తాను.
నువ్వు అదేం బాగులేదు
కవితని ఇవ్వమని అడుగుతావు.
ఈ గడ్డిపరక సరిపోతుందిలే,
ఇది చక్కని మంచువలిపాలు చుట్టుకుంది
నేను రాయబోయే ఏ ప్రతీకకన్నా
ఇది చాలా సన్నిహితమూ, పరిచయమైనదీను అంటాను.
“ఇది కేవలం గడ్డిపరకంటే గడ్డిపరక
అసలిది కవిత్వం కానే కాదు
ఇదెంతమాత్రం సరిపోదు,” అంటావు.
నేను నీకు గడ్డిపరకనే ఇస్తాను.
నీకు చాలా కోపం వస్తుంది.
గడ్డిపరక ఇవ్వడం సులభం అంటావు.
ఇది అర్థ రహితం.
గడ్డిపరక ఎవడైనా ఇస్తాడంటావు.
నువ్వు కవిత ఇవ్వమని అడుగుతావు.
నేను గడ్డిపరక ఇవ్వడం
రాను రాను ఎంతకష్టమో
ఒక విషాదాంత కావ్యం రాస్తాను.
వయసు పెరుగుతున్న కొద్దీ
ఒక గడ్డిపరకని స్వీకరించడం
ఎంతకష్టమో కూడా రాస్తాను.
.
బ్రయన్ పాటెన్
7 ఫిబ్రవరి 1946
ఇంగ్లీషు కవి
.
ఈ పద్యంలో నాకు అర్థమయినంతవరకు, చమత్కారం గడ్డిపరకని ప్రతీకగా తీసుకుని, చివర ఇచ్చిన ముగింపులోఉంది. గడ్డిపరక ఒక సామాన్య జీవితానికి ప్రతీక. సామాన్య జీవితం కవితా వస్తువు కాదన్నది అనూచానంగా వస్తున్న అపోహ. జీవితంలోని సంక్లిష్టత, సామాన్య జీవనం ఎంత అరుదుగా ఉంటుందో చెప్పడమే గడ్డిపరక ఇవ్వలేకపోవడం అన్నది విషాదాంత కావ్యంగా రాయడం. అంతే కాదు, గాడ్డి గొప్పగొప్ప సమాధులమీద కూడా మొలుస్తుంది. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ గడ్డిపరకని స్వీకరించలేకపోవడం. (ఒక రకమైన భయం.)
Brian Patten
Image Courtesy: http://www.walker.co.uk/walkerdam/getimage.aspx?class=person&id=2368&size=powerpoint
వ్యాఖ్యానించండి