యుద్ధభేరీ మ్రోగుతూ ఉంటుంది.
అది నినదిస్తుంటుంది: శత్రువు గుండెల్లో కత్తి దించమని.
ఒకరి తర్వాత ఒకరుగా బానిసలు
కత్తికి బలవుతూ ఉంటారు.
ఎందుకోసమని?
వివస్త్రయై *
ఆకలితో నేల అలమటిస్తుంది.
ఒక మారణహోమంలో
మనుషులు సమిధలుగా ఆహుతైపోతారు;
ఎందుకంటే
ఎవడో
ఎక్కడో
అల్బేనియాను స్వాధీనం చేసుకుంటాడు.
ఒకరిపట్ల ఒకరికిఉ విద్వేషంతో
మానవ సమూహాలు ఒకదాన్నొకటి చంపుకుంటాయి;
ఎందుకంటే
ఎవడివో నౌకలు
బోస్ఫోరస్ జలసంధిగుండా
ఉచితంగా ప్రయాణం చెయ్యగలుగుతాయి.
త్వరలో
ప్రపంచంలో
మనిషన్నవాడు మిగలడు;
నిర్దాక్షిణ్యంగా తొక్కివెయ్యబడతాడు;
ఎందుకంటే
ఎవడో
మెసొపొటేమియాని హస్తగతం చేసుకుంటాడు.
అసలు ఏ బూటైనా
నేలని ఎందుకు
కరుకుగా, నెర్రెలుపడేలా తన్నాలి?
యుద్ధాలకి ఆవల ఏమిటి లభిస్తుంది?
స్వాతంత్ర్యమా?
నిర్వాణమా?
ధనమా?
వాళ్ళకోసం ప్రాణత్యాగంచేసే
ఓ యోధుడా!
ఎప్పుడు నీకాళ్ళమీద నిటారుగా నిలబడతావు?
“మేమెందుకు యుద్ధం చేస్తున్నాం” అని
వాళ్ళని ఎప్పుడు నిలదీసి అడుగుతావు?
.
వ్లాడిమిర్ మయకోవ్ స్కీ
July 19 1893 – April 14, 1930
రష్యను కవీ, నాటక రచయితా, కళాకారుడూ, నాటక, సినీరంగ నటుడు.
(Notes:
వివస్త్రయై: సస్యశ్యామలమై నిండుగా ఉండవలసిందిపోయి, బీడుభూమిగా అని అర్థం.
బోస్ఫోరస్ జలసంధి: యూరోపు ఆసియా ఖండాల్ని కలుపుతూ (లేదా విడదీస్తూ) నల్లసముద్రాన్నీ, సీ ఆఫ్ మర్మరాని కలిపే టర్కీలోని జలసంధి. దీన్ని ఇస్తాన్ బుల్ జలసంధి అనికూడా పిలుస్తారు.
యుద్ధాన్ని నిరసిస్తూ రాసిన కవితల్లో ఇదొక మంచి కవిత. “ఎవడో ఒకడి స్వార్థం కోసమో, అధికారదాహానికో, పేరుప్రతిష్ఠలకో, అపురూపమైన ప్రాణాన్ని ఎందుకు త్యాగం చెయ్యాలి? ”
అన్న సందేశాన్ని ఇస్తోంది ఈ కవిత.
.

వ్యాఖ్యానించండి