నిశ్శబ్దం కన్నా మెల్లగా, నిలిచిపోయిన గాలికంటే నిశ్చలంగా
ఎత్తైనదేవదారువులనుండి జాలువారుతున్నాయి లేతఆకుల్లా…మంచుపరకలు.
ఈ అడవి నేలంతా వార్షికపు వరాన్ని అందుకుంటోంది
నిర్విరామంగా, ప్రశాంతంగా, సమృద్ధిగా కురిసే హిమపాతం రూపంలో.
చాలా సున్నితంగా తేలియాడుతూ, వయసుమీరిన ఆ గండశిలల్ని
అంత సున్నితంగానూ, సొగసుగానూ అలంకరిస్తున్నాయి.
శిశిరంలో పనలు పనలుగా రాలిన ఆకులుకంటే
వెలబోయిన పసుపురంగు వస్త్రాన్ని నేస్తున్నాయా
లేక, ఆ చిత్రమైన మంచుపుష్పాలు “విచ్ హేజిల్స్” (1) ని ధరిస్తున్నాయా?
పొడవైన చెట్లవరుసలోంచి సూర్యకిరణాలు అడ్డంగా దూసుకొస్తున్నై
ఆకాశంలో ఎక్కడో కాకులు రాత్రికి గూడుచేరుకుంటున్నాయి.
వాతావరణం మెత్తని సూదుల మయం; పాలపిట్ట ఒకటి
ఆ బంగరు పొగమంచులోంచి సంతోషంగా దూసుకు పోతోంది;
నవంబరు నెల గడిచేదాకా అలా రాలుతూనే ఉంటాయి
ఆ మంచు తూలికలు … లలిత లలితంగా తేలుతూ, తూలుతూ.
.
థామస్ వెంట్ వర్త్ హిగిన్సన్
(డిశంబరు 22, 1823 – మే 9, 1911)
అమెరికను కవి, సైనికుడు, బానిసత్వ నిర్మూలన వాది, యూనిటరీ క్రైస్తవ మతాధికారి.
Notes: విచ్ హేజిల్స్ (Witch-hazels) అన్నవి Hamamelidaceae Family కి చెంది, అమెరికా, చైనా, జపాను లలో శీతకాలంలో పూచే ఒక జాతి పూలచెట్లు. మరింత వివరాలకు ఇక్కడ చూడండి.
.

వ్యాఖ్యానించండి