రోజల్లా వీచే ఓ చిరుగాలీ!
బిగ్గరగా ఆలపించు చిరుగాలీ!
గాలిపటాలు మీదకి ఎగరెయ్యడం చూశాను
ఆకాశంలోకి పక్షుల్ని ఎగరేసుకుపోవడం చూశాను
నా చుట్టూ నువ్వు వీస్తున్న చప్పుడు విన్నాను…
ఆడవాళ్ళ పరికిణీలు గడ్డిమీద చప్పుడు చేసినట్టు.
రోజల్లా వీచే ఓ చిరుగాలీ!
బిగ్గరగా ఆలపించు చిరుగాలీ!
నువ్వు చేసే చాలా పనులు చూశాను
కానీ ఎప్పుడూ నిన్ను నువ్వు దాచేసుకుంటావు
నువ్వు నన్ను తొయ్యడం తెలుస్తోంది, నీ పిలుపూ వినిపిస్తోంది
కానీ నాకంటికి నువ్వు ఏమాత్రం కనిపించడం లేదు.
రోజల్లా వీచే ఓ చిరుగాలీ!
బిగ్గరగా ఆలపించు చిరుగాలీ!
ఎంతో బలంగా, శీతలంగా ఉండే నువ్వు,
జోరుగా వీచే నువ్వు ఇంతకీ పిన్నవా? పెద్దవా?
చెట్లూ మైదానాలలో స్వేచ్ఛగా చరించే మృగానివా
లేక నాకంటే బలశాలివైన ఒక చిరుకూనవా?
.
రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ ,
13 నవంబరు 1850 – 3 డిశంబరు 1894)
స్కాటిష్ కవీ, రచయితా, వ్యాసకర్తా, యాత్రా కథకుడు.
.

వ్యాఖ్యానించండి