రెండు ఎదురెదురు దేహాలు
ఒక్కోసారి ఎగసిపడేకెరటాలు
రాత్రి ఒక మహాసాగరం
రెండు ఎదురెదురు దేహాలు
అపుడపుడు రెండు పెద్ద బండరాళ్లు
రాత్రి ఒక విశాలమైన ఎడారి
రెండు ఎదురెదురు దేహాలు
ఒక్కొసారి రెండు రాత్రిలోకి
చొచ్చుకుపోయిన రెండు పిల్లవేర్లు
రెండు ఎదురెదురు దేహాలు
అపుడపుడు రెండు కత్తులు
రాత్రి పూట నిప్పురవ్వలు రాలుస్తాయి
రెండు ఎదురెదురు దేహాలు
శూన్యాకాశం నుండి నేలకు
రాలిపడే రెండు ఉల్కలు.
.
ఆక్టేవియో పాజ్
(March 31, 1914 – April 19, 1998)
మెక్సికన్ కవి
.
ఈ కవిత చక్కని ప్రతీకలతో ఒక అద్భుతమైన తాత్త్విక ప్రయోజనాన్ని నెరవేరుస్తోంది. పదాల గాంభీర్యతగాని, విశేషమైన భావనలూ, సాంకేతిక పదాలుగాని, అన్వయక్లిష్టతగాని ఏమీ లేవు. ఉన్నవి రెండు దేహాలు ఎదురెదురుగా… అవి ఎన్ని రకాలుగా ప్రవర్తించగలవో పెద్దవ్యాఖ్యానం ఏమీ లేకుండా కవి చెప్పగలిగేడు… ఆయా సందర్భానికి తగిన ప్రతీకలతో. అనురాగమూ, నిర్లిప్తతా, సహ అనుభూతి, వైరమూ, మొదలైన అన్ని రకాల నుభూతులకూ లోనై చివరకి రెండు అనంత విశ్వంలోకి ఉల్కల్లా రాలి అంతం కావడమూ జరుగుతుంది.
కవులందరూ చెప్పేది ఒకటే… ఈ ప్రపంచాన్ని అవగాహనచేసుకుందికి మన అస్తిత్వాన్ని గురించిన అవగాహన మనకి ఉండాలి; చివరకి, మన జీవితానికి అర్థం ఈ అస్తిత్వంతోనే నశిస్తుంది. ప్రకృతి మనకి ఒక ప్రతీక… “బాహ్యసంబంధి” (Objective corrélative). అంటే, దానివల్లనే మనకి మన అస్తిత్వంగురించిన అవగాహన కలుగుతుంది. దాన్ని వేరుగా చూడగలగడము మన ఉనికి తెలియజేస్తే, మనం అందులో అంతర్భాగమే అని తెలుసుకోవడం ఈ శరీరం యొక్క ఆశాశ్వతత్వం గురించీ, ఈ ప్రకృతిలో అనాదిగా, నిర్లిప్తంగా జరిగే సహజ ప్రక్రియగురించీ మంచి అవగాహన కల్పిస్తుంది. ఈ అవగాహన మనల్ని భయపెట్టడానికి, నిర్వీర్యులనీ చెయ్యడానికి కాకుండా, మనకున్న చైతన్య పరిధిలో, మనకి ఇష్టమైన పనులు, మనకి ఏవి మంచి అనితోస్తే అవి, చెయ్యగల స్వేఛ్ఛలో, మనం పనిచెయ్యడానికి కావలసిన వినమ్రత (Humilty) ప్రసాదిస్తుంది.
కవికి తార్కిక చింతనతో పాటు, తాత్విక చింతన కూడా అవసరమే అని చెప్పే చిన్న కవిత ఇది.

వ్యాఖ్యానించండి