అదిగో, వరదనీటిమీది తాత్కాలిక వంతెనప్రక్కన
వేసవి తొలి గాలులకు వాళ్లజండా రెపరెపలాడుతూ ఎగిరింది;
ఒకప్పుడు యుద్ధానికి సన్నద్ధులై రైతులు నిలబడిందిక్కడే
వాళ్ళు పేల్చిన తుపాకిగుండు ధ్వనే ప్రపంచమంతా మారుమోగింది.
శత్రువేనాడో చప్పుడులేని నిద్రలోకి జారుకున్నాడు
గెలిచినవీరులూ అలాగే శాశ్వతంగా నిద్రిస్తున్నారు;
కాలప్రవాహం ఆ శిధిలమైన వంతెనను కొట్టుకుపోయింది
సముద్రము వైపు పారే నల్లని ఉప్పుటేరురూపంలో.
పచ్చని ఈ ఒడ్డున, నిలకడగా పారే సెలయేటి తీరాన
మనమీ రోజు ఈ స్మృతి ఫలకాన్ని నిలబెడుతున్నాం;
వాళ్ళు చేసిన త్యాగాలకు మరచిపోలేని గురుతుగా నిలిచేలా
మన తాతలే కాదు, మన పిల్లలు గతించిన తర్వాతకూడా
వాళ్ళు చనిపోయినా, వాళ్ళపిల్లలు స్వతంత్రులుగా మనడానికి
ఏ స్ఫూర్తి వాళ్ళని ఆలా సాహసించడానికి పురికొల్పిందో
ఆ స్ఫూర్తే వాళ్ళకోసం మనమీనాడు నిలబెట్టిన ఈ చిహ్నం
చెక్కుచెదరకుండా నిలబెట్టమని కాలాన్నీ, ప్రకృతినీ వేడుకుందాం.
.
రాల్ఫ్ వాల్డో ఎమర్సన్
(May 25, 1803 – April 27, 1882)
అమెరికను కవి, వ్యాసకర్త.
.

వ్యాఖ్యానించండి