నా భవిష్యత్తుని నమ్మి నీకు అప్పగించే ముందు,
లేక నీ చేతిలో చెయ్యి వేసే ముందు,
నీ భవిష్యత్తు నా భవిష్యత్తుని
రంగుల్లో రూపించే అవకాశం ఇచ్చే ముందు
నా సర్వస్వాన్నీ పణం పెట్టే ముందు,
ఈ రాత్రి నీ ఆత్మని ఒకసారి నా కోసం ప్రశ్నించు
చిన్న చిన్న బంధాలని తెంచుకోగలను,
ఛాయా మాత్రంగా కూడా విచారం దరిజేరనీను;
నీ గతంలోంచి ఇప్పటికీ నీ మనసుని
కట్టి పడేసే బంధం ఏదైనా ఉందా?
నేను ఎంత స్వచ్ఛంగా స్వేచ్ఛగా ప్రమాణం చేస్తున్నానో
అంత స్వచ్ఛంగా, స్వేచ్ఛగా నా మీద నమ్మకం ఉంచగలవా?
నువ్వు కలగనే అనేక కలల్లో ఏ మూలనైనా
నీ భవిష్యత్తు ఇకపై ఎపుడైనా
నేనూ నా స్పర్శ లేకుండా నే తోడులేకుండా,
బాగుంటుందన్నట్టు అనిపించిందా?
ఉంటే, అదెంత నష్టమైనా, బాధాకరమైనా
అన్నీ పోగొట్టుకోక ముందే చెప్పు.
ఇంకా లోతుగా పరిశీలనచేసుకో!
నేను నా సర్వస్వాన్నీ నీకర్పిస్తుంటే,
నీ అంతరాంతరాల్లో ఎక్కడైనా ఒకింత
ఇంకా వెనకాడినట్టు కనిపిస్తుందేమో;
లేని ప్రేమతో నన్ను బాధించేకంటే,
నిజమైన కనికరంతో ఉన్నదున్నట్టు చెప్పు.
నీ మనసులో ఎక్కడైనా నేను తీర్చలేని
అవసరం ఉన్నట్టనిపిస్తోందా?
నాదికాక మరొక చెయ్యి దాన్ని తాకి
మీటగలరహస్తంత్రి ఏదైనా ఉందా?
ఇప్పుడే చెప్పు… ఎప్పుడో భవిష్యత్తులో
నా జీవితం వడలి శిధిలమైపోకుండా.
మార్పనే రాక్షసప్రకృతి
నీ స్వభావంలో అంతర్లీనంగా లేదూ?
అది ప్రతి కొత్తదాన్నీ, వింతనీ కోరుకుని
పాతబడిన అందాన్ని వదుల్చుకోమని అనొచ్చు.
అది నీ ఒక్కడి పొరపాటు కాకపోవచ్చు…
నా హృదయాన్ని నీ హృదయం నుండి రక్షించు.
ఏదో ఒక రోజు నా చేతిలోంచి నీ చెయ్యి విడిపించుకుని
నే నడిగిన ప్రశ్నకి సమాధానంగా
అది విధికృతమనీ, ఈ రోజు చేసిన పొరపాటు తప్ప
దానికి నిన్ను నిందించవద్దనీ చెప్పకు.
కొందరు వాళ్ళ మనసుల్ని అలా సమాధానపరచుకుంటారు
కాని, నువ్వు నన్ను ముందుగా హెచ్చరించి, రక్షించగలవు.
వద్దు! సమాధానం చెప్పకు. వినగల ధైర్యం లేదు.
మాటలు మరీ ఆచి తూచి వస్తాయి నెమ్మదిగా;
అయినా, నిన్ను ఆ ధర్మసంకటం నుండి తప్పిస్తానులే,
కనుక, నా భాగ్య దేవతా! నిశ్చింతగా ఉండు.
ఒకటి గుర్తుంచుకో, నా మనసుకి ఏ గాయం తగలనీ,
నా సర్వస్వాన్నీ ఒడ్డడానికి సిద్ధంగా ఉన్నాను.
.
ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్,
(30 October 1825 – 2 February 1864)
ఇంగ్లండు
.
స్త్రీల మనో భావాల్నీ, విచికిత్సనీ, పురుషుడి చంచలస్వభావంపై తమ భయాన్నీ, చివరికి, అన్నిటికీ సిద్ధపడి స్త్రీలు తాము తీసుకునే నిర్ణయాలనీ ఈ కవితలో బాగా చిత్రించింది కవయిత్రి.
.

వ్యాఖ్యానించండి