నేనింకా చిన్న వాణ్ణే, నువ్వు మేఘాల్లో తేలి వెళ్ళిపోయావు
ఇప్పుడు మనం ఇద్దరం లోయకి అటూ ఇటూ ఉన్న పర్వతాల్లా
ఒకర్నొకరు చూసుకుంటుంటాం. నేను ఇపుడు నీకేమీ కాను.
నా మనసు, కాదు నీ కొడుకు అలా చూస్తుంటాడు
నీ మృత్యువనే పెద్ద మేఘం కమ్ముకొస్తుంది
అది మధ్యనున్న అగాధాన్ని తలపిస్తుంది.
ఒక బతికున్న మనిషి మృతుడు గురించి ఆలోచిస్తాడు
ఇప్పుడిక కొంచెపుటాలోచనలు రావడం అసంభవం.
.
హ్యూ మెక్ డెర్మిడ్
11 August 1892 – 9 September 1978
స్కాటిష్ కవి
ఈ కవితలో కవి కొన్ని చక్కని ప్రతీకాత్మకమైన ఉపమానాలు వాడేడు. నేనింకా చిన్నవాణ్ణే అని చెప్పడానికి “నా మీద ఇంకా ఎండపడుతూనే ఉంది” అంటాడు. అంటే వయసు వాలలేదని. ఒకర్నొకరు లోయలో అటూ ఇటూ ఉన్న కొండల్లా చూసుకుంటున్నామనడం ఎంతో బాగుంది. ఒక చిత్రాన్ని ఊహించుకొండి. ఒక విశాలమైన లోయ. దాని అంచున పర్వతాలు. ఒకదానికొకటి ఎదురుగా రెండు పర్వతాలు మధ్యలో తేలియాడుతున్న నల్లని మబ్బులు. ఒక కొండకి రెండవది కనిపించదు. ఉందేమో నన్న భ్రమ కనిపింపజేస్తుంటుంది. రెండూ ఒకదాన్ని ఒకటి కలుసుకోలేవు. ఆ నల్లని మేఘాలు మృత్యువులా ఉన్నాయి. అంటే మృత్యువు రెండింటినీ విడదీసింది. ఇప్పుడు ఉదాత్తమైన ఆలోచనలే వస్తాయి…అనడంలో సందేహం ఏముంది?
.
http://en.wikipedia.org/wiki/Hugh_MacDiarmid
.
వ్యాఖ్యానించండి