“నేనింకా చిన్న వాణ్ణి” అని నాలోనేనే గొణుక్కున్నాను.
వెంటనే,”ఫర్వాలేదు, నాకూ వయసొచ్చింది,”
అని నిశ్చయించుకుని పైసా పైకెగరేసా
నేను ప్రేమించొచ్చో లేదో తెలుసుకుందామని.
“ఓయ్ కుర్రాడా, ఫో! ఫో! తప్పకుండా ప్రేమించు
పిల్ల వయసులో ఉండి తీరుగా ఉంటే చాలు”
ఓ పైసా, నా పైసా, నా బంగారు పైసా
నే నామె కేశపాశాల్లో బందీనైపోయాను!
.
ఓహ్! ప్రేమ చాలా జటిలమైనది
అందులో ఉన్నదంతా అర్థం చేసుకోగల
తెలివైనవాడింకా నాకు కనిపించలేదు;
ఎందుకంటే, చుక్కలు తొలగిపోయేదాకా
నీడలు చందురుని కబళించేదాకా
ప్రేమంటూ మనిషి పాకులాడుతూనే ఉంటాడు.
ఓ పైసా, నా పైసా, ఓ నా బంగారు పైసా
ప్రేమించడానికి తరుణవయసంటూ లేదు.
.
విలియం బట్లర్ యేట్స్
ఐరిష్ కవి.
ఈ కవితలో రెండు విశేషాలున్నాయి. ఒకటి నిజమైన ప్రేమ ఎంత లాటరీవో చెప్పడం. అందుకే “నాణెం పైకెగరేసా” అంటాడు. రెండోది, ప్రేమని ఎవ్వరూ సరిగా అర్థం చేసుకో లేకపోవడం. అందుకే “చుక్కలు తొలగిపోయేదాకా, నీడలు చందురుని కబళించేదాకా” అంటాడు. ఇక్కడ “గుండమ్మ కథ చిత్రంలో ఎంతహాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి” అన్న పింగళి వారి గీతం గుర్తుకు రాకమానదు. ప్రేమ శరీరాన్ని ఆశ్రయించి పెరిగే పూతీవ అయినా, దాని చిగుళ్ళు ఎప్పుడూ అనంత ఆకాశంలోకే ఉంటాయి. దాని ఉదాత్తత తెలుసుకోడం చాలా కష్టం.
.
Artist Eva Watson-Schutze Title William Butler Yeats Medium Platinum Print Size 7.9 x 6 in. / 20 x 15.2 cm. Year 1910 Misc. Signed (Photo credit: Wikipedia)
వ్యాఖ్యానించండి