అది శరత్కాలపు ఆఖరిరోజు, హేమంతపు మొదటి రోజు కలిసిపోయిన రోజు. రోజల్లా రైతులందరూ విశాలంగా సమతలంగాఉన్న తమ ప్రెయిరీ క్షేత్రాల్లో పైనుంచి మంచు కురుస్తూ, పడుతూనే కరిగి ఒళ్ళంతా తడిసిముద్దవుతున్నా పనిచేస్తూనే ఉన్నారు; ఉండీ ఉండీ ఈదురుగాలులతో తెరలుతెరలుగా వచ్చి మంచు వర్షించిపోయే మేఘాల సంగతి చెప్పనక్కర లేదు… క్రింద నాగేటి చాళ్ళలోని మట్టి నల్లగా తారుముద్దలా బురద బురద అవుతోంది.
కాడికి కట్టిన గుర్రాలు నీళ్ళోడుతూ తడుస్తున్నా తమ సహజమైన శాంతస్వభావంతో ఏమాత్రం అసంతృప్తి లేకుండా ప్రశాంతంగా ముందుకీ వెనక్కి నడుస్తూనే ఉన్నాయి. అడవి బాతులు రెక్కలు జాపుకుని, వెనకనుండి ఎవరో తరుముతున్నవాళ్లని తప్పించుకుని పారిపోతున్నట్టు మెడలు ముందుకు జాచి గట్టిగా అరుస్తూ పోతూ త్వరలోనే కనుమరుగయ్యాయి.
తన చిరుగులుపట్టిన పొడవాటి కోటుమీద మంచు వేలాడుతున్నా, చల్లని తడిమట్టి తనకాళ్ల బూట్లమీద జమ అయి, కాలికితగిలించిన శృంఖలాల్లా నడక కష్టం చేస్తున్నా, అంతగాలిలోనూ ఆనందంగా ఈల వేసుకుంటూ పనిచేస్తున్నాడు నాగలిపట్టిన రైతు. రోజు గడుస్తున్న కొద్దీ, పడిన మంచు కరగడం మాని, గడ్డిదుబ్బుల్లోనే చిక్కుకుని, ఒక్కొక్కవరుసా దున్నుతున్నకొద్దీ దున్నిన చాళ్ళు నల్లగా ఉంటే, దున్నని నేల వరిదుబ్బుల్లా గోధుమరంగులో కనిపిస్తున్నాయి.
మెల్లిగా చీకటి పడబోతుంటే, తక్కువ ఎత్తులో ఎగురుతూ, బాతులు ఒకదాని తర్వాత ఒకటి పక్కనే ఉన్న వరిపొలంలోకి దిగుతున్నాయి. అయినా, స్టీఫెన్ కౌన్సిల్ ఇంకా అరక దున్నుతూనే ఉన్నాడు … ఎలాగైనా ఆ చెలక పూర్తిచెయ్యడానికి సంకల్పించుకుని. దున్నుతున్నప్పుడు గాలివాటంలో నాగలిమీద ఎక్కి నిల్చున్నా, ఎదురుగాలికి మాత్రం కాడి వెనకే నడుస్తున్నాడు. చలిపట్టి, తన వాలుటోపీలో వంగి కూర్చున్నా, ఉత్సాహంమాత్రం విడవకుండా, తన నాలుగు జంతువులతోనూ వాటిని హుషారు చేస్తూ, అదిలిస్తూ మాటాడుతున్నాడు.
“పిల్లకాయలూ, మరో చుట్టు తిరగాలి! మరో చుట్టు! ఇవాళ ఎలాగైనా ఈ ముక్క పూర్తి చేసెయ్యాలి. ఊం! అద్గదీ! డేన్, సరిగా, సరిగా! కేట్! నువ్వుకూడా వరస తప్పకూడదు. కిట్టీ! అదిగో అలా పెంకితనం చేస్తే ఒప్పుకోను. ఇది కొంచెం కష్టమే. నాకు తెలుసు. కానీ పూర్తిచెయ్యక తప్పదు. పీట్! అడుగు పక్కకి వెయ్యి, కేట్ నీ కళ్ళాలలో చిక్కకుండా చూడు. మరో వరస దున్నాలి. మరొక్క వరసే.”
వాటికి అతనేమిటంటున్నాడో తెలుస్తున్నట్టుంది. అదే చివరి వరస అని కూడా అర్థమయినట్టుంది, ఇంతకుముందుకంటే ఉత్సాహంతో జోరుగా తిరుగుతున్నాయి. “ఇదిగో కుర్రాళ్ళూ ఇదే ఆఖరిసారి! చెబుతున్నా వినండి… దీని తర్వాత ఓట్స్ తినడం…గుర్రాలశాలలో వెచ్చగా పడుక్కోడం… అందరం రాత్రికి విశ్రాంతి తీసుకోవడం. అంతే!”
పొలంలో ఆఖరి చాలు పెల్లగిలే వేళకి, ఇల్లు కనిపించనంత దట్టంగా చీకటి కమ్ముకుంది. కురుస్తున్న మంచు వర్షంగా మారసాగింది. ఆకులులేని దడిలోంచి వంటింట్లోంచి వస్తున్న వెలుతురులో ఆకలీ అలసటా కలగలిసిన అతను ఒక పెడబొబ్బ పెట్టేడు: “ఓ అరడజను మందికి భోజనం” అని.
గుర్రాలకి చెయ్యవలసిన పనులన్నీ పూర్తిచేసుకుని అతను తన భోజనానికి సిద్ధపడే వేళకి అప్పుడే ఎనిమిది కావస్తోంది. బురదలోంచి జాగ్రత్తగా త్రోవచూసుకుని నడుస్తుంటే, అతనికి దగ్గరలో ఒక పొడవాటి పురుషాకారం కనిపించింది, తన ఉనికిని సూచిస్తున్నట్టుగా ఒక దగ్గు దగ్గుతూ.
“ఎవరు కావాలి?” రైతు అడిగిన ప్రశ్నలో భయంతోకూడిన ఆశ్చర్యం తొంగిచూస్తోంది.
“అసలు విషయం ఏమిటంటే…” అజ్ఞాతవ్యక్తి చెప్పడం ప్రారంభించేడు, దీనంగా బ్రతిమాలుతున్న స్వరంతో,
“ఈ రాత్రికి ఎలాగైనా తలదాచుకుందికి చోటు కావాలి. గత రెండుమైళ్ళదూరం నుండి ప్రతి ఇల్లూ తడుతూనే ఉన్నాం కాని, మాకు ఆశ్రయం దొరక లేదు. నా భార్యకి ఆరోగ్యం బాగులేదు. పిల్లలేమో చలికి వడకట్టిపోయి, ఆకలితో ఉన్నారు….”
మధ్యలో అందుకుంటూ, “అయితే, ఈ రాత్రికి ఆశ్రయం కావాలి? అంతేనా?”
“అవును. ఈ సాయం చేస్తే మీ మేలు…”
“సరే. నిజానికి ఎవరిని ఆకలితో వెనక్కి పంపే అలవాటు నాకు లేదు. అందులోనూ, ఇలాంటి రాత్రిపూట. మీవాళ్ళని తీసుకుని తిన్నగా వచ్చెయ్యండి. నేను పెద్దగా ఉన్నవాణ్ణి కాను. కానీ, ఉన్నంతలోనే…”
అప్పటికే ఆ అజ్ఞాతవ్యక్తి అదృశ్యమైపోయాడు. తోవకి పక్కనే ఉన్న ఇళ్ళ ఆవరణలోకి కొద్దిసేపటిలోనే అలసిపోయి, తమ తలలూ, ముస్తీబులు వేలేసుకుంటూ, రొప్పుతున్న గుర్రాలు ఈడ్చుకొచ్చిన బండీ, అతని పరివారమూ ఆగింది. ఆ గూడుబండికి ఒకపక్క కౌన్సిల్ నిలబడి పిల్లలని దించడంలో సాయం చేస్తున్నాడు. ఇద్దరు నిద్రపోతున్న పిల్లలూ, పొత్తిళ్ళలో ఉన్న బిడ్డతో ఒక స్త్రీ దిగారు.
“లోపలికి పరిగెత్తండి,” అని పిల్లలని హుషారుచేశాడు కౌన్సిల్. “ఇక మీకు వచ్చిన భయం ఏమీ లేదు. అలా తిన్నగా ఆ కనిపిస్తున్న ఇంట్లోకి పరిగెత్తండి. అక్కడ మేడం కౌన్సిల్ ఉంటుంది. ఆమెని మీకు తినడానికి ఏదో ఒకటి ఇమ్మని చెప్పండి. మిస్! అలా కుడిపక్కకి నిలబడండి. ఈ లోపున నేను లాంతరు తీసుకు వస్తాను. రండి.” అని, భయంతో, అచేతనంగా మౌనంగా ఉన్న వాళ్లని సంబోధిస్తూ ఆశ్వాసన చేశాడు.
చిక్కని వెలుగుతో, వెచ్చగా, మంచివాసనలు వస్తున్న వంటిల్లు సమీపిస్తూనే, “అమ్మీ!” అని ఒక కేక వేసి,”పాపం ఎవరో బాటసారులు చాలా అలసిపోయి వచ్చేరు. వాళ్ళకి తినడానికింత తిండీ, పడుక్కుందికి కాస్త చోటూ ఏర్పాటు చెయ్యాలి.” అన్నాడు. అందరూ లోపలకి రానిచ్చి తలుపులు మూసేడు.
మిసెజ్ కౌన్సిల్ భారీ కాయంతో మొరటుగా కనిపించినా, ఎప్పుడూ సరదాగా ఉండే మనిషి. ఆమె పిల్లల్ని దగ్గరకి తీసుకుని,”చిన్నారులూ, రండి రండి. అర్రెర్రే, పాపం, అప్పుడే నిద్రముంచుకొచ్చెస్తోందే! ఏదీ, ఇటు చూడమ్మా? మీ కొక్కరికీ ఇవిగో పాలు తాగడానికి రెడీ. ఒక్క నిముషంలో టీ తయారుచేస్తాను. చలికాచుకుందికి పొయ్యి వెలిగిస్తాను, ఈలోపు బట్టలు మార్చుకొండి.” అని పిన్నలనీ, పెద్దలనీ చూస్తూ అన్నది.
పిల్లలకి పాలు అందించి వాళ్ళు తాగేటట్టు ఏర్పాట్లు ఆమె చూస్తుంటే, ఈ లోపు కౌన్సిల్ లాంతరు వెలిగించి గాదె దగ్గరకి నడిచాడు… అతిథికి గుర్రాలని కట్టి, మేతవెయ్యడంలో సహాయం చెయ్యడానికి. గుర్రాలశాలకీ గడ్డివాముకీ మధ్య అతను అటూ ఇటూ నడుస్తుంటే, కపటంలేని అతని గంభీరమైన స్వరంకూడా వస్తూ పోతూ వినిపిస్తోంది.
వచ్చినామె, పొట్టిగా, భయం భయంగా, నిరుత్సాహంగా కనిపించినప్పటికీ, అంత విచారంలోనూ, సన్నగా అందంగానే కనిపిస్తోంది.
“ఏమిటీ, మీరు క్లియర్ లేక్ నుండి ఈ బురదలో రోజల్లా ప్రయాణం చేసి వచ్చేరా? వామ్మో! ఓరినాయనో! మీరు ఒళ్ళుహూనం అయేలా అలిసిపోయేరంటే అందులో ఆశ్చర్యం ఏముందీ? మొగవాళ్ళకోసం ఆగనఖ్ఖరలేదు, మిస్…” అని ఆగింది వచ్చినామె తన పేరుచెప్పడానికి.
“హాస్కిన్స్,” అందామె.
“మిస్ హాస్కిన్స్, టేబిలుదగ్గర కూచుని ముందు ఒక కప్పు చక్కని టీ తాగండి. ఈలోగా మీకు నేను టోస్ట్ తయారు చేస్తాను. అది గ్రీన్ టీ. ఒంటికి మంచిది. వయసు పైబడుతున్నకొద్దీ నాకెందుకో Young Hyson టీ గాని Gunpowder టీ గాని నచ్చడంలేదు. అందుకే కౌన్సిల్ తో చెబుతుంటాను నాకు నిజమైన గ్రీన్ టీ కావాలని… అలా తిన్నగా చెట్టునుండి కోసుకొచ్చినట్టు ఉండాలి. ఎందుకో, నాకు అందులోనే ఎక్కువ రుచి ఉన్నట్టు అనిపిస్తుంది. ఉందని అనుకుంటున్నాను. కానీ, కౌన్సిల్ మాత్రం నా చూపులోనే తప్ప నిజం కాదంటాడు.”
అలా మాటాడుతూ మాటాడుతూ, పిల్లలు రొట్టె తిని పాలు తాగేట్టూ, వచ్చినామెకూడా బిడియం వదలి కొత్తదనంపోయేలా చేసి, కర్బూజా ఆవకాయ నంచుకుని కొంచెం టోస్ట్ తిని, టీ తాగేట్టూ చూసింది.
నవ్వుతూ, పిల్లలవంక చూపిస్తూ, “వెర్రి నాగన్నలు చూడండి. వాళ్ళ చిన్నిపొట్టలు అప్పుడే నిండిపోయేయి. ఇహ వాళ్లకి కావలసింది నిద్ర. వద్దు వద్దు, మిసెజ్ హాస్కిన్స్. మీరు లేవొద్దు. మీరు ఉన్నచోటే కదలకుండా కూచొండి. వాళ్ళసంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడంటే ఒక్కళ్ళమీ ఉంటున్నాం గానీ, నాకు పిల్లలని ఎలా సంబాళించాలో బాగా తెలుసు. జేన్ క్రిందటేడే శరత్కాలంలో పెళ్ళిచేసుకుని తనమానాన్న తను ఉంటోంది. నేను అందుకే కౌన్సిల్ తో చెబుతుంటాను. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోడం నిజంగా మన అదృష్టమే అని. మిసెజ్ హాస్కిన్స్. అక్కడే అలా కూచొండి. మీరు కాలు కదిపేరంటే నేనొప్పుకునేది లేదు.”
ఇంటి యజమానురాలు సరదాగా కబుర్లుచెబుతుంటే వింటూ, బయట రివ్వుమని వీచే చలిగాలికి దొరక్కుండా, హాయిగా, వెచ్చగా, వంటింట్లో కూర్చుంటే ఉన్న సుఖం ఎవ్వరూ కొలవలేనిది.
వచ్చినామె కళ్ళు ఆర్ద్రతతో చెమర్చి, కొన్ని కన్నీటి చుక్కలు నిద్రిస్తున్న పసిబిడ్డమీద పడ్డాయి. ఈ ప్రపంచం మరీ అంత దిక్కుమాలినదీ, దయలేనిదీ, నిరాశాపూరితమైనదీ కాదు అని అనిపించిందామెకి.
“ఓహ్! ఇవాళ కౌన్సిల్ కి పండగే. రాత్రల్లా ఇక రాజకీయాలు మాటాడడం ఆపడనుకుంటాను. ట్రిబ్యూన్ చదవడం, రాజకీయాలు చర్చించడంలో అతన్ని మించినవాళ్ళు లేరు.
ఇంతకీ, ఆ బిడ్డ వయసెంత?”
మాటలు ఆపేసి, బిడ్డమీదికి ఒంగి జాగ్రత్తగా పరిశీలించసాగింది.
“రెండు నెలలమీద ఐదురోజులు,” అంది తల్లి, ఇలాంటి విషయాలలో తల్లులకుండే సహజమైన ఖచ్చితత్వం ఉట్టిపడేలా.
“నువ్వు చెప్పొద్దులే తల్లీ! నే తెలుసుకుంటాలే” అంటూ బలంగా ఉన్న తన చూపుడువేలుతో పక్కలో కితకితలు పెడుతున్నట్టు కదుపుతూ పాపని పలకరించసాగింది.
“ఇలా అందరికీ సాయం చెయ్యడం అంటే చాలా సాహసంతో కూడుకున్న పనేనే…” అంది మిసెజ్ హాస్కిన్స్.
అప్పుడే తలుపు తెరుకుని లోపలికొస్తున్న కౌన్సిల్ ఆ మాటలకి, “నిజమే! సందేహం లేదు. కానీ, మనిషి కొండబరువు నెత్తినేసుకోలేడు కద!” అంటూ, తన భార్యతో, “అమ్మీ, ఇతని పేరు హాస్కిన్స్. కాన్సాస్ వాసి. పదే పదే మిడతలదండు బారి పడి అతని పంటంతా పోతే చివరకి ఇలా ఊరొదిలి రావలసి వచ్చింది. ”
“పా! సమయానికి వచ్చేవు. ఆ వాష్ బేసిను దగ్గర ఖాళీ చేసి అతను ముఖం కడుక్కుందికి కాస్త చోటు చెయ్యి, “అంది.
హాస్కిన్స్ సన్నగా పొడవుగా ఉంటాడు. అతని ముఖం ఏదో కోల్పోయిన వాడిలా విచారంగా కనిపిస్తుంది. అతని ఒంటిమీది కోటు లాగే అతని జుత్తుకూడా ఎరుపుకి దగ్గరగా ఉండే గోధుమరంగులో ఉండి, అతనిలాగే ఎండకి ఎండి వానకి తడిసి రంగువెలిసినట్టు కనిపిస్తుంది. ముఖం స్పష్టంగా గంభీరంగా ఉన్నా అందులో విషాదఛాయలు మాత్రం తొంగిచూస్తూనే ఉంటాయి. అతని సన్నని పసుపురంగు మీసం క్రింద గీసినట్టున్న అతని నోరు చూస్తుంటే, అతను చాలా కష్టాలు పడ్డాడని మనకి తెలుస్తుంది.
” సైరీ! ఐక్ ఇంటికింకా రాలేదా?” అడిగేడు కౌన్సిల్.
“ఏమో, నాకు కనిపించలే.”
“సరే! మిస్టర్ హాస్కిన్స్, రండి, ఇక్కడ కూర్చొండి. మాకున్న ఈ కాస్తలోనే మీకు నచ్చినది ఆరగించండి. ఇది తినే మేము ఎలాగో కాలక్షేపం చేస్తున్నాం, ఆవిడ లావెక్కుతోంది కూడా,” అంటూ బొటనవేలితో తనభార్యను చూపిస్తూ సరదాగా నవ్వేడు.
భోజనాలు పూర్తయేక, ఆడవాళ్ళు పిల్లల్ని పడుక్కోబెడుతుంటే, హాస్కిన్స్, కౌన్సిల్, పెద్ద వంట పొయ్యిదగ్గర చలికాచుకుంటూ, తడిసిపోయిన తమబట్టల్లోంచి ఆవిరులు ఎగుస్తున్నా మాటల్లో ములిగిపోయేరు. అక్కడి సంభాషణలలోని అలవాట్ల ప్రకారం కౌన్సిల్, తనగురించి ఎంతచెప్పేడో, తన అతిథిగురించికూడా అంతే సమాచారం తెలుసుకున్నాడు. అతను చాలా తక్కువ ప్రశ్నలే వేశాడు గాని, నెమ్మది నెమ్మదిగా హాస్కిన్స్ బాధలూ, అతను ఊరు వదిలి ఎందుకురావలసి వచ్చిందో అన్నీ బయటకు వచ్చేయి. ఆ కథ నిజంగా విషాదమయం. అతను చేతులు ముణుకులమీద ఆంచి, పొయ్యిలోని మంటవైపే చాలా సేపు తదేకంగా చూస్తూ, నెమ్మదిగా ప్రశాంతంగా తన విషయాలన్నీ చెప్పేడు.
“ఎందుకో గాని, అసలు ఆ గ్రామీణవాతావరణమే నాకు నచ్చదు,” అన్నాడు హాస్కిన్స్ కూచున్నచోటునుండి కొద్దిగా లేచి, తన భార్యవంక చూస్తూ.” ఉత్తర ఇండియన్ దీవుల వాతావరణానికీ, అక్కడ సమృద్ధిగా దొరికే కలపకీ, వర్షాలకీ అలవాటు పడిన వాణ్ణి. ఎండిపోయినట్టు కనిపించే ఆ ప్రాంతం చూస్తే అసలు ఏమాత్రం నచ్చదు. అన్నిటికంటే నాకు బాధకలిగించిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఎటుచూసినా కనుచూపుమేర ఇంత చక్కని నేల ఖాళీగా ఉంటుంటే, అక్కడ అంతదూరం వెళ్ళవలసి రావడం.
“అయితే, మిడతలు వరసగా నాలుగు సంవత్సరాలు వదిలిపెట్టకుండా పంటంతా తినేశాయన్నమాట. అవునా?”
“తినడమా? మమ్మల్ని తుడిచిపెట్టేసేయి. పచ్చగా కనిపించినదంతా పరపరా నమిలేసేయి. అవి మేము ఎప్పుడు చస్తామా, అప్పుడు మమ్మల్నికూడ నమిలేద్దామని కాచుక్కొచ్చున్నాయి అంతే. ఓరి నాయనో! నాకు కల్లోకి కూడా అవే వచ్చేవి, ఆరడుగుల మంచం చుట్టూ కూర్చుని నమలడానికి సిద్ధంగా దవడలు సారిస్తున్నట్టు. అవి ఫోర్కులకుండే కర్రపిడులుకూడ తినేసేయి. రాను రాను ఎంత ముదిరిపొయేయంటే, చలికాలంలో మంచు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయినట్టి ఒకదానిమీద ఒకటి పోగులుపడ్డాయి. అబ్బే లాభం లేదు. నేను వాటి గురించి ఈ శీతాకాలం గడిచిపోయేదాకా చెప్పినా తరగదు. ఇక్కడ ఎవ్వరూ వాడకుండా బీడుపడిఉన్న నేలని తలుచుకున్నప్పుడల్లా, ఆ శాపగ్రస్తమైన చోట ఉండడంకంటే, ఇక్కడ ఉంటే బాగుణ్ణని అనుకోకుండ ఉండలేకపోతున్నాను. ”
మాటల్లోనే వచ్చి తనభోజనం కానిస్తున్న ఐక్, మధ్యలో అందుకుని, “మరి అలా అయితే, ఇక్కడే ఎందుకు స్థిరపడలేదు?” అని అడిగేడు.
“ఎందుకంటే, ఇక్కడ తుప్పలూ డొంకలూ బలిసిన బంజరుకి కూడా వీళ్ళు ఎకరాకి పది పదిహేను డాలర్ల ఖరీదు అడుగుతున్నారు కాబట్టి; అంత డబ్బు ఇచ్చుకుందికి నాదగ్గర లేదు కాబట్టి.”
ఒక్కసారి వాతావరణం ప్రశాంతమైపోయింది. మళ్ళీ సంభాషణ ప్రాంభమయే లోపు, పక్కగదిలోంచి మిసెజ్ కౌన్సిల్ మాటలు వినిపించేయి:
“అవును. నా పని నేనే చేసుకుంటాను. రోజల్లా నా కాళ్లమీద నిలబడి నిలబడి కాళ్లు బరువెక్కినా పనిచేసుకోవాలి, ఎందుకంటే, ఎవర్నీ పనికి పెట్టుకోగల స్తోమతు లేదు. అందుకే, పిచ్చెక్కిన గుర్రంలా, అటూ ఇటూ తిరుగుతూ తిరుగుతుంటాను. కాళ్ళు ఎంత తిమ్మిరెక్కిపోతాయో కౌన్సిల్ చెప్పగలడు, ఈ కాలు ఎంత అవుకో, ఆ కాలూ అంతే అవుకు. ” అంటూ ఆ అమాయకపు ప్రాణి తనమీద తాను వేసుకున్న జోకుకి తనే నవ్వుతూ, బిస్కత్తులు తయారుచేసే మిషనుకి పిండి అంటుకుపోకుండా పిడికెడు పిండితో అక్కడ తుడుస్తూ మిసెజ్ హాస్కిన్స్ తో చెబుతోంది.
“నిజానికి, చిన్నప్పటినుండీ నేను అంత బలమైన దాన్నేం కాదు,” అని చెప్పడం ప్రారంభించింది మిసెజ్ హాస్కిన్స్, “మా వాళ్లంతా కెనేడియన్లు, అంత ఎముక పటుత్వం ఉన్నవాళ్లు కాదు. ఈ చివరి కానుపు తర్వాత అంత హాయిగా లేచి తిరగలేకపోతున్నాను. నాకు బాధలు చెప్పుకోడం అంత ఇష్టం ఉండదు గానీ, పాపం, చెయ్యగలిగినకాడికి అన్ని పనులూ తనే చూసుకుంటున్నాడు టిమ్ . ఈ వారంలో అయితే, నాకు ప్రశాంతంగా పడుక్కుని, చచ్చిపోతే బాగుణ్నని ఎన్నిసార్లో అనిపించింది.”
“నేనే నీ పరిస్థితుల్లో ఉంటే,” అంటూ కౌన్సిల్ తన సహజసిద్ధమైన భోళాతనంతో, గట్టిగా, పొయ్యికి ఇటుపక్కనుండి మాటలు ప్రారంభించడంతో అందరూ నిశ్శబ్దమైపోయేరు. “నేను మిస్టర్ బట్లర్ ని కలిసుండేవాడిని. నాకు తెలిసి అతను ఈ పొలాల్ని మీకు బహు చవకగానే అద్దెకిచ్చి ఉండేవాడు. ఇక్కడ వ్యవసాయాలన్నీ పాడుబడిపోయేయి. వచ్చే ఏడు ఎవరికైనా ఏదోకాడికి ఇవ్వాలని అతను చూస్తున్నాడు. మీకు ఇదే మంచి అదును. అవన్నీ తర్వాత చూసుకుందాం గాని, మీరు ప్రశాంతంగా పసిపిల్లల్లా నిశ్చింతగా నిద్రపొండి. నేను చెయ్యవలసిన పొలం పని కొంత కొరదా ఉంది. మీ విషయంలో ఏదో ఒకటి చెయ్యలేకపోము. ఐక్! నువ్వోసారి అలా వెళ్ళి గుర్రాలకి ఇబ్బందిలేకుండా ఉందో లేదో చూడు. నేను వీళ్ళకి పడకగది చూపిస్తాను.”
అలసిపోయిన ఆ దంపతులు, పక్కమీద వెచ్చనిదుప్పట్లలో పడుక్కున్నప్పుడు, చూరులోంచి రివ్వుమని రొజ్జగాలి చేస్తున్న చప్పుడు క్షణకాలం పాటు విని నెమ్మదిగా, కృతజ్ఞతాపూర్వకమైన గొంతుతో హాస్కిన్స్ ఇలా అన్నాడు:
“ప్రపంచంలో కొందరు దేవత లనదగ్గ వ్యక్తులుంటారు; వాళ్ళు మరణించినతర్వాత నిజంగా దేవతలౌతారు.”
(2)
జాన్ బట్లర్ పడమట దేశాల్లో వాడుకలో ఉన్న “భూమి ఉన్న పేద” ఒకప్పుడు. రాక్ రివర్ తొలినాళ్లలో ఈ నగరంలోకి బ్రతుకుతెరువుకోసం వచ్చి, ఊర్లో ఒక అనామకమైన ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు తీసుకుని, చిన్న ఎత్తున ఒక కిరాణావ్యాపారం ప్రారంభించేడు. అతని జీవితంలో అప్పటికి అతనికున్నవన్నీ కష్టపడి సంపాదించినవే… ఉదయాన్నే లేచి పనిప్రారంభిస్తే చీకటిపడ్డ చాలసేపటిదాకా, గింజల్లో రాళ్ళు ఏరుతూనో, వెన్న తీస్తూనో, స్టేషన్ నుండి సామాన్లు బండిమీద లాగుతూనో ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. రెండో సంవత్సరం తిరిగే సరికి అతనిలో మార్పు వచ్చింది. అతని భూమిలో చాలభాగం అతనుకొన్నదానికంటే నాలుగురెట్లు ఎక్కువకి అమ్మేసేడు. ఆ క్షణంనుండీ త్వరలో సంపన్నుడు కావాలంటే భూమి క్రయవిక్రయాలు జరపడం ఒక్కటే తిరుగులేని మార్గం అన్ననిశ్చయానికి వచ్చేడు. అప్పటినుండీ అతను ఆదా చేసినదిగాని, వ్యాపారంలో మిగిల్చినదిగాని, ప్రతిసెంటునీ బలవంతపు అమ్మకాలలో కొనడానికీ, భూమి తణఖాపట్టడానికీ వినియోగించేవాడు. “గోధుమలెంత విలువైనవో అవీ అంత విలువైనవే” అనే వాడు తరచు.
ఒకదాని వెంట ఒకటిగా వ్యవసాయక్షేత్రాలు అతని అధీనంలోకి వచ్చి, భూ సంపద ఉన్నవాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను తణఖాపట్టిన భూములు సెడార్ కౌంటీ నిండా చెల్లాచెదరుగా ఉన్నాయి. అయితే, అతను భూమి తణఖాపట్టినా, యజమానినే ఆ భూమిని సాగుచేసే రైతుగా ఉండనిచ్చేవాడు.
అతనెప్పుడూ తొందరగా తణఖావిడిపించుకోమని ఒత్తిడిచేసేవాడు కాదు. నిజానికి అతనికి పదిమందిలో “మెత్తనివాడు” అన్న పేరు కూడా ఉంది. తణఖాదారు వేళకు తీర్చలేకపోయినా వీలయినప్పుడల్లా, పదే పదే గడువుపెంచుతూ ఉండేవాడు తప్ప వాళ్లదగ్గరనుండి భూమి తీసుకుందికి ప్రయత్నించేవాడు కాదు.
“నీ భూమి నాకెందుకూ, నేనేం చేసుకుంటాను” అనేవాడు, “నాకు కావలసిందల్లా నా అప్పు మీద వడ్డీ. అంతే. నీకు ఒకవేళ ఈ భూమి సాగుచేసుకునే ఉద్దేశం ఉంటే, నీకో మంచి అవకాశం ఇస్తున్నా. నేల బీడుపడి ఉండడం నాకిష్టం లేదు.” అందుకని, చాలా సందర్భాలలో, యజమానే కౌలుకి ఉండిపోయేవాడు.
ఆ మధ్యలో అతని దుకాణాన్ని అమ్మేసేడు; దాని మీద సమయం వెచ్చించడానికి తీరిక చిక్కేది కాదు. ఇప్పుడు అతనికున్న వ్యాపకమల్లా, వర్షాకాలం అయితే ఊర్లో ఎక్కడో నలుగురుకుర్రాళ్ళని పోగేసుకుని వాళ్లతో సిగరెట్లు తాగుతూ కుచ్చిటప్పాలు కొట్టడం, లేదా అతని భూములెలా ఉన్నాయో చూసుకుందికి అటూ ఇటూ గుర్రంమీద స్వారీచెయ్యడం. చేపలుపట్టేవేళల్లో బాగా చేపలు పట్టేవాడు. చేపలు పట్టడానికీ, పిట్టల్ని వేటాడడానికీ వెళ్ళినపుడు డాక్ గ్రైమ్స్, బెన్ ఏష్లీ, కాల్ చేతం అతని తోడు ఉండేవారు. శీతకాలంలో అయితే దుప్పుల్ని వేటాడడానికి విస్కాన్సిన్ వెళ్ళేవాడు.
ఇంత సుఖవంతమైన జీవితం గడుపుతున్న సూచనలున్నా, ఎప్పుడూ, “నాకు పన్నులు చెల్లించడానికి సరిపడా డబ్బులు లేవు” అని అనడమే గాక, అతనికి 20 వ్యవసాయ క్షేత్రాలున్నా, తను బీదవాడిననే అభిప్రాయం కలిగించడంలో జాగ్రత్తలు తీసుకునే వాడు. ఒకప్పుడు అతని ఆస్థి విలువ యాభై వేల డాలర్లని అంచనా. ఇప్పుడు భూమి అంత సులువుగా అమ్ముడుపోవడంలేదు గనుక, ఇప్పుడు అంత విలువచెయ్యకపోవచ్చు.
“హిగ్లీ ప్లేస్” అన్న చక్కని సేరీ భూమి గత ఏడాది అతని చేతికి చిక్కింది ఎప్పటిలాగే. కాని అతను దాన్ని కౌలుకి ఇద్దామంటే తగిన వాళ్ళు దొరకలేదు. పాపం, హిగ్లీ! దాని మీద తణఖా విడిపించుకుందికి రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేశాడు. చచ్చిసాయంగల విన్నపాలయితే, ఆ భూమిని వదిలేసి, బట్లర్ కి శాపనార్థాలు పెట్టుకుంటూ డకోటా వెళ్ళిపోయాడు.
హాస్కిన్స్ ని కౌలుకి తీసుకోమని కౌన్సిల్ సలహా ఇచ్చిన భూమి ఇదే. ఆ మరుచటిరోజే, బండి పూన్చి బట్లర్ ని కలవడానికి తనపరివారాన్నంతా తీసుకుని వెళ్ళేడు.
“నన్ను మాటాడనీండి,” అన్నాడు కౌన్సిల్ హాస్కిన్స్ తో, “పొలం అవుసరం మీకు ఉందని పసిగడితే, అతని ధర చుక్కల్లో ఉంటుంది. వాడికి విసిగెత్తేలా బేరమాడితే, వాడే తోవకొస్తాడు. మీరలా మౌనంగా చూస్తూ కూచొండి. నేను పని చక్కబెడతాను.”
బెన్ ఏష్లీ దుకాణంలోకి కౌన్సిల్ యధాలాపంగా అడుగుపెట్టేవేళకి, అక్కడ బట్లర్ చేపలవలల తాళ్ళు అమ్ముతూ కనిపించేడు.
“హలో, బట్! మళ్ళీ వేటకి తయారీనా?”
“హలో, స్టీవ్! ఎలావుంది వ్యవసాయం?”
“ఏదో… అలా బండి నడుస్తోంది. ఈ మధ్య మరీ భోరున వర్షం కురిసేస్తోంది. నిన్న రాత్రయితే నేను గడ్డకట్టుకుపోతానేమోననే భయపడ్డాను. దుక్కి పనులు పూర్తయితే అదృష్టవంతుణ్ణే. మీ వ్యవసాయం పనులు ఎంతమట్టుకు వచ్చేయి?”
“అబ్బే, ఏం లాభం లేదు. సగం కూడ పని అవలేదు.”
“మీరే స్వయంగా పొలంలోకి దిగి పనిచెయ్యడం అంటే కష్టమే మరి.”
“అబ్బే, మనం పని చెయ్యం గదా,” అంటూ కన్ను గీటేడు బట్లర్.
“హిగ్లీ ప్లేస్ కి ఎవరైనా కుదిరేరా?”
“లేదు. ఏం? నీకెవరైనా తెలిసినవాళ్ళు ఉన్నారా?”
“తెలిసిన వాళ్లని కాదు. నాకు తెలిసిన దూరపు బంధువు ఒకాయన మిషిగన్ లో ఉన్నాడు. ఎప్పటినుండో ఈ ప్రాంతాలకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. మంచి పొలం దొరికితే రావొచ్చు. ఎంత రేటు చెబుతున్నారేమిటి ఆ పొలానికి?”
“తెలిసిందేగదా. అయితే భాగానికీ, లేకపోతే డబ్బుకీ కౌలికిస్తాను.”
“సరే, డబ్బుకి అయితే ఎంతట?”
“దాని ధర మీద పదిశాతం, అంటే 250 డాలర్లు.”
“ఫర్వా లేదు. ధరబాగానే పలుకుతోంది. అయితే అతన్నే ఆలోచించుకోనిద్దాం.”
ముఖ్యమైన ఈ ప్రశ్నకి ఏమిటి సమాధానం చెబుతాడా అని చాలా కుతూహలంగా చూస్తున్నాడు హాస్కిన్స్. ఏమీ పట్టనట్టు ప్రశాంతంగా తనతో తెచ్చుకున్న బారెల్ లోంచి ఒక ఆపిలుని కత్తికి గుచ్చి బయటకు తీసి, తింటున్నాడు కౌన్సిల్. బట్లర్ అతన్నే పరీక్షగా చూస్తున్నాడు. చివరకి,
“సరే అయితే, వడ్డీలో ఇరవై ఐదు డాలర్లు మినహాయించుకోమను.”
“మా బంధువు అందులో పంట వెయ్యాలంటే బోలెడు మదుపవుతుంది,” అన్నాడు కౌన్సిల్ ఎప్పటిలాగే అంత నిర్లిప్తంగానూ.
“సరే అయితే. ఆ ఖర్చులుకూడ మినహాయించుకోమను. సరేనా, లేక అతనికోసం ఆగాలా?” అని ముగించాడు బట్లర్.
“సరే అయితే. ఇతనే నే చెప్పిన వ్యక్తి.” అని హాస్కిన్స్ ని పరిచయం చేసి, “హాస్కిన్స్, ఇతనే మిస్టర్ బట్లర్. ఈ సెడార్ కౌంటీమొత్తానికి కష్టపనిచేసే ఈ షాపు యజమాని బెన్ కి చుట్టమేమీ కాడు.” అని బట్లర్ ని పరిచయం చేశాడు హాస్కిన్స్ కి.
ఇంటికి తిరిగి వెళుతుంటే, త్రోవలో హాస్కిన్స్ అన్నాడు: “నా పరిస్థితి బాగులేదు. ఆ పొలం చూస్తే నాకు బాగా నచ్చింది. అది మంచిదేకాని, నిర్లక్ష్యానికి గురవడంవల్ల, నాలాగే అదీ పాడయింది. నా పరిస్థితి సగం మెరుగ్గా ఉన్నా, దీన్ని బాగా తీర్చిదిద్దుకునే వాడిని. దాన్ని ఉంచుకోలేను, పంట వెయ్యలేను.” అని దిగులుగా మాటాడేడు.
“సరే, దానిగురించి ఇప్పుడు అంత చింతించనవసరం లేదు. మొదటిపంట చేతికొచ్చీదాకా మిమ్మల్ని ఎలాగోలా గట్టెక్కిస్తాం. అతను దున్నడం అయినతర్వాత అద్దెకివ్వడానికి ఒప్పుకున్నాడు గదా. దున్నడానికి ఖర్చులు ఒక వంద డాలర్లు సంపాదించుకోవచ్చు. విత్తనాలు నేనిస్తాను. మీకు ఎప్పుడు వెసులుబాటు అయితే అప్పుడే నాకు బాకీ తీరుద్దురు గాని,” అని అన్నాడు.
అతని ఔదార్యానికి హాస్కిన్స్ నోటంట మాటరాక మౌనంగా ఉండిపోయేడు కొంతసేపు. చివరకి అతనే మళ్ళీ, “అప్పటి దాకా బతకడానికి నా దగ్గర ఏమీ లేదు.”
“దాని గురించి ఆలోచించవద్దు, ఇపుడు. ఈ ముసిలి స్టీవ్ కౌన్సిల్ ఇల్లే మీ ఇల్లుగా భావించుకొండి. మీ భార్య, పిల్లలూ కళ్ళెదురుగా ఉంటే అమ్మీకి బోలెడంత ఉత్సాహం వస్తుంది.
“మీకు తెలిసిందే గదా, జేన్ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. ఐక్ చాల వరకు బయటనే ఉంటుంటాడు. ఈ చలికాలం అంతా మీరు మా ఇంట్లో గడపగలిగితే, మాకెంతో సంతోషంగా ఉంటుంది. వసంత ఋతువు వేళకి మీ కాళ్ల మీద మీరు నిలబడగలిగే ఏర్పాటు చెయ్యలేకపోము.” అతను గుర్రాల్ని ముద్దుగా ఆదేశించగానే, అవి ఒక్కసారి ముందుకి ఉరకడంతో, ఆ పాత బండీ గడగడమని చప్పుడు చేస్తూ కదిలింది.
“కౌన్సిల్. నావైపు చూడండి. ఇది మీకు భావ్యం కాదు, నా బాధ్యతలన్నీ నెత్తినేసుకోడం. నే నింతవరకూ ఎక్కడా చూడలేదు…” అని బండి చప్పుడుకి తనమాటలు ఎక్కడ వినిపించకుండాపోతాయో అని గట్టిగా చెప్పబోయాడు.
కౌన్సిల్ తన సీట్లో ఇబ్బందిగా కదిలి, అతను ఒత్తి పలుకుతున్న కృతజ్ఞతలని మధ్యలోనే తుంచేస్తూ, “ఇంత చిన్న విషయానికి అంత ఆర్భాటం చెయ్యొద్దు. నేను కష్టాల్లోఉన్న మనిషిని చూసినపుడు, అన్నీ అతని నెత్తిమీదపడి అతను నలిగిపోతున్నప్పుడు, వాటిని ఒకతన్నుతన్ని అతనికి సాయంచేసి నిలబెట్టాలనిపిస్తుంది. నా మతం నాకు అదే నేర్పింది. నాకు తెలిసింది కూడా అదొక్కటే.”
ఇంటికి చేరే దాకా మరోమాటలేకుండా మౌనంగా ప్రయాణించేరు. సూర్యాస్తమయం అయి, ఈదురుగాలితో కూడిన చల్లనిరాత్రి చీకటి ముసురుకున్నప్పుడు, తనకీ, తన భార్యాపిల్లలకీ ఆశ్రయంకల్పించిన ఆ స్థూలకాయుడైన మిత్రుడిని తలుచుకున్నప్పుడు, అతని మెడచుట్టూచేతులువేసి ప్రేయసిని ఆలింగనంచేసుకునే ప్రేమికుడిలా గాఢంగా గుండెకి హత్తుకునే వాడే. కానీ అతని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలా అన్నాడు: “స్టీవ్ కౌన్సిల్! చేస్తున్న ఈ సహాయానికి నేను ఏదో రోజు మీకు ప్రత్యుపకారం చేసి తీరుతాను.”
“నాకు ప్రత్యుపకారం వద్దు. నా మతం అలాంటి వ్యాపార సూత్రాలమీద నడవడం లేదు,” అన్నాడు వినమ్రంగా.
గాలి చల్లగా వీచ సాగింది. నేలమీద అప్పుడే సన్నగా మంచుకురిసి తెల్లగా మారుతోంది. కౌన్సిల్ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టి గేటు తలుపు తియ్యగానే, “నాన్నొచ్చాడు” అంటూ పిల్లలు హాస్కిన్స్ ని చుట్టుముట్టేరు. వాళ్ళని చూస్తే, నిన్నరాత్రి టేబిలు దగ్గరచూసిన వాళ్ళు వీళ్ళేనా అనిపిస్తుంది. సూర్యుడి వెచ్చదనం, మిసెజ్ కౌన్సిల్ ఆప్యాయతల ప్రభావంతో ముందటిరోజు మందకొడితనం స్థానంలో వాళ్లలో కట్టలుతెంచుకుంటున్న ఉత్సాహం చోటుచేసుకుంది, చలికాలంలో కీటకాలు పొయ్యిదగ్గర కాసేపు ఉంచగానే వాటిలో మళ్ళీ చైతన్యం నిండినట్టు.
(3)
హాస్కిన్స్ రాక్షసుడిలా కష్టపడ్డాడు, అతని భార్య ఆమె ధీరత్వానికి తగ్గట్టుగా చెప్పలేని కష్టాలనన్నిటినీ ఏమాత్రం విసుగూ, అసహనమూ లేకుండా, ఎవర్నీ నిందించకుండా భరించింది. వాళ్ళు ఉదయాన్నే లేచి, దిక్కులు చీకట్లతో నిండేదాకా కష్టపడిపనిచేసి, పక్కలో శరీరాన్ని కూలవేసేవేళకి, ఒంట్లోని ప్రతి ఎముకా ప్రతి నరమూ అలసటతో పీకేది. అయినా మరుసటిరోజు ఉదయాన్నే సూర్యుడితోపాటు నిద్రలేచి మళ్ళీ ఎప్పటిలాగే అంత శ్రమకీ సిద్ధమయ్యేవాళ్ళు.
పెద్దకుర్రాడయితే, వసంతఋతువల్లా పొలం దున్నడానికీ, విత్తనాలు జల్లడానికీ గుర్రాల్నితోలడానికే గాక, ఆవులకి పాలుపితకడంతో సహా, పెద్దవాళ్ళు చెయ్యవలసిన అనేకమైన చిల్లరమల్లర పనులన్నీ చేసి వాళ్లకి ఒక మనిషిసాయం అందించేడు.
అమెరికను వ్యవసాయక్షేత్రాల్లో బాలకార్మిక వ్యవస్థకి విరుద్ధంగా ఏ చట్టమూ లేనిచోట ఆ కుర్రాడు అలా పనిచెయ్యడం నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితే, కానీ, అక్కడ ఇది సర్వసామాన్యం. అతన్ని ఆ ముతక బట్టల్లో, వయసుకిమించిన కాలి బూట్లలో, వెలిసిపోయిన టోపీలో, నూతిదగ్గరనుండి బాల్టీతో నీళ్ళు తెస్తున్నప్పుడు అడుగులుతడబడుతూ నడవడం చూసినా, లేక గుర్రాల వెనక సూర్యోదయానికి ముందే నిద్రలేచి చలిలో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లడం చూసినా, పట్టణాల్లో పెరిగిన సందర్శకులకి బాధతో గుండె కలుక్కుమనక మానదు. హాస్కిన్స్ కి తనకొడుకంటే అలవిమాలిన ప్రేమ; అతణ్ణి ఈ దురవస్థనుండి తప్పించగలిగితే తప్పించి ఉండేవాడు; కానీ తను తప్పించగలిగే స్థితిలో లేడు.
జూన్ నెల వచ్చేసరికి ఆ క్షేత్రంలో వాళ్ళుపడ్డ మానవాతీతమైన శ్రమకి ఫలితం వాళ్ల పొలాల్లో కొంచెం కొంచెం కనిపించసాగింది. కళ్ళంలోని వాకిలి అంతా శుభ్రంచెయ్యబడింది. ఇప్పుడు చక్కని గడ్డి మొలుస్తున్నాది; తోటలోని మొక్కలన్నిటికీ గొప్పులుతవ్వి పాడయినవాటి స్థానంలో కొత్తవి వెయ్యబడ్డాయి; ఇల్లు మరమ్మత్తు చెయ్యబడ్దది.
కౌన్సిల్ తనదగ్గరున్న ఆవుల్లో నాలుగింటిని ఇతనికి ఇచ్చేడు. ఇస్తూ,
“వీటిని తీసుకుని భాగస్వామ్యలో నిర్వహించు. నాకు ఇప్పుడు అన్ని పాలు అవసరం లేదు. ఐక్ చాలమట్టుకు బయటే ఉంటున్నాడు. రోజూ ఎలాగూ తప్పదు, శని ఆదివారాల్లో వీటి సంరక్షణబాధ్యతలు నేను చెయ్యలేకపోతున్నాను.” అని అన్నాడు.
మిగతావాళ్ళుకూడా, కొత్తగావచ్చినతనిమీద కౌన్సిల్ చూపిస్తున్న నమ్మకం చూసి, తాముకూడ అతనికి పనిముట్లని వేళకి అమ్మ సాగేరు; అతను నిజంగా సమర్థుడైన రైతు కాబట్టి, అతని పొదుపరితనానికీ, అతని శ్రద్ధకీ ఋజువులు అతని చుట్టూ కనిపించసాగేయి. కౌన్సిల్ సలహామేరకు ఆ క్షేత్రాన్ని మూడేళ్ళకి కౌలుకి తీసుకున్నాడు, కావాలనుకుంటే మళ్ళీ కౌలుకి తీసుకుందికి గాని, కొనుక్కుందికిగాని తనకు హక్కు ఉండే నిబంధనతో.
“ఇది మంచి బేరం. దీన్ని నువ్వు ఎలాగైనా ఖరారు చేసుకో, ఏదైనా పంట చేతికి రాగానే కొంత విత్తనాలకీ, కొంత తినడానికి మిగుల్చుకుని, మిగిలినదానితోఅప్పులు తీర్చేయ్,” అని సలహా ఇచ్చేడు కౌన్సిల్.
హాస్కిన్స్, అతని భార్య గుండెల్లో కొత్తగా చిగురుతొడిగిన ఆశ, విశాలమైన గోధుమపంట జూలై నెలగాలికి తలలూపుతూ, సుడులు తిరుగుతుంటే, తియ్యని బాధగా పరిణమించింది. రానురాను రాత్రి భోజనాలు ముగించుకున్నాక గోధుమపంట చూడడానికి ప్రత్యేకించి వెళ్ళడం అలవాటుచేసుకున్నాడు.
“నెట్టీ! ఇవాళ గోధుమపంట ఎలా ఉందో గమనించేవా?” ఓ రోజు రాత్రి భోజనాలవగానే లేస్తూ భార్యని అడిగేడు హాస్కిన్స్.
“లేదు, టిమ్. నాకు తీరిక దొరకలేదు.”
“అయితే, ఇప్పుడు తీరిక చేసుకో. మనిద్దరం చూసొద్దాం. పద.”
టిమ్ పాతటోపీ ఒకటి ఆమె తలకిధరించి బయలుదేరింది. ఆమె నీరసంగా, విచారంగా కనిపిస్తున్నా, ఆ టోపీలో అందంగానే ఉంది. ఇద్దరూ కంచె దాకా నడిచేరు.
“నెట్టీ, ఈ పంట అందంగాలేదూ? ఒక్కసారి గమనించు.”
నిజంగా చాలా గొప్పగా ఉంది ఆ పొలం. ఒకే సమతలంలో ఉండి, అక్కడక్కడ ఎర్రగా, గింజ గట్టిపడుతూ, మెరుస్తున్న సంపదలా; కథల్లో చెప్పుకునే బంగారు వస్త్రంలా కనుచూపుమేర పరుచుకుని ఉంది.
“ఓహ్! ఎంతబాగుందో. నా ఉద్దేశ్యంలో మంచి దిగుబడే వస్తుందని ఆశిస్తున్నాను, టిమ్. ఎంత సాయం చేశారో గదా మనుషులు మనకి!”
“నిజం. కౌన్సిల్, అతని భార్యా మనకి ఇంత సహకారం అందించి ఉండి ఉండకపోతే మనం ఈ పాటికి ఎక్కడ ఉండేవాళ్లమో తెలీదు.”
“ఈ ప్రపంచంలో ఉత్తమోత్తమమైన మానవులు వాళ్ళు,” అందామె, కృతజ్ఞతతో గొంతు పూడుకుపోతుంటే.
“సోమవారం మనం కోతలు మొదలెడదాం,” అన్నాడు హాస్కిన్స్, కంచెమీద అడ్డంగా ఉన్న కర్రమీద చెయ్యివేసి అప్పుడే పొలంలో కోతకి దిగినట్టు కలగంటూ.
పంట పుష్కలంగా, అద్భుతంగా పండింది. కానీ, అంత పుష్కలంగానూ గాలులు వీచి చేలు చిక్కుపడడంతో బాటు, వర్షం పడి పంట కొన్నిచోట్ల నేలబారు అయిపోయి మట్టికొట్టుకుపోయింది, దాన్ని సాధనచెయ్యడం మూడురెట్లు కష్టం చేస్తూ.
“ఓహ్! ఆ రోజుల్లో వాళ్లు ఎంతగా శ్లాఘనీయంగా శ్రమించేరో చెప్పనలవికాదు. ఒక పక్క బట్టలు చెమటతో తడిసిపోతున్నాయి, భుజాలు చేను కొయ్యలేక నొప్పెడుతున్నాయి; అక్కడక్కడ ముళ్ళు గుచ్చుకుని వేళ్లు రక్తంకారుతూ పచ్చి పుళ్ళు అయిపోయేయి; బరువైన మోపులు మొయ్యలేక నడుములు విరిగిపోతున్నాయి. అయినా, హాస్కిన్స్, అతని పరివారమూ కాయకష్టం ఆపలేదు. పెద్దవాడు టమ్మీ హార్వెస్టర్ ని నడిపేడు. అతని తండ్రీ, మరొక కూలీ ఇద్దరూ యంత్రం మీద కట్టలు కట్టేరు. ఇలా రోజుకి ఒక పది ఎకరాలు చొప్పున కోత కోసేరు. క్రమం తప్పకుండ ప్రతిరోజూ రాత్రి భోజనాలయి, కూలీ నిద్రపోయిన తర్వాత, హాస్కిన్స్ ఒక్కడూ పొలానికి పోయి వెన్నెల వెలుగులో కట్టిన కట్టలను గింజనూర్చేవాడు. చాలా రాత్రుళ్ళు అతని భార్య పదిదాటినా రాకపోయేసరికి, ఆదుర్దాతో “చాలు. భోజనానికి రమ్మని” పిలిచేదాకా పని చేస్తూనే ఉండేవాడు.
అదే సమయంలో, ఆమె కూడా వాళ్ళకి వండి పెట్టేది, పిల్లలని చూసుకునేది, బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేది, రాత్రుళ్ళు ఆవులకి పాలు పితికేది, వెన్నతీసేది. అప్పుడప్పుడు గుర్రాలకి మేతవెయ్యడం, నీళ్ళు తాగించడం చేసేది ఒకప్రక్క భర్త గింజ నూర్చుతుంటే.
రోమను సామ్రాజ్యంలో ఏ బానిసా కూడ వోడల్లో ఇంత భయంకరమైన శ్రమచేస్తూ బ్రతికేవాడు కాదేమో! చిత్రంగా, ఈ మనిషిమాత్రం తను స్వేచ్ఛాజీవిననీ, తన భార్యా పిల్లలకోసం పనిచేస్తున్నాననీ అనుకుంటూ, శ్రమిస్తున్నాడు.
చివరికి తలమీంచి పెద్ద బరువు దిగిందన్న నిట్టూర్పుతో “హమ్మయ్య” అని తన పక్క మీద అలసిపోయి, మట్టికొట్టుకుపోయి, చెమటోడుతున్న బట్టలు మార్చుకుందికి కూడా ఓపికలేక కూలబడ్డప్పుడు, తనకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకోవాలనుకుంటున్న తన కలకి దగ్గరవడమేగాక, పేదరికాన్నీ, ఆకలినీ రోజురోజుకీ తన గడపనుండి దూరంగా తరమగలుగుతున్నానన్న సంతృప్తి కలిగింది.
స్రీకైనా, పురుషుడికైనా ఇల్లులేకపోవడమన్న నిరుత్సాహాన్ని మించిన నిరుత్సాహం మరొకటి ఉండబోదు. పల్లెల్లో రోడ్లమీదా, నగరాల్లో వీధులవెంటా తిరగడం, అలిసిపోయిన తమ పాదాలు విశ్రాంతి తీసుకుందికి ఒక గూడు లేకపోవడం, వెలుగుతున్న ప్రతి ఇంటి కిటికీ ముందూ అలసటతో ఆకలితో నిలబడి, లోపలి నుండి వినవస్తున్న పకపకలూ, సంగీతం వినడం… ఇలాంటి ఆకలీ, లేములే మగాళ్లని విప్లవాలవైపూ, ఆడవాళ్ళని సిగ్గుపడే పనులుచేసే వైపూ ప్రేరేపిస్తాయి.
అదిగో, ఇటువంటి ఇల్లులేకపోవడమనే భయమే, టిమొతీ హాస్కిన్స్ నీ, అతని భార్య నెట్టీని మొదటి సంవత్సరం అంత భయంకరమైన కష్టంచెయ్యడానికి పురికొల్పింది.
(4)
“ఉమ్. అవును. బాగుంది. ఉత్తమంగా ఉంది.” అన్నాడు బట్లర్, నీటుగా ఉన్న తోటనీ, పందులకొట్టాన్నీ, నిండుగా ఉన్న గాదెనీ పరికిస్తూ. “బాగానే ఫలసాయం చేసి గాదెలు నింపేవు. బాగా చక్కదిద్దేవు.”
హాస్కిన్స్ బట్లర్ కి తన క్షేత్రాన్ని చూపిస్తున్నాడు. తన బావమరిది ఏష్లీ కాంగ్రెస్ కి ఎన్నిక కావడంతో ఏడాదిగా ఈ చుట్టుపక్కలకి రావడం కుదరలేదు అతనికి. వాషింగ్టనూ, బోస్టన్లలోనే గడిచిపోయింది సమయమంతా అతనికి.
“అవును. గత మూడేళ్లలో దీనిమీద చాలా డబ్బు ఖర్చుపెట్టేను. చుట్టూ కంచెవెయ్యడానికే మూడువందల డాలర్లు అయింది.”
“ఓ అలాగా!” అన్నాడు బట్లర్. హాస్కిన్స్ తన మానాన్న తను చెప్పుకుపోతున్నాడు:
“వంటగదికి రెండువందలయింది; గాదెకయితే డబ్బురూపేణా పెద్ద ఖర్చు అవలేదు గానీ, దానిక్రింద సమయం చాలా వెచ్చించేను నేను. నేనే కొత్త నుయ్యి ఒకటి తవ్వేను స్వయంగా. నేను…”
“అవునవును. చూస్తున్నానుగా. బాగా బాగుచేశావు. ఇప్పుడు ఈ సరుకు విలువే వెయ్యిడాలర్లు ఉంటుంది.” అన్నాడు బట్లర్, గడ్డిపరక ఒకటి తీసి దాంతో పళ్ళు కుట్టుకుంటూ.
“ఇక ఆ విషయానికి వస్తే,” అంటూ వినమ్రంగా ప్రారంభించేడు హాస్కిన్స్. “మేము మాకు ఒక ఇల్లు సంపాదించుకోగలమని ఆశపడుతున్నాము; మేము చాలా కష్టపడ్డాము. మిస్టర్ బట్లర్, మేము ఇప్పుడిప్పుడే అలా ఊహించగలుగుతున్నాము. త్వరలోనే అది నిజం చేసుకోగలుగుతాం. ఇదిగో, ఈ శరత్కాలపు దుక్కిలు పూర్తిచేసుకున్నాక వాళ్ల బంధువులని చూడడానికి వెళదామని ఆలోచిస్తున్నాం కూడా.”
“సరిగ్గా,” అన్నాడు బట్లర్. అతను వేరే ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. “సరిగ్గా నేను చెప్పబోయేది కూడా అదే. అంటే, నువ్వు మరో మూడేళ్ళు ఈ పొలం మీద ఉండడానికి నిశ్చయించుకున్నట్టేనా?”
“అవును. నిశ్చయంగా. అసలు సంగతేమిటంటే, సబబైన ధరా షరతులూ కుదిరితే, మనం ఒప్పందం గడువు పూర్తయేవేళకి దీన్ని కొందామనుకుంటున్నాను.”
“ఊ హూం. నీ దృష్టిలో సబబైన ఒప్పందం అంటే ఏమిటి?”
“చెప్పాలంటే, అనుకున్న ధరలో నాలుగోవంతు ముందు చెల్లించి, మూడేళ్లలో కొరదా డబ్బులు చెల్లించడం.”
బట్లర్ ఒక్కసారి అక్కడ కళ్ళంనిండా, నిండుగా ఉన్న గోధుమ నిల్వలు చూశాడు. వాటిమీదకి కోడిపిల్లలు ఎక్కుతూ, ఎగురుతూ, మిడతల్ని పట్టుకుంటున్నాయి; కీచురాళ్ళు కూడా తెగగోల చేస్తున్నాయి. అతను చిత్రంగా ఒక నవ్వు నవ్వి ఇలా అన్నాడు.
“నేను నీపట్ల కఠినంగా ఉండదలుచుకోలేదు. నిజం. కానీ, ఈ క్షేత్రానికి ఎంత ఇద్దామని నీ అభిప్రాయం?”
“అదేమిటి? ఇంతకుముందు మీరు చెప్పిందేగదా. .. రెండువేల అయిదువందల డాలర్లు… తప్పితే మూడువేలు.” బట్లర్ తల అడ్డంగా పంకించడం చూసి మూడువేలు అని జోడించాడు.
“ఈ పొలం ఖరీదు ఇప్పుడు అక్షరాలా ఐదువేల అయిదువందల డాలర్లు,” అన్నాడు బట్లర్ ఖరాఖండీగా, నిర్లక్ష్యంగా, మాటకి తిరుగులేదన్నట్టు.
“ఏమిటీ?” అని ఒక కేక వేసినట్టు అరిచాడు హాస్కిన్స్. “అదేమిటి? ఐదువేలేమిటి? మూడేళ్ళక్రిందట మీరు దీన్ని రెండువేల అయిదువందలకి అమ్ముతానన్నారుగదా?”
“నిజమే. అప్పుడు దీని విలువ అంతే! అప్పుడు ఇది బాగా పాడుబడిపోయింది. ఇప్పుడు దీని పరిస్థితి మెరుగుపడింది. నీ లెఖ్ఖప్రకారం చూసినా దీనిక్రింద బాగుచెయ్యడానికి నువ్వే పదిహేనువందల డాలర్లు ఖర్చుచేశావు కదా?”
“కానీ అందులో మీ పెట్టుబడి గానీ, మీ శ్రమగానీ లేవే.”
“పందెం వెయ్యి లేదని? ఇది నా భూమి కాదా?”
“మరి అలా అయితే, నా కష్టానికి ప్రతిఫలం ఏమి ముట్టింది?”
“మరిన్నాళ్ళూ ఎవరు అనుభవించారు?” అన్నాడు బట్లర్, అతని ముఖమ్మీదే చిద్విలాసంగా నవ్వుతూ.
ఇసక బస్తాతో నెత్తిమీద కొట్తినట్టయింది హాస్కిన్స్ కి. తలదిమ్మెక్కిపోయింది. మెదడు పనిచెయ్య లేదు. ఏదో చెప్పబోతున్నట్టు సణుగుతున్నాడు: “మరి దాన్ని నేను అనుభవించడానికి అవకాశమేదీ. మీరు నన్ను నిలువునా దోచినట్టే. దానికంటే ముఖ్యంగా, మీరు ముందే ఒప్పుకున్నారు గదా గడువు తీరిన తర్వాత దీని నేను కొనుక్కుందికి గాని, తిరిగి మరో మూడేళ్లకి కౌలుకి తీసుకుందికి గాని …”
“అది సరే. కానీ నువ్వు బాగు చేసిందంతా నీతో ఎత్తుకుపోవడనికీ, దీన్ని అదే రెండువందల యభై రేటుకి కౌలుకి ఇవ్వడానికి నేనేమీ ఒప్పందం పడలేదు కదా. ఈ నేల విలువ రెండురెట్లు అయింది. అదెలా అయిందో నా కనవసరం. దానిగురించి నేను వాదించదలుచుకో లేదు. నీ కిష్టమయితే ఐదువందలు సాలీనా అద్దె చెల్లించిగాని, ఐదువేల అయిదువందల ఖరీదుకి నీకు నచ్చిన షరతులకిగాని తీసుకోవచ్చు. లేదా ఖాళీ చేసెయ్.” అని చెప్పి అతను వెనుదిరిగి పోతున్నాడు.
ముఖం మీదనుండి చెమట కారుతుంటే, హాస్కిన్స్ అతనికి ఎదురుగా మిలిచి మళ్ళీ ఇలా అన్నాడు:
“దాని విలువ పెరగడానికి మీరు ఏమీ చెయ్యలేదు. ఒక సెంటు కూడా ఖర్చుపెట్టలేదు. పెట్టిన ఖర్చేదో నేను పెట్టేను. చెమటంతా ధారపోసి కష్టపడ్డాను. నా కోసమనీ నా పిల్లలకోసమనీ కష్టపడ్డాను…”
“అలాంటప్పుడు నేను మొదటిసారి అమ్మజూపినపుడు ఎందుకు కొనలేదు? నువ్వేం చేస్తున్నట్టు?
“ఏం చేస్తున్నానా? పొలంహద్దు చుట్టూ నాడబ్బుతో కంచె వేయించి, నా డబ్బుతో వంటిల్లు మరమ్మత్తు చేయించి, నా డబ్బుతో తోటల్లా బాగుచేయించి, నా డబ్బుఖర్చుపెట్టి ఈ జాగాకి రెండురెట్లు ధరపలికేట్టు చేస్తున్నాను.”
బట్లర్ ఒక నవ్వు నవ్వేడు. “నువ్వు కొత్త కుర్రాడివి కాబట్టి ఇది జీర్ణించుకోలేకపోతున్నావు. నువ్వూ నీ బాగుచెయ్యడాలూను. చట్టం దృష్టి వేరేగా ఉంటుంది.”
“నువ్వు మాటకి కట్టుబడి ఉంటావని విశ్వసించాను.”
“చూడు, మిత్రమా, జీవితంలో ఎవ్వడినీ నమ్మకు. అదిగాక, ఇలా చెయ్యనని నీకేమైనా నేను వాగ్దానం చేసేనా? ఏం? ఎందుకలా చూస్తావు? నన్ను దొంగక్రింద జమకట్టకు. చట్టం అదే చెబుతోంది. ఇది సర్వసామాన్యం. నేనే కాదు, అందరూ అదేపని చేస్తారు.”
“వాళ్ళేం చేస్తారో నాకు లక్ష్యం లేదు. ఏం చేసినా అది దోపిడీ క్రిందే లెఖ్ఖ. మూడువేలడాలర్ల విలువచేసే నాడబ్బూ, నా భార్యదీ, నాదీ శ్రమా తీసుకో,” అంటూ ఒక్కసారి కూలబడిపోయాడు. అతను మానసికంగా అంత బలమైన వ్యక్తి కాదు. అతను ఎంత కష్టమైనా భరించగలడు; విరామమెరుగని ఎంతశ్రమనైనా తట్టుకోగలడు; కానీ అతను ఏమాత్రం కనికరంలేకుండా హేళనగాచూస్తున్న బట్లర్ ముఖాన్ని సహించలేకపోయాడు.
“అదేం కుదరదు,” ప్రశాంతంగా చెప్పసాగేడు బట్లర్, “నువ్వు చెయ్యవలసిందల్లా అయితే ఇప్పట్లాగే పనిచేసుకోవడం; లేకపోతే వెయ్యి డాలర్లు ముందు చెల్లించి మిగిలినదానిమీద పదిశాతం వడ్డీ చెల్లించడం.”
పక్కనే ఒక ఓట్స్ బస్తా ఉంటే దానిమీద కూలబడిపోయాడు హాస్కిన్స్… తల వాల్చేసుకుని, కళ్ళు తేలవేసుకుంటూ మళ్ళీ ఒక్క సారి పరిస్థితి అంతా సింహావలోకనం చేసుకున్నాడు. అతనిపుడు సింహం పంజా కింద చిక్కుకున్నాడు. అతని హృదయంలోనూ, అవయవాల్లోనూ ఏదో చెప్పలేని అచేతనత్వం ఆవహించింది. అతనిపుడు పొగమంచులో చిక్కుకుని దిక్కుతెలియని వాడిలా ఉన్నాడు. అతనికిపుడు దారీ తెన్నూ కనబడటం లేదు.
బట్లర్ మేటువేసి ఉన్న ధాన్యపుగింజల బస్తాలని పరీక్షిస్తూ నాలుగు పక్కలా తిరగసాగేడు. ఉండుండి, పిడికిలిలోకి కొన్ని గింజలు తీసుకుని, అరిచేతిలో నలిపి పొట్టు ఊదుతున్నాడు. అలా చేస్తూ ఏదో కూనిరాగం ఆలపిస్తున్నాడు. అతని వాలకం హాస్కిన్స్ ఏమి సమాధానం చెబుతాడా అని ఎదురుచూస్తున్నట్టు ఉంది.
హాస్కిన్స్ కి గత సంవత్సరం పడిన శ్రమంతా కళ్ళకు కట్టినట్టుంది… అతను వర్షంలో తడుస్తూ, నాగలి వెనక బురదలో నడుస్తున్నాడు; అతని ముఖంమీద పంటనూర్చినప్పటి దుమ్మూ, ధూళీ పేరుకుపోయేయి; కొరుకుతున్న చలిలో, కోస్తున్న చలిగాలిలో తూర్పారబట్టడం, శరీరం మీద పేరుకున్న మంచూ, ఇప్పటికీ వాటి స్పర్శ వదలలేదు. అతనికి భార్య గుర్తుకొచ్చింది… శలవుగాని, విశ్రాంతి అన్నదిగాని లేకుండా, చెదరని చిరునవ్వుతో అన్నీ భరిస్తూ, ఆమె వంటవండి, రొట్టెలు చెయ్యడమూ గుర్తుకొచ్చేయి.
“అయితే ఇంతకీ ఏమంటావ్?” అని అడిగేడు ప్రశాంతంగా బట్లర్. అతని గొంతులో ఎగతాళి, వ్యంగ్యం, తొంగిచూస్తున్నాయి.
“నువ్వో దొంగవి, అబద్ధాలకోరువి అంటాను,” అని గట్టిగా అరిచేడు హాస్కిన్స్ ఒక్కసారి బస్తామీంచి ఉరుకుతూ. “నువ్వో పాపిష్టి వేటకుక్కవి.” బట్లర్ నవ్వు అతన్ని పిచ్చివాడిని చేసింది; ఒక్క సారి ఎగిరి చేతిలోకి ఫోర్క్ ఒకటి అందుకుని గాలిలో గిరగిరా తిప్పేడు. పళ్ళు పటపటా కొరుకుతూ, “నువ్వు జన్మలో మరో మనిషిని దోచుకోవు, పాపీ!”. నిందిస్తున్న ఆ కంటిచూపులో నిర్దాక్షిణ్యమైన క్రౌర్యం కనిపిస్తోంది.
బట్లర్ పొడిచేస్తాడన్న భయంతో వణుకుతూ, అడుగు వెనక్కి వేసాడు, క్షణకాలం క్రితం తను ఏవగించుకున్న వ్యక్తి అకస్మాత్తుగా రాక్షసుడిలా మారిపోయి తనవైపు చూసిన చూపుకి నిశ్చేష్టుడై ఉండిపోయాడు. హాస్కిన్స్ చెయ్యెత్తడానికీ, పొడవబోడానికీ మధ్య నున్న భయంకరమైన విరామంలో ఒక చిన్నారి లేత నవ్వుని గాలి మోసుకురావడంతో పాటు, అతని దృష్టిపరిధిలోకి, దూరాన చీకట్లో, సూర్యుని కిరణాలు పడి మెరుస్తున్న అతని కూతురి తల లీలగా కదిలింది… రెండేళ్ల ఆ పిల్ల వాకిలి ముంగిట గడ్డిలో పరిగెత్తుతోంది తలుపుదగ్గరకి. అతని చేతులు ఒక్కసారి పట్టు తప్పి ఫోర్కు క్రింద పడిపోయింది; తల వాలిపోయింది.
“నువ్వు నీ దస్తావేజుల్నీ, తణఖానీ రాయించుకుని నా పొలం నుండి తక్షణం వెళిపో! మళ్ళీ జన్మలో నా కంట పడకు. పడ్డావో, నిన్ను చంపేస్తాను!”
బట్లర్ ఆ మనిషినుండి ఒక్క ఉదుటున దూరంగా జరిగి, గుర్రపుబండిలోకి కాళ్ళూ చేతులూ వణుకుతూండగా కూలబడి రోడ్డంబట దౌడుతీసాడు… హాస్కిన్స్ ఎండుగడ్డిలో, తల చేతుల్లోకి తీసుకుని నోటమాటలేక అలా మౌనంగా కూచున్నాడు.
** ** **
హామ్లిన్ గార్లాండ్ (సెప్టెంబర్ 14, 1860 – మార్చి 4, 1940) అమెరికను కవీ, నవలా కారుడూ, కథకుడూ, వ్యాసకర్తా, పారా సైకాలజీలో పరిశోధకుడూ. అతని రచనలలో చాలవరకు మధ్య అమెరికాలోని (అంటే, ఇలినోయీ, ఇండియానా, అయోవా, కాన్సాస్, మిషిగన్, మినెసోటా, మిసోరి, నెబ్రస్కా, నార్త్ డకోటా, ఒహాయో, సౌత్ డకోటా, మరియు విస్కాన్సిన్) రైతుల జీవిత చిత్రణ ఉంటుంది.. పైన చెప్పిన చాలా మధ్య అమెరికను క్షేత్రాల్లో నివసించిన గార్లాండ్, చివరికి మెసాచ్యూట్స్ లోని బోస్టన్ లో స్థిర పడ్డాడు. ఆ అనుభవాల నేపధ్యంలో వ్రాసిన కథల సంపుటి Main-Travelled Roads (1891) బాగా పేరు సంపాదించిపెట్టింది. తర్వాత 1898 లలో కెనడాలోని యూకోన్ నదీ ప్రాంతంలోని Gold Rushని చూడడానికి వెళ్ళి The Trail of The Gold Seekers (1899) Main Travelled Roads వంటి చేసిన గార్లాండ్ కి 1922లో పులిట్జరు బహుమతి వచ్చింది. అతని మరణానంతర ప్రార్థనలలో అతను రాసిన కవిత The Cry Of The Age చదవబడింది.
ఈ కథ అతని మొట్టమొదటి కథా సంకలనం Main-Travelled Roads లోనిది. మానవీయ విలువలకీ, మార్కెట్ విలువలకీ సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే. కాని కొంతమంది కోరి మానవవిలువలు అక్కున చేర్చుకుంటే, కొందరు రెండవదానికి తలవంచుతారు. చిన్న కాన్వాసులో కనిపిస్తున్న ఈ కథలో ఒకానొక కాలాన్ని సమర్థవంతంగా బంధించగలిగాడు రచయిత. పాఠాలు వల్లెవెయ్యడానికి అవకాశం ఉన్న ఈ కథలో ఎక్కడా రచన పక్కతోవ పట్టదు. ఎవరు హాస్కిన్స్(Haskins)ని సమర్థిస్తారు, ఎవరు బట్లరు (Butler) ని సమర్థిస్తారన్నది వాళ్లవాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలమీద ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో క్రింద ఇచ్చిన 2వ లింకులోని చర్చ రసవత్తరంగా ఉంటుంది చదవడానికి.
Read the original here:
http://xroads.virginia.edu/~hyper/CONTEXTS/Garland/paw.html
వ్యాఖ్యానించండి