తండ్రీ! కొత్తగా మొలకెత్తుతున్న గడ్డిపరకలపై
తేల్చితేల్చి ఎలా నడవాలో నాకు బోధించు;
క్రూరమైన ఈ ప్రపంచం చేసే గాయాలని
రాయిలా తట్టుకోగల ఆత్మనిబ్బరాన్ని ప్రసాదించు;
కానీ, ఈ మనసునిమాత్రం నీ శక్తితో నిలబెట్టి,
పువ్వుల్లా నిరాడంబరంగా ఉండేలా అనుగ్రహించు;
ఆర్ద్రత నిండుకున్న ఈ హృదయకలశాన్ని నిండనీ
ఎర్రని పాపీ పువ్వుల్లా తలెత్తి ఎదురుచూస్తూ;
జీవితం దాని ఔన్నత్యాన్ని తేలికగా తీసుకోనీ
పండిన పాపీలు వినమ్రంగా తలవాల్చుకున్నట్టు;
మనసు నైరాశ్యంలో కూరుకుపోయినప్పుడూ,
తొలిచిగురుతో తిరిగి బతుకుని ప్రారంభించినపుడూ
చెట్లలా సహనంతో, కరుణతో, జీవించడమెలాగో
తండ్రీ!దయచేసి నాకు విశదీకరించు.
మధ్యాహ్నపు ఎండలో ఓక్ చెట్టు నీడన
కీచురాళ్ళు ఆనందంతో అరుస్తుంటాయి;
కుమ్మరిపురుగు దారి మళ్ళి
చల్లని నీడలో కాసేపు విశ్రమిస్తుంది;
బాటసారులు అలసటతీర్చుకుందికి పనికివచ్చే
సాటిలేని ప్రశాంతమైన ఏకాంత ప్రదేశానికీ,
ఉద్యానవనాలోని చలువ మండపానికీ
నన్నూ నా హర్షాతిరేకాన్ని తెలియపరచనీ!
.
ఎడ్విన్ మార్ఖాం
April 23, 1852 – March 7, 1940
అమెరికను కవి
.

వ్యాఖ్యానించండి