గడ్డకట్టించే చలిగురించీ,
పైన్ చెట్టుకొమ్మలమీద
పేరుకున్న మంచు గురించీ
అవగాహనకావాలంటే,
శీతాకాలం గురించి తెలియాలి;
అంతే కాదు,
జూనిపర్ లు మంచులో
మత్తుగాతూలడం చూడాలన్నా
జనవరి సూర్యుడి వెలుగులో
దూరంగా స్ప్రూస్ చెట్ల నిగనిగలు చూడాలన్నా
చాలాకాలం చలిలో మగ్గి ఉండి ఉండాలి;
శీతగాలికోతపెట్టేహోరు అయితే చెప్పనలవికాదు.
ఆ ప్రదేశాన్నంతా ఆవరించి,
ఉన్న ఆ నాలుగు ఆకుల చప్పుడుతప్ప
వేరుచప్పుడు అక్కడవినబడదు;
ఆ దిగంబర ప్రకృతిలో
గిరికీలుకొట్టే గాలి అదే;
ఆ మంచులో, తనమాట వినేవాళ్ళు
ఎవరూ లేని శ్రోతకి,
అక్కడ లేనిదే కాదు,
అక్కడ ఉన్నది కూడా ఏదీ కనిపించదు.
.
(“హార్మోనియం (1923)” కవితాసంకలనం నుండి)
వేలెస్ స్టీవెన్స్
October 2, 1879 – August 2, 1955
అమెరికను కవి.
ఈ కవిత అర్థం చేసుకుందికి ఈ చిన్న విషయం తెలియాలి. “Snow Man” అని శీతల దేశాల్లో మంచుకురిసిన తర్వాత ఒక బొమ్మ తయారు చేస్తారు. కురిసిన మంచుని చాపలా చుట్టి దాన్ని మళ్ళీ వేర్వేరు పరిమాణాలలో గోళాల్లా తయారు చేసి, అన్నిటికంటే పెద్దది క్రిందనా, దానికంటె చిన్నది పైనా అలా పేర్చుకుంటూ పోయి, అన్నిటికంటే మీదనున్న దానికి కళ్ళూ, చెవులూ ముక్కూ కాగితాలతోనో, అట్టలతోనో తయారు చేసి, మెడలో ఒక మఫ్లరూ, తలకి టోపీ పెట్టి, వయొ బేధం లెకుండా పిల్లలూ పెద్దలూ అందరూ ఆడడం అక్కడ అలవాటు.
ఈ కవితలో మంచుమనిషి ఎవరో చివరిదాకా తెలియదు. అక్కడ ఇచ్చిన పదబంధాల కూర్పుతో, కవివెనకే మనమూ నడిస్తే, మనకు అర్థం అవుతుంది, మనమే ఆ మంచుమనుషులమని. కాకపోతే, చలిని ప్రత్యక్షంగా అనుభవించనక్కరలేకుండా, అద్భుతమైన ఆ మంచుకురిసిన చిత్రాన్ని కళ్ళముందు ఆవిష్కరించుకో వచ్చు.
ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. మనకి వస్తువుల్ని వస్తువులుగా (యధా గ్రాహ్యంగా) చూడడానికీ, చూస్తున్న వస్తువునీ/ చిత్రాన్నీ మనసులో అందంగా, రమణీయంగా, తాత్త్వికంగా, లేదా, నైతికంగా అనువదించుకునే లక్షణానికీ మధ్య ఉన్న సంఘర్షణని సూచిస్తుంది. మనకున్న కొన్ని సహజ లక్షణాలవల్ల, లేదా కొన్ని మోడల్స్ వల్ల, అన్నిటినీ ఆ దృష్టితో చూడడమో, ఆ విలువలతో తైపారవెయ్యడమో (మూల్యాంకనం చెయ్యడమో), చేస్తుంటాం. కేవలం నిర్లిప్తంగా, ఉన్నది ఉన్నట్టు, ఏ ఇతర రంగులూ, రుచులూ, వాసనలూ, లేకుండా చూడమనడం / చూడగలగాలి అని చెప్పడం ఇక్కడ కవి భావన. మనకు తెలిసీ, తెలియకుండా కూడా మనం కొన్ని పరిమితులను సృష్టించుకుంటాం అన్నది ఒక సత్యం.
.

.


.

.
The Snow Man
.
One must have a mind of winter
To regard the frost and the boughs
Of the pine-trees crusted with snow;
And have been cold a long time
To behold the junipers shagged with ice,
The spruces rough in the distant glitter
Of the January sun; and not to think
Of any misery in the sound of the wind,
In the sound of a few leaves,
Which is the sound of the land
Full of the same wind
That is blowing in the same bare place
For the listener, who listens in the snow,
And, nothing himself, beholds
Nothing that is not there and the nothing that is.
( from Harmonium , 1923)
Wallace Stevens
(October 2, 1879 – August 2, 1955)
American Poet
Poem Courtesy: http://homepages.wmich.edu/~cooneys/poems/Stevens.Snowman.html
వ్యాఖ్యానించండి