ప్రజలందరిలో అలసట, అసంతుష్టి, నిరాశ
ప్రజలందరిలో దెబ్బతిన్న అహం, ప్రతీకారేచ్ఛ
ప్రజలందరిలో నయవంచన, భయం,
ప్రజలందరిలో ఆశాభంగం, మృగ్యమైన కల్పనాశక్తి
వాళ్ళందరి మధ్యనుండి ఫ్రీవే (రాజమార్గం) మీద
నేను నా వాహనం నడుపుతుంటాను…
వాళ్ళు వాళ్ళ వాహనం నడిపే తీరులో
వాళ్ళల్లో శేషించిన “వ్యక్తిత్వం” ప్రతిఫలిస్తుంటారు.
కొందరు ఇతరులకంటే ఎక్కువ ద్వేషిస్తూ, అడ్డుపడుతుంటారు
కొందరు ఎవరూ తమని దాటిపోవడాన్ని ఇష్టపడరు
కొందరు ఇతరులు తమని దాటిపోలేకుండా నియంత్రిస్తుంటారు
కొందరి లైన్లు మారకుండా అడ్డుకుంటుంటారు
కొందరికి కొత్తకార్లన్నా, కొత్త మోడలు కార్లన్నా కోపం
కొత్త మోడలు కార్లలో ఉన్నవాళ్లకి, పాతమోడలు కార్లంటే అసహ్యం
ఆ రకంగా రాజమార్గం చాలా చిన్న చిలిపి,
లేకి భావాలు ప్రదర్శింపబడే సర్కస్సులా ఉంటుంది
అది నిరంతర చలనశీలమైన మానవాళి
చాలామంది తాము ద్వేషిస్తున్న ఒక చోటునుండి
అంతగానో, అంతకంటే ఎక్కువో ద్వేషించే మరోచోటుకి వెళుతుంటారు
.
ఫ్రీవేలు మనం ఎలా మారిపోయామో తెలుసుకుందికి ఉదాహరణలు
దానిమీదజరిగే ఢీకొట్టుకోడాలూ, మరణాలూ
కొందరు పిచ్చివాళ్ళ, జాలిపడవలసినవాళ్ళ,
అసంపూర్ణవ్యక్తిత్వాలు.
నేను ఫ్రీవే మీద వెళుతున్నప్పుడల్లా
నా నగర నాగరీకుల
వికృత, కురూపి, అనాకారి ఆత్మ చూస్తుంటాను
సజీవులైన ఈ మనుషులు
గుండెను నిర్జీవంగా మార్చేరు.
.
ఛార్లెస్ బ్యుకోవ్ స్కీ
(16 ఆగష్టు 1920 – 9 మార్చి 1994)
అమెరికను కవీ, నవలా కారుడూ, కథా రచయితా
.
కవికి స్పందించే హృదయము ఉండాలిగాని, కవిత్వీకరించలేని వస్తువు ఉండదనడానికి ఈ కవిత ఒక చక్కని ఉదాహరణ. మనుషుల అంతరాల్లో జరిగే నిరంతర సంఘర్షణలు వాళ్ళ వాహనాలు నడిపే తీరులో ఎలా ప్రతిఫలిస్తాయో ఫ్రాయిడియన్ కౌశలంతో చెబుతున్నాడు కవి. అందులో ముఖ్యంగా ” వాళ్ళు ద్వేషించే ఒకచోటునుండి, అంతగానో అంతకంటే ఎక్కువగానో ద్వేషించే మరో చోటుకి” అన్నది గమనించదగ్గది. ప్రజలందరి జీవితం ఎంత పోరాటం అయిపోయిందంటే, వాళ్ళకి ఇంటిదగ్గరా సుఖం లేదు, ఆఫీసులోనూ సుఖం లేదు. నగర జీవితం ఎంత నిరాశా నిస్పృహలతో కూడుకున్నదే గాక, ఎంత నిస్సారమూ, uninspiring గా ఉంటుందో, లేదా, ఉందో ఈ కవితలో బాగా చెప్పాడు కవి. అట్టడుగు వర్గాన్నుండి వచ్చి, లాస్ ఏంజల్స్ నగరం లోని అన్ని చీకటికోణాలూ చూసిన జీవితం అతనిది.

వ్యాఖ్యానించండి