ఆ నీలిరంగు గంటెనపూలు,
ముసుగులోతప్పెట్లలా సడిలేకుండ,
తిరోజ్ఞ్ముఖమౌతున్న సేనలా,
చావువాయిద్యంలా చిత్రంగా గలగలలాడేయి.
దాని భారీ పృష్టం మీద కూర్చున్న
నా తెల్ల ఆల్సేషియన్ కుక్క ‘జ్యూస్’, ఎందుకో
ఒక్క సారి ఏడుపు లంకించుకుంది
కానీ, బాగా గాలి వీస్తున్న ఆ మధ్యాహ్నవేళ,
దీవాను మీద మొగలాయీ తలగడలకు చేరబడి
మహరాణీలా కూర్చున్న ఎనభై మూడేళ్ళ మా అమ్మతో
చతుర సంభాషణ జరుపుతున్న నేను
ఈ శకునాలేవీ గుర్తించలేకపోయాను
.
నేను చెప్పినదానికో, చెప్పనిదానికో గాని
ఆమె పగలబడి నవ్వింది. ఒక లిప్త పాటు విరామం.
తర్వాత తలుపుగడియ కదిలిన చప్పుడు, ఆమె గొంతు
కుండలో వేసి గిలకరించిన గులకరాళ్ళలా
దగ్గుతో కింకలుచుట్టుకుపోవడం మొదలెట్టింది.
కుక్క ఏడుపు మాని, మూడుసార్లు మొరిగింది.
మా అమ్మ గుండెమీద చెయ్యి అలాగే ఉండిపోయింది
అంతే! నేను నిర్భాగ్యుడిని అయిపోయాను.
నా వేదనలో ఎక్కడో నిగూఢమైన బంధాలు
ఒక్కటొక్కటే తెగుతున్న చప్పుడు విన్నాను
.
హిందువుల నమ్మకం ప్రకారం,
పదమూడు రోజులుపాటు ప్రేతాత్మ
తన లౌకిక ఆవాసము చుట్టూ తిరుగాడుతుందట
కనుక పదమూడురోజులపాటు
నేను ఆ ఆత్మతో సంభాషించేను.
.
ఇప్పుడు,
ఎప్పుడు తలుపులు కొట్టుకున్నా,
చలిగాలి ఊళలేసినా,
కుక్క ఏడ్చినా,
గంటెనపూలు గలగలలాడినా,
ఆమె నాలో ఉన్నట్టే
అనుభూతి చెందుతున్నాను.
.

వ్యాఖ్యానించండి