
[ఆంగ్ల సాహిత్యంలో గొప్పస్మృతిగీతాలలో(elegies) ఒకటిగా పేరుపడ్డ ఈ గీతం గమనించండి. కొందరు జీవించడం లోనే కాదు మరణం లో కూడా చాలా హుందాగా ఉంటారు. యుధ్ధరంగంలో శత్రువులకు చిక్కకుండ తమనాయకుడి దేహాన్ని సమాధి చెయ్యవలసివచ్చినపుడు, శత్రువులకు తమ ఉనికి తెలియకుండా ఈ పని రాత్రిపూట నిర్వర్తించవలసి వచ్చినపుడు, ఒక సైనికుడిగా, తమనాయకుడికి లాంఛనప్రాయమైన తుది వీడ్కోలు ఇవ్వలేకపోయామన్న బాధను ప్రకటించే ఈ గీతం కళ్ళు చెమరిస్తుంది. సర్ జాన్ మూర్ నెపోలియన్ బోనాపార్ట్ సైన్యాన్ని ఎదుర్కొని, స్పెయిన్ లో కొరునా అన్నచోట Marshal Soult సేనలపై విజయం సాధించినా, అతను ఫిరంగి గుండు దెబ్బకి మరణిస్తాడు. అతని స్మృతిలో ఛార్ల్స్ వుల్ఫ్ రాసిన గీతమిది.]
.
అతని పార్థివ శరీరం ప్రహారీకి దగ్గరగా మోసుకొస్తున్నప్పుడు
ఒక్క నగారా మోగలేదు, ఒక శోకగీతం ఆలపించలేదు,
మా నాయకుడిని సమాధిలోకి దించుతున్నప్పుడు
ఏ ఒక్క సైనికుడూ తన తుదివీడ్కోలు వందనం నినదించలేదు.
తుపాకి బాయ్ నెట్ లతో మట్టిని పెల్లగిస్తూ,
మసక మసకగా వెన్నెల పడుతుంటే,
లాంతరు సన సన్నగా వెలుగుతుంటే
అర్థరాత్రపుడు చీకటిలోనే సమాధిచేశాం
ఏ పనికిమాలిన శవపేటికా అతని గుండెల్ని మూయలేదు,
ఏ వస్త్రంగాని, ముసుగుగాని అతన్ని కప్పలేదు,
తనొక యుధ్ధవీరుడు విశ్రమిస్తున్నరీతిగానే
తన సైనిక దుస్తులలోనే నిద్రిస్తున్నాడు.
మేం తక్కువ ప్రార్థనలతో, అవీ క్లుప్తంగా, ముగించేం.
ఎవరిమూ ఒక విషాదశబ్దమూ పలకలేదు
అతని ముఖాన్ని అలాగే నిశితంగా పరీక్షిస్తూ,
మరుచటిరోజుగురించి తీవ్రంగా ఆలోచించాం.
సన్నని అతని సమాధి తవ్వుతున్నప్పుడు,
అతని తలక్రింది నేల చదునుచేస్తున్నప్పుడు అనుకున్నాం,
శత్రువులూ ఇతరులూ అతని సమాధిమీద నడవాలి,
మేము మాత్రం వాళ్ళకి దూరంగా … ఎక్కడో … అలలమీద ఉండాలి.
పోయినవాడి గురించి వాళ్ళు తేలికగా మాటాడొచ్చు,
అతని సమాధిమీదే కూర్చుని దూషించనూ వచ్చు.
అయినా అతనికేం ఖాతరు? ఈ బ్రిటను తవ్విన సమాధిలో
అతన్ని పరుండనిస్తే, అంతే చాలు!
.మా పని ఇంకా సగం కూడా పూర్తికాలేదు
అప్పుడే గంట మోగింది మేం వెనక్కి తిరిగి వెళ్ళడానికి.
దూరాన్నుండి ఉండీ ఉడిగీ తుపాకీ చప్పుడు వినిపిస్తోంది
శత్రువు అప్పుడే మూర్ఖంగా కాల్పులు ప్రారంభిస్తున్నాడు.
రక్తసిక్తమూ, అప్పుడేసంపాదించుకున్న అతనికీర్తికి నెలవైన
యుధ్ధభూమినుండి తీసుకువచ్చి, విచారంతో, నెమ్మదిగా సమాధిలోకి దించాం;
అతని గురించి ఒక ముక్క రాయలేదు, ఒక శిలాఫలకం నిలబెట్టలేదు,
అతన్ని ఒంటరిగా, అతని యశస్సుకి విడిచిపెట్టి వచ్చేశాం.
.
ఛార్ల్స్ వుల్ఫ్,
ఐరిష్ కవి
.
వ్యాఖ్యానించండి