[ఆంగ్ల సాహిత్యం లో బ్యూమాంట్(Beaumont), ఫ్లెచర్ (Fletcher) లది పేరుపడ్ద జంట. ఒకరి పేరుతో రెండవవారి పేరు విడదీయరానంతగా కలిసిపోయిన జంట నాటక రచయితలు వీరిద్దరూ. వాళ్ళిద్దరి హాస్యరసప్రధానమైన Comedy లు అప్పటికీ ఇప్పటికీ మనోరంజకంగా నిలిచిఉన్నాయి. ఒక్క పిసరు ఫ్లెచర్ లొ కవిత్వపు పాలు ఎక్కువ. కొన్ని నాటకాలలో ఎవరు ఏభాగం రాసేరో చెప్పలేనంత బాగా కలిసిపోయాయి వాళ్ల భావనలూ, భాషా.
చిత్రమేమిటంటే, ఫ్లెచర్ షేక్స్పియర్ తో కూడా కలిసి నాటకాలు రాసిన దాఖలాలున్నాయి ముఖ్యంగా Henry VIII & Two Noble Kinsmen. అతను మాసింగర్ మొదలైన వాళ్లతో కూడా కలిసి నాటకాలు వ్రాసేడు. అతను స్వయంగా 42 దాకా నాటకాలు రాసేడు. The Faithful Shepherdess, The Loyal Subject, The Tamer Tamed (An answer to Shakespeare’s Taming of the Shrew) అతనికి అమిత మైన కీర్తి తెచ్చిన నాటకాలు. ]
.
ఇక ఏడుపులూ, మూలుగులూ, నిట్టూర్పులూ వద్దు,
దుఃఖించడంవల్ల పోయిన కాలం మరలి రాదు
అందమైన పూలని ఒకసారి త్రుంచిన తర్వాత
అమృతధారలుకూడా వాటికి నవ్యత ప్రసాదించలేవు,
తిరిగిపుష్పింపజెయ్యనూలేవు.
నీ ముంగురులు సవరించుకో; ముఖంలో చిరునవ్వు రానీ!
విధి నర్మగర్భమైన చేతలు కంటికి అగుపించేవికావు.
సుఖాలు రెక్కలొచ్చిన కలల్లా రివ్వున ఎగిరిపోతాయి,
ఇక దుఃఖము మాత్రం ఎందుకు శాశ్వతంగా ఉండిపోతుంది?
వేదన … ఆపదలో వచ్చిన ఒక గాయం, అంతే!
ఓ సొగసరి చిన్నదానా! చాలు! ఇక శోకించకు.
.
జాన్ ఫ్లెచర్.
.
వ్యాఖ్యానించండి