వర్డ్స్ వర్త్ అతన్ని తీసిపారేసినా, అతని Endymionకి వచ్చిన కువిమర్శకి తట్టుకోలేక Here lies one whose name is writ in water అన్న మాటలు పేరులేని తన స్మృతిఫలకం మీద రాయమని చెప్పినా, తర్వాతితరం కవులు, ముఖ్యంగా లే హంట్ (Leigh Hunt), మాత్యూ ఆర్నాల్డ్ (Mathew Arnold) వంటి వాళ్ళు అతని కవిత్వ ప్రతిభ గుర్తించడమే గాక, రెండు దశాబ్దాలు తిరగకముందే, రొమాంటిక్ మూవ్ మెంట్ కి ఆద్యులుగా పేరువహించిన వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్ ల కంటె ఎక్కువ పేరుప్రతిష్టలతో పాటు, కొన్ని వేలమంది అనుయాయుల్ని సంపాదించుకోగలిగేడు కీట్స్. ప్రకృతి వర్ణనలో అతను మిగతాకవులలో తలమానికంగా నిలిచేడు. షెల్లీ తన Adonais కవితతో అతన్ని అమరుణ్ణిచేశాడు.
ప్రకృతికి పులకరించిపోయే కీట్స్ తన వైయక్తిక అనుభవాలనుండి సార్వజనీనకమైన అనుభూతిని రాయడంలో దిట్ట. బహుశా అది గ్రీకు సంప్రదాయం నుండితీసుకుని ఉండవచ్చు. అతనికి కవిత్వమూ, అందమూ, జీవితమూ వేరు కావు. అతని జీవితములో కళా కవిత్వమూ పెనవేసుకుపోయాయి. అతనికి సత్య, శివ, సుందరాల మధ్య అబేధం కనిపించింది. అతని ఇంద్రియాలకి ప్రకృతిలోని అన్ని వస్తువులలో సౌందర్యాన్నిదర్శించగల ఒక అతీత శక్తి ఉందనిపిస్తుంది. “ఈ ధరణి కవిత్వసరణి ఎన్నడూ ముగియదు (The poetry of the world is never dead)” అన్న ఈ కవితలో, తన అనుభవంలోనుండి ఒక అందమైన చిత్రీకరణ చేశాడు. అతని దృష్టిలో కవిత్వం అంటే ప్రకృతి సౌందర్యానికి కవిమనసులో కలిగే ప్రతిస్పందన. సౌందర్యము మూర్తీభవించిన ఈ ప్రకృతి శాశ్వతమైనది గనుక, కవిత్వం కూడా ప్రకృతి ఉన్నంతకాలం శాశ్వతమని అతని సూత్రీకరణ.
.
ఈ ధరణి కవిత్వ సరణి ఎన్నడూ ముగియదు
వేసవి వేడిమికి వడదెబ్బ తిన్న పక్షులు చెట్టు నీడన దాగి
సేదదీరుతుంటే, ఒక గొంతు కంచె నుండి కంచె దాటుతూనూ
అప్పుడే కోసిన పచ్చికమైదానాలనుండీ వినిపిస్తుంది.
ఆ గొంతు ఒక మిడతది… వేసవి వైభవానికి పులకించి
ఇంతకుముందెన్నడూ ఎరుగని ఉత్సాహంతో వేసే ఉరకలవి.
అది తన త్రుళ్ళింతలకు అలసిపోయినపుడు
ఏ రమ్యమైన కలుపుమొక్క నీడనో విశ్రాంతి తీసుకుంటుంది.
ఈ ధరణి కవిత్వ సరణికెన్నడూ ముగింపు ఉండదు;
ఒక ఏకాంత శీతకాలపు సాయంత్రాన, బయట
గడ్డకట్టించే చలి నిశ్శబ్దాన్ని ఏలుతున్నప్పుడు
లోపల వేడిమితో పెరిగే మూడరుపుల కీచురాయి సంగీతం
సగం నిద్రలో జోగుతున్న వ్యక్తికి, అది ఎక్కడో
గరికనిండిన కొండలలోంచివచ్చే మిడత గొంతులా వినిపిస్తుంది
.
(గమనిక: శీతకాలం లో పాశ్చాత్యులు Room heaters వాడతారు. కనుక బయటనున్న చలి కీచురాయిని లోపలికి తరిమితే, గదిలోని వెచ్చదనం దానికి ఉత్సాహం కలిగించింది.
మలేసియా విజ్ఞాన సర్వస్వము ప్రకారం, చాలా దేశాల్లో మిడతలకీ, కీచురాళ్ళకీ అవి చేసే పంటనష్టానికి భయపడితే, మలేసియాలో మాత్రం అవిచేసే అనుకరణకీ సంగీతానికి పేరుపడ్డాయిట.)
.


వ్యాఖ్యానించండి