అది నీకు తెలిసినదే! నేను పూర్ణచంద్రుణ్ణి చూసినా శిశిరఋతు ఆగమనంలో నా గది కిటికీ నానుకున్న అరుణతీవెను చూసినా, చలికాగుతున్నప్పుడు స్పర్శకందని నివురును తాకినా, వంకరలుపోయిన కట్టెని ముట్టుకున్నా ఆలోచనలన్నీ నీవైపే లాక్కెళుతుంటాయి, అక్కడికి సృష్టిలోని సుగంధాలూ, వెలివెలుగులూ, లోహాలూ నీ ద్వీపాలకి పయనమయే చిరు పడవలై, నాకోసమే నిరీక్షిస్తున్నట్టు
సరే, ఇప్పుడు నువ్వు నెమ్మది నెమ్మదిగా నన్ను ప్రేమించడం మానేస్తే, నేనుకూడా నిన్ను నెమ్మది నమ్మదిగా ప్రేమించడం మానేస్తాను.
అకస్మాత్తుగా నువ్వు నన్ను మరిచిపోతే, నా కోసం వెదకకు… అప్పటికే నిన్ను నేను మరిచిపోయి ఉంటాను.
నా జీవితంలో రెపరెపలాడుతున్న తెరచాపల వాలు చూసి, ఇప్పటికే సమయం మించిపోయిందనీ, ఇంకాఉండడం వెర్రికింద జమ అనీ వేళ్ళూనుకున్న నా హృదయతీరంలోనే నన్ను విడిచివెళ్ళడానికి నువ్వు నిశ్చయించుకుంటే, ఆ రోజే, ఆ క్షణమే, నేను చేతులెత్తెస్తాను, నావేళ్ళు మరోనేలను వెతుక్కుందికి ప్రయాణమౌతై.
కాని, ప్రతిరోజూ, అనుక్షణమూ, తనివితీరని కోరికతో నువ్వునాకోసమే పుట్టావన్న భావనలో ఉంటే, ప్రతిరోజూ నన్నువెతుక్కుంటూ ఒక పువ్వు నీ పెదాలనధిరోహిస్తుంటే, ప్రియా, నా స్వీయా, నాలో ఆ అగ్ని తిరిగి రగుల్కొంటుంది, నాలో ఏదీ ఆరలేదు, మరువలేదు, నాప్రేమ నీ ప్రేమాశనంతో జీవిస్తూ, ప్రియా, నీ జీవితకాలం నీ కౌగిలిలోనే ఒదుగుతుంది, నను విడవకుండా.
వ్యాఖ్యానించండి