దేశ సంచారి … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి
ఓడలు రేవులో లంగరేసి ఉన్నాయి.
సీగల్స్ వాటి స్థంబాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.
నా ఆత్మ వాటిలాగే అశాంతిగా ఎద్రుచూస్తోంది
ఎప్పుడెప్పుడు నక్షత్రసీమల్ని చేరుకుంటానా అని.
.
నాకు దేశాలు తిరగాలంటే ఎంత సరదానో!
సముద్రమన్నా, నీలాకాశమన్నా చెప్పలేనంత ఇష్టం.
కానీ, ఒక చిన్న సమాధిలో ఇలా కదలకుండా పడుక్కోడం
ఎంత దయనీయమైన పరిస్థితి?
.
జో ఏకిన్స్
(30 October 1886 – 29 October 1958)
అమెరికను కవయిత్రి.
ఏ కవితకైనా మొదటి పాదాలూ, చివరి పాదాలూ చాలా ప్రాణం. సమర్థుడైన కవులు వీటిని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఎందుకంటే, మొదటి పాదాలు కవితని చివరిదాకా చదవడానికి కుతూహలపరిస్తే, చివరి పాదాలు, కవిత పూర్తయిన కొంతసేపటి వరకూ పాఠకుడిని వెన్నాడుతాయి. ఈ కవితలో, ఆశకీ, నిరాశకీ మధ్య ఉన్న సంఘర్షణ చివరి వరకూ, ఊహించలేనంత చక్కగా నడిపింది కవయిత్రి. చివరి పదాలు చదివేక జీవితం యొక్క అర్థం బోధపడుతుంది. జీవించడంలోని అదృష్టం కూడా బోధపడుతుంది. ఇందులో బలమైన ప్రతీక, రేవులో లంగరు వేసి ఉన్న ఓడలు. వాటిని సమాధిలోని శవంతో పోలుస్తోంది కవయిత్రి. ఓడలు ఉండవలసింది రేవులో కాదు… సముద్రం మీద; మనిషి ఉండవలసింది సమాధుల్లో కాదు… విశాల విశ్వంలో. ఎంత చక్కని భావవ్యక్తీకరణ. ఎంత రమణీయమైన సందేశం. మనం ప్రాణంతో ఉంటున్నందుకు నిజంగా చాలా సంతోషించాలి.
.
