ఇంద్రజాలం… జెస్సిక హాగ్ దోర్న్

.
నాకుతెలిసిన కొందరున్నారు,
వాళ్ళు అందంగా ఉండడమే వాళ్ళ నేరం.
వాళ్ళంటే నీకు ఎంత మోహం,
వివశత్వం కలుగుతుందంటే,
వాళ్ళకు దాసోహమనాలో,
ఇంకేమైనా చేసెయ్యాలో నీకు తెలీదు.
రెండవది నీ ఒంటికి మంచిది కాదు,
అది శాశ్వత మతిభ్రమణకు దారితీస్తుంది.
కనుక అటువంటి పరిస్థితులురాకుండా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
.
చీకటినుండి దూరంగా ఉండు.
వాళ్ళు గదిలో ఏ మూలనో నక్కి,
మనని ఎవరూ గమనించరులే అని దాక్కుని ఉండొచ్చు.
కాని వాళ్ళ అందమైన వెలుగే వాళ్ళని పట్టి ఇచ్చెస్తుంది.
.
పగటి నుండి దూరంగా ఉండు.
వాళ్ళు బహుశా నువ్వు ఊహించని క్షణంలో
వీధంట చాలా సీదాసాదాగా నడుస్తూ కనిపిస్తూనే
నీ హృదయాన్ని కొల్లగొట్టి,
నువ్వు ఇతర అవకాశాలకోసం కలవరించేలా చేస్తారు.
.
నిన్ను వెర్రెక్కించే సంగీతం నుండి దూరంగా ఉండు.
వాళ్ళు బహుశా దాన్ని సృష్టిస్తూ ఉండొచ్చు.
అంత అందంగా ఉన్నవాళ్ళు అలాంటి సంగీతం సృష్టించకుండా ఉండలేరు.
అది ఎంత ప్రమాదకరంగా పరిణమించవచ్చో అందరికీ తెలుసు.
.
గారడీలనుండి దూరంగా ఉండు…
ముఖ్యంగా మాటల గారడీలు.
మాటలు చాలా గమ్మత్తైనవి .
అవి సహజ భ్రాంతికారక వస్తువులని అందరికీ తెలుసు.
బహుశా వాళ్ళు అవే అంటున్నారేమో!
వాళ్ళు ఎంత లయబద్ధంగా కవితలల్లుతారంటే
నువ్వు వాటికి నృత్యంచెయ్యకుండా ఉండలేవు.
ఒక సారి మాటలకి నృత్యం చెయ్యడంప్రారంభిస్తే,
దాన్ని నువ్వు ఆపలేవు కూడా.
.
