Charlie Chaplin’s Speech in The Great Dictator
watch the speech here: Charlie Chaplin’s Memorable Speech
నా బ్లాగు మిత్రులకీ సందర్శకులకీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
————————————————————————-
ఈ శుభ సందర్భం లో 1940 ల నాటి ఒక అద్భుతమైన చిత్రంలో మహానటుడు చార్లీ చాప్లిన్ ఇచ్చిన ఉపన్యాసం అనువాదంగా సమర్పిస్తున్నాను.
ఇది 70 సంవత్సరాలు గతించినా ఇప్పటికీ ఒక్క అక్షరం పొల్లుపోకుండా అన్వయిస్తుందంటే, ఒక పక్క రచయిత సునిశితమైన పరిశీలనాశక్తికీ, పదౌచిత్యానికీ సంతోషిస్తూనే, పుడుతూనే స్వతంత్రవాయువులు పీల్చుకున్న నాతరం ఇటువంటి దౌర్భాగ్యస్థితులు రాకుండా ఉండేందుకు సరియైన ప్రయత్నాలు చెయ్యలేదే అని వేరొకపక్క సిగ్గుపడుతున్నాను.
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని ప్రజాక్షేమానికీ, తమ విధేయతని రాజ్యాంగానికీ కాకుండా, అధికారయంత్రాంగం రాజకీయనాయకులకు బానిసత్వాన్ని ప్రకటించుకుని, వారితో భాగస్వాములై, ప్రజాసంస్థల్నీ, ప్రజాధనాన్నీ నిర్లజ్జగానూ, నిస్సిగ్గుగానూ దోచుకుంటూ, రెండు వ్యవస్థలూ ప్రజలదృష్టిని ప్రధానసమస్యలనుండి చిల్లరమల్లర విషయాలమీదకి మరలించి పబ్బం గడుపుకుంటుంటే; విద్యార్థులూ, మేధావులూ రకరకాల ఇజాల వాదనల్లో ములిగి, నిజజీవితంలో చెదురుమదురుగా కనిపించే నిజాయితీపరులూ, సాహసాన్ని ప్రదర్శించిన వాళ్ళూ, విలువల్ని పాటించినవాళ్ళూ, ఎన్ని అవాంతరాలొచ్చినా ధైర్యంగాఎదుర్కొని నిలిచినవాళ్ళూ తమ మార్గదర్శులుగా గాక, వెండితెరమీద వెర్రివేషాలువేసేవాళ్ళే ఆరాధ్యదైవాలుగా, అనుకరించవలసిన నమూనాలుగా చేసుకుంటున్నప్పుడు, ప్రజాస్వామ్యానికి ఎటువంటి దుర్దశ పడుతుందో నేటి భారతీయ సాంఘిక సామాజిక ఆర్థిక చిత్రమే అచ్చమైన నమూనాగా అద్దం పడుతుంది.
అయినా నిరుత్సాహపడనక్కరలేదు. మనం ఒక్కసారి కన్నుతెరిచి, సత్యాన్ని గ్రహించి, కర్తవ్యాన్ని గుర్తించి, మన మతవిశ్వాసాలు మనల్నివిడదియ్యడానికికాక, బాధ్యతగలపౌరులుగా, ఒక అపూర్వమైన నాగరికతకి వారసులుగా, భవిష్యత్తును శాసించగల అవకాసాన్ని గుర్తించిన క్రియాశీలురుగా ఎరిగి, మనసా వాచా కర్మణా ఆచరణలో చూపించగల సమర్థులమైనపుడు, మనమే మనకు కావలసిన రీతిలో మనకు ఆమోదయోగ్యమైన పరిపాలన పాలకులచేత రాబట్టుకోగలము.
అటువంటి యువతరానికోసమే ఈ అనువాదం:
****
