అనువాదలహరి

కవికి మరణమే జీవితం -4… ఖలీల్ జిబ్రాన్, పాలస్తీనా కవి

చీకటి తన రెక్క్లమధ్య పొదువుకున్న ఆ నగరం మీద ప్రకృతి స్వచ్ఛమైన తెల్లని మంచువస్త్రాన్ని కప్పింది; ఉత్తరపుగాలి తోటలని నష్టపెట్టే మార్గంకోసం అన్వేషిస్తుంటే, వెచ్చదనం కోసం ప్రజలందరూ విధుల్ని ఖాళీ చేసి ఇంటిముఖం పట్టేరు. ఆ నగర శివారులో ఎప్పుడు పడిపోతుందో అన్నట్టుగా దట్టంగా మంచుపేరుకున్న ఒక పూరిగుడిసె ఉంది. చీకటిముసిరిన ఆ పూరిపాకలో, ఒక కుక్కిమంచం మీద పడుకున్న మృత్యుముఖంలో ఉన్న యువకుడొకడు గాలికి అల్లల్లాడుతూ కొడిగట్టడానికి సిద్ధంగా ఉన్న నూనెదీపాన్ని చూస్తున్నాడు. యవ్వన ప్రాయంలో ఉన్న ఆ యువకుడు, జీవితపు చెఱనుండి తనని విడిపించగల ప్రశాంత మృత్యుఘడియలు గ్వరగా సమీపిస్తున్నాయని అతను ముందుగానే గ్రహించాడు. మృత్యువురాకకై కృతజ్ఞతతో ఎదురుచూస్తున్న కళావిహీనమైన అతని ముఖం మీద ఆశ, అతని పెదాలపై నిర్వేదమైన చిరునవ్వూ, కళ్ళలో క్షమ పొడచూపుతున్నాయి.

సంపదతో తులతూగుతున్న భాగ్యవంతుల నగరంలో తిండిలేక మరణిస్తున్న కవి అతడు. సుందరమూ, భావగర్భితమైన తన కవితలద్వారా ఈ లౌకిక ప్రపంచంలోని మనుషుల మనసు ఉత్తేజపరచడానికి పుట్టేడతను. మనుషుల మనసులకి ఊరటకలిగించి వాళ్ళని సాధుచిత్తులుగా చెయ్యడానికి చదువులతల్లి పంపిన ఉదాత్త జీవి అతను. కానీ, పాపం, ఈ చిత్రమైన లోకవాసులనుండి కనీసం చిరునవ్వైనా ఎరగకుండా శలవుతీసుకుంటున్నాడు.

అతని చివరి ఘడియలు సమీపించాయి. అతని మృత్యుశయ్య ప్రక్కన అతని ఒకే ఒక తోడు నూనెదీపమూ, అతను తన మనోభావాలను రాసిన కాగితాలూ తప్ప వేరెవ్వరూ లేరు. క్షణక్షణం బలహీనమవుతున్న శరీరంలో చివరికి మిగిలిన శక్తినంతా కూడదీసుకుని అతను తన రెండుచేతులనూ జోడించి ఆకాశం వంకచూశాడు; చూరునీ, మేఘాలతెరలనీ తనచూపులు చీల్చుకుని పోవాలని అనుకుంటున్నట్టు ఆశతో, నిరాశతో కళ్ళుకదిలించాడు.

అతనిలా ప్రార్థించాడు: “అందమైన మృత్యుదేవతా! రా! నా ఆత్మ నీకోసం పరితపిస్తోంది. నా సమీపానికి రా! వచ్చి ఈ జీవన శృంఖలాల్ల్ని విడగొట్టు. వాటిని మోసిమోసి అలిసిపోయాను. ప్రియమైన మృత్యువా! దేవభాషను వాళ్లకి వివరించి చెబుతున్నానన్న కారణంచేత నన్ను పరాయిగా చూసిన నా పొరుగువారి నుండి నన్ను రక్షించు. ప్రాశాంతమైన మృత్యువా! ఊఁ త్వరగా రా! వారిలా నా బలహీనతని వెలిగక్కని కారణాన నన్నీ ఉపేక్షా చీకటి మూలల విసిరేసిన అసంఖ్యాకులైన ఈ ప్రజలనుండి నన్ను తీసుకుపో! రా! ఓ సాధు మృత్యువా! నా లేమి సాటిమనుషులను బాధించదు. కనుక నీ తెల్లని రెక్కలమాటున నన్ను పొదువుకో! ప్రేమా, క్షమా మూర్తీభవించిన మృత్యువా! నన్ను తనివిదీరా హత్తుకో! తల్లి ముద్దునీ, చెల్లెలి చెక్కిళ్ళ స్పర్శనీ, ప్రియురాలి మునివేళ్ల పరామర్శనీ ఎరుగని ఈ పెదాలని నీ పెదాలతో స్పృశించు! రా! ప్రియమైన మృత్యువా నన్ను నీతో తీసుకుపో!”

అప్పుడు అతని మరణశయ్యకు సమీపంలో అతిలోక సుందరమై, దివ్యశక్తులుగల ఒక దేవదూత చేతిలో తెల్లకలువదండతో ప్రత్యక్షమయింది. అతని హత్తుకుని, ఆత్మచక్షువులు తప్ప, చూడలేని అతని చర్మచక్షువులను మెల్లగా మూసివేసింది. సంతృప్తి అందీయగల శాశ్వతమైన చిరునవ్వు అతనిపెదాలపై ముద్రించేలా గాఢమూ, సుదీర్ఘమైన ముద్దు ప్రతిష్టించింది. అంతే! కవికుమారుడు వ్రాసిన కాగితాలూ, చర్మపత్రాలూ తప్ప ఆ కుటీరంలో ఏమీ మిగలలేదు.

వందల సంవత్సరాలు దొర్లిపోయాయి. ఆ నగరపౌరులు రోగాలనుండీ, అజ్ఞానమనే నిద్రనుండీ మేలుకుని జ్ఞానోదయాన్ని చవిచూసేరు. ఆ నగరంలోని అతిచక్కని ఉద్యానవనంలో కవికుమారుడికి ఒక స్మారకస్థూపం కట్టించారు. అతని రచనలు తమని విముక్తులనుచేసినందుకు అతని గౌరవార్థం ప్రతి ఏడూ విందు చేసుకునే సంప్రదాయాన్ని నెలకొల్పారు. ఓహ్! మనిషి అజ్ఞానం ఎంత దారుణం!

.

ఖలీల్ జిబ్రాన్

(January 6, 1883 – April 10, 1931)

పాలస్తీనా కవి 

.

.

A Poet’s Death is His Life – IV

The dark wings of night enfolded the city upon which Nature had spread a pure white garment of snow; and men deserted the streets for their houses in search of warmth, while the north wind probed in contemplation of laying waste the gardens. There in the suburb stood an old hut heavily laden with snow and on the verge of falling. In a dark recess of that hovel was a poor bed in which a dying youth was lying, staring at the dim light of his oil lamp, made to flicker by the entering winds. He a man in the spring of life who foresaw fully that the peaceful hour of freeing himself from the clutches of life was fast nearing. He was awaiting Death’s visit gratefully, and upon his pale face appeared the dawn of hope; and on his lops a sorrowful smile; and in his eyes forgiveness.

He was poet perishing from hunger in the city of living rich. He was placed in the earthly world to enliven the heart of man with his beautiful and profound sayings. He as noble soul, sent by the Goddess of Understanding to soothe and make gentle the human spirit. But alas! He gladly bade the cold earth farewell without receiving a smile from its strange occupants.

He was breathing his last and had no one at his bedside save the oil lamp, his only companion, and some parchments upon which he had inscribed his heart’s feeling. As he salvaged the remnants of his withering strength he lifted his hands heavenward; he moved his eyes hopelessly, as if wanting to penetrate the ceiling in order to see the stars from behind the veil clouds.

And he said, “Come, oh beautiful Death; my soul is longing for you. Come close to me and unfasten the irons life, for I am weary of dragging them. Come, oh sweet Death, and deliver me from my neighbors who looked upon me as a stranger because I interpret to them the language of the angels. Hurry, oh peaceful Death, and carry me from these multitudes who left me in the dark corner of oblivion because I do not bleed the weak as they do. Come, oh gentle Death, and enfold me under your white wings, for my fellowmen are not in want of me. Embrace me, oh Death, full of love and mercy; let your lips touch my lips which never tasted a mother’s kiss, not touched a sister’s cheeks, not caresses a sweetheart’s fingertips. Come and take me, by beloved Death.”

Then, at the bedside of the dying poet appeared an angel who possessed a supernatural and divine beauty, holding in her hand a wreath of lilies. She embraced him and closed his eyes so he could see no more, except with the eye of his spirit. She impressed a deep and long and gently withdrawn kiss that left and eternal smile of fulfillment upon his lips. Then the hovel became empty and nothing was lest save parchments and papers which the poet had strewn with bitter futility.

Hundreds of years later, when the people of the city arose from the diseases slumber of ignorance and saw the dawn of knowledge, they erected a monument in the most beautiful garden of the city and celebrated a feast every year in honor of that poet, whose writings had freed them. Oh, how cruel is man’s ignorance!

.

Khalil Gibran

(January 6, 1883 – April 10, 1931)

Palestinian Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/khalil_gibran/poems/2372

అటువంటి దేశాన్ని చూసి జాలిపడు… ఖలీల్ జిబ్రాన్, లెబనీస్ అమెరికన్ కవి

(మహాకవులు ఎప్పుడూ దార్శనికులే.

వాళ్ళ కృతులు పరిమితం కావచ్చునేమో గాని వాళ్ళ పలుకుల విస్తృతి అపరిమితం.

అవి దేశకాల అవధుల్ని అవలీలగా జయించి వాటిలోని సత్యాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాయి.

ఈ కవితలోని ప్రతి పాదములో చెప్పిన భావానికీ (లేదా వేదనకీ), నేడు మనదేశ వ్యవస్థలో పొల్లుపోకుండా ఉదాహరణలు కనిపిస్తాయి. 

అంతకంటే గొప్పనిదర్శనం ఏమిటి కావాలి?)

ఏ దేశ ప్రజలకి అఖండమైన విశ్వాసాలుండి, ఆచరణలో అవి మృగ్యమో;

ఏ దేశం అక్కడ నేయని బట్టని తొడుక్కుని,

అక్కడపండని పంటని తిని,

అక్కడ తయారు కాబడని సారాయి తాగుతుందో;

ఏ దేశంలో గూండాలని నాయకులుగా కీర్తించి,

దోచుకున్న వాడిని దాతగా సమ్మానిస్తారో;

ఏ దేశంలో ప్రజలు తాము కలలో కూడా అసహ్యించుకునే బలహీనతకి

మెలకువగా ఉన్నప్పుడు వెంపర్లాడతారో;

ఏ దేశంలో ప్రజలు శవయాత్రలో పాల్గొన్నప్పుడు తప్ప

మరెన్నడూ  నోరు మెదపరో;

శిధిలాలలో తప్ప గర్వంగా చెప్పుకుందికి ఏమీ ఉండదో;

వధ్యశిలకీ, కత్తికీ నడుమ తల ఉంచేదాకా

ఏ దేశ ప్రజలు దేనికీ ఎదిరించి పోరాడరో;

ఏ దేశనాయకుడు జిత్తులమారి అయి,

అక్కడి జ్ఞానులు గారడీవాని స్థితికి దిగజారి

అనుకరణలూ, తాత్కాలికచర్యలూ తప్ప మరేమీ చెయ్యలేరో;

ఏ దేశంలో కొత్త నాయకుడిని మంగళ వాయిద్యాలతో ఆహ్వానించి

పాతనాయకుడిని ఛీత్కారాలతో సాగనంపి

మళ్ళీ అతన్నే మరోసారి మంగళవాయిద్యాలతో స్వాగతిస్తారో;

ఏ దేశపు మేధావులు వయసుతోపాటు నిర్వీర్యులై,

ఆ దేశపు సాహసవంతులంతా ఇంకా ఉయ్యాలలోనే ఉంటారో;

ఏ దేశం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి

ప్రతి చిన్నముక్కా తననోదేశంగా భావించుకుంటుందో;

అటువంటి దేశాన్ని చూసి జాలిపడు. 

.

ఖలీల్ జిబ్రాన్

6 జనవరి 1883-  10 ఏప్రిల్  1931

లెబనీస్ అమెరికను కవి

.

.

Pity The Nation

.

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave,

eats a bread it does not harvest,

and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,

and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,

yet submits in its awakening.

Pity the nation that raises not its voice

save when it walks in a funeral,

boasts not except among its ruins,

and will rebel not save when its neck is laid

between the sword and the block.

Pity the nation whose statesman is a fox,

whose philosopher is a juggler,

and whose art is the art of patching and mimicking.

Pity the nation that welcomes its new ruler with trumpeting,

and farewells him with hooting,

only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years

and whose strong men are yet in the cradle.

Pity the nation divided into fragments,

each fragment deeming itself a nation.

.

Khalil Gibran

January 6, 1883 – April 10, 1931

Lebanese – American Poet, artist, writer.

కవి… ఖలీల్ జీబ్రాన్, లెబనీస్ – అమెరికన్ కవి

అతను ఈ ఇహపరాలకి వారధి.

అతను,

దప్పిగొన్న ప్రతి ఆత్మా సేవించగల స్వచ్ఛమైన నీటిబుగ్గ.
.

అతను…

ఆకొన్న హృదయాలు అభిలషించే ఫలాలనందించే,

సౌందర్యనదీజలాల తడిసిన పండ్లచెట్టు ;

తన గానామృతంతో

ఆర్తహృదయాలను అనునయించగల కోయిల;

దిగంతాలలో మెరిసి, వ్యాపిస్తూ,

పూర్ణాకాశాన్ని ఆవరించగల తెలివెండి మొయిలు;

జీవన కేదారాలలో కురిసి ప్రవహించి,

వెలుగు వెల్లువను స్వీకరించగల

పద్మదళాలను వికసింపజేయగల నిపుణుడు;

భగవంతుని దివ్యవాణిని వినిపించడానికి

భగవతి ఎంపికచేసిన దేవదూత;

ప్రేమైకమూర్తి తనుగా చమురుపోసి,

స్వరసరస్వతి వెలిగించిన,

పెనుగాలులార్పలేని, చీకటులు కబళించలేని

దివ్య దీధితులు విరజిమ్ము దీపకళిక;

 .

అతను…

వాత్సల్య, నిరాడంబరతలు మూర్తీభవించిన ఏకైక మూర్తి;

స్ఫూర్తి కొరకు ప్రకృతి ఒడిలో కూర్చుని,

నిశానిబద్ధ ప్రశాంతతలో ఆత్మ సంలీననానికి ఎదురుచూచే నిశా తపస్వి;

అనురాగ క్షేత్రాల్లో తన హ్రదయ బీజాల్ని నాటే కృషీవలుడు.

మానవాళి తన పుష్టికి ఆ పంటను కోసుకుంటుంది.

 .

ఈ కవి…

తన జీవితాంతమూ జనులచే ఉపేక్షించబడి,

భువికి వీడ్కోలు పలికి, నందనోద్యానపు పొదరిండ్లలో

నిజావాసానికి చేరిన పిమ్మటే గుర్తింపుకి నోచుకుంటాడు;

ఈ కవి…

ప్రజలనుండి ఒక్క చిరునవ్వు తప్ప వేరు ఆశించడు;

ఈ కవి…

స్వర్గారోహణ చేస్తూ, గగనతలాన్ని తన సూక్తులతో నింపుతాడు.

అయినా అతని రోచిస్సులను ప్రజలనుభవించలేరు.

ఎంతకాలమని మనుషులు  నిద్రలో ఉండగలరు?

సమయానుకూలతవల్ల గొప్పదనాన్ని పొందినవారిని

ఎంతకాలమని కీర్తిస్తూ గడపగలరు?

తమ ఆత్మసౌందర్యాన్ని తమకి ఎత్తిచూపి,

శాంతికీ, ప్రేమకీ ప్రతీకలుగా నిల్చిన వారిని

ప్రజలెంతకాలం ఉపేక్షిస్తూ ఉండగలరు?

చుట్టుముట్టిన కష్టాలలో జీవితాలు గడుపుతూనే

అవివేకుల మార్గాలను వెలిగించి

వారిని జ్ఞానమార్గంవైపు మళ్ళించడానికి

కొవ్వొత్తుల్లా కాలే సమకాలీకులను విస్మరించి

ఎంతకాలమని మృతులనే గౌరవిస్తూ పోగలరు?

.

ఓ కవీ! ఈ జీవితానికి జీవానివి నువ్వు.

కర్కశమైన కాలాన్నికూడ జయించినవాడవు నువ్వు

ఓ కవీ! ప్రజల హృదయాలను నువ్వు చూరగొనే రోజు వస్తుంది

కనుక, నీ పరిపాలనకి భరతవాక్యం ఉండదు.

ఓ కవీ! ఒకసారి నీ ముళ్ళకిరీటాన్ని పరిశీలించిచూడు,

అందులో దాగుని, మొగ్గతొడుగుతున్న కీర్తిలతని గమనించగలవు.

.

 ఖలీల్ జీబ్రాన్

(January 6, 1883 – April 10, 1931)

లెబనీస్ – అమెరికన్ కవి

.

Khalil Gibran (April 1913)
Khalil Gibran
Photo Courtesy: Wikipedia

.

The Poet

.

He is a link between this and the coming world.

He is

A pure spring from which all thirsty souls may drink.

.

He is a tree watered by the River of Beauty, bearing

Fruit which the hungry heart craves;

He is a nightingale, soothing the depressed

Spirit with his beautiful melodies;

He is a white cloud appearing over the horizon,

Ascending and growing until it fills the face of the sky.

Then it falls on the flows in the field of Life,

Opening their petals to admit the light.

He is an angel, send by the goddess to

Preach the Deity’s gospel;

He is a brilliant lamp, unconquered by darkness

And inextinguishable by the wind. It is filled with

Oil by Istar of Love, and lighted by Apollon of Music.

.

He is a solitary figure, robed in simplicity and

Kindness; He sits upon the lap of Nature to draw his

Inspiration, and stays up in the silence of the night,

Awaiting the descending of the spirit.

He is a sower who sows the seeds of his heart in the

Prairies of affection, and humanity reaps the

Harvest for her nourishment.

This is the poet—whom the people ignore in this life,

And who is recognized only when he bids the earthly

World farewell and returns to his arbor in heaven.

This is the poet—who asks naught of

Humanity but a smile.

This is the poet—whose spirit ascends and

Fills the firmament with beautiful sayings;

Yet the people deny themselves his radiance.

Until when shall the people remain asleep?

Until when shall they continue to glorify those

Who attain greatness by moments of advantage?

How long shall they ignore those who enable

Them to see the beauty of their spirit,

Symbol of peace and love?

Until when shall human beings honor the dead

And forget the living, who spend their lives

Encircled in misery, and who consume themselves

Like burning candles to illuminate the way

For the ignorant and lead them into the path of light?

Poet, you are the life of this life, and you have

Triumphed over the ages of despite their severity.

Poet, you will one day rule the hearts, and

Therefore, your kingdom has no ending.

Poet, examine your crown of thorns; you will

Find concealed in it a budding wreath of laurel.

.

Khalil Gibran

(January 6, 1883 – April 10, 1931)

Lebanese-American Artist, Poet, and Writer

Poem Courtesy: http://4umi.com/gibran/smile/8

పిల్లలు … ఖలీల్ జీబ్రాన్

http://images.travelpod.com/users/greekcypriot/3.1251656377.children-playing-with-the-sand.jpg
Image Courtesy: http://images.travelpod.com/

.

 బిడ్డను తన గుండెకు హత్తుకున్న ఒకామె అడిగింది, ‘”పిల్లల గూర్చి చెప్పండి “

అతను ఇలా అన్నాడు:

‘మీ పిల్లలు’—   ‘మీ’  పిల్లలు కారు

వారు తన కోసం తపించే జీవితం యొక్క కొడుకులూ, కూతుళ్ళూ.

.

వాళ్ళు మీ ‘లోంచి’ వస్తారు కానీ,  మీ ‘వలన’ రారు,

వాళ్ళు మీతో ఉన్నప్పటికీ, మీకు చెందరు.

వాళ్లకు మీరు మీ ప్రేమనివ్వగలరేమో గాని, మీ ఆలోచనలివ్వలేరు

ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి.

వాళ్ళ శరీరాలను మీరు గర్భంలో దాల్చగలరు గాని వాళ్ళ ఆత్మలను కాదు

ఎందుకంటే, వాళ్ళ ఆత్మలు  రేపటి గృహంలో నివసిస్తాయి,

వాటిని మీరు మీ కలలో కూడా దర్శించలేరు.

మీరు వాళ్లలా ఉండడానికి ప్రయత్నించవచ్చు గాని,

వాళ్ళని మీలా తయారు చెయ్యడానికి ప్రయత్నించకండి.

ఎందుకంటే జీవితం వెనక్కి మళ్ళదు… నిన్నటితో ఆగిపోదు!

 మీ పిల్లలనే చైతన్యవంతమైన బాణాలు, మీ వంటి వింటినుండే వదలబడ్డారు

ఆ ధనుర్ధారి అనంతదూరంలో ఉన్న లక్ష్యాన్ని దర్శించగలడు,

అందుకనే ఆ బాణాలు లక్ష్యాన్ని త్వరగా చేరుకునేలా మిమ్మల్ని సారించగలడు

అతని చేతిలో మీరు సంతోషంగా ఒదగండి.

ఎందుకంటే, అతను దూసుకుపోయే బాణాన్ని ఎంత ప్రేమిస్తాడో, 

నిలకడగా ఉండే ధనువును కూడా అంతే ప్రేమిస్తాడు !

.

ఖలీల్ జీబ్రాన్

.

Children

.

And a woman who held a babe against her bosom said, ‘Speak to us of Children.’

And he said:

Your children are not your children.

They are the sons and daughters of Life’s longing for itself.

They come through you but not from you,

And though they are with you, yet they belong not to you.

You may give them your love but not your thoughts.

For they have their own thoughts.

You may house their bodies but not their souls,

For their souls dwell in the house of tomorrow, which you cannot visit, not even in your dreams.

You may strive to be like them, but seek not to make them like you.

For life goes not backward nor tarries with yesterday.

You are the bows from which your children as living arrows are sent forth.

The archer sees the mark upon the path of the infinite, and He bends you with His might that His arrows may go swift and far.

Let your bending in the archer’s hand be for gladness;

For even as he loves the arrow that flies, so He loves also the bow that is stable.

Khalil Gibran

అస్రువూ- చిరునవ్వూ — ఖలీల్ జీబ్రాన్

                                                                  (Photo Courtesy: http://t1.gstatic.com)

.

నా మనసులోని బాధల్ని

జనబాహుళ్యపు ఆనందోత్సాహాలతో వినిమయం చేయ నిచ్చగించను
.

నా మేని అణువణువునుండీ

విషాదం చిందించే కన్నీటిని

చిరునవ్వుగా మరలనీను.

.

నా జీవితం ఒక అస్రువుగానూ, ఒక చిరునవ్వుగానూ మిగిలిపోవాలని కోరుకుంటాను.

.

ఒక కన్నీటి బిందువు…

నా మనసు ప్రక్షాళనం చేసి

జీవిత రహస్యాలూ, గహనమైన విషయాలూ

అవగాహన కలిగించడానికి.

ఒక చిరునవ్వు…

ననుబోలిన సహోదరుల సరసన నను జేర్చి

నా దైవస్తుతికి సంకేతంగా నిలవడానికి.

.

ఒక అస్రువు… గుండెపగిలిన వారితో నేను  మమేకమవడానికి

ఒక చిరునవ్వు… నా ఉనికిలోని సంతోషానికి గుర్తుగా

.

నిరాశతో, అలసి బ్రతికేకంటే…  వాంఛిస్తూ, తపిస్తూ మరణించడమే కోరుకుంటాను.

.

ప్రేమా, సౌందర్యమూ కొరకు నా క్షుధార్తి

నా చైతన్యపు అంతరాంతరాలకు వ్యాపించాలని కోరుకుంటాను….

ఎందుకంటే

వాటిపట్ల సంతృప్తి చెందినవాళ్ళు

అత్యంత దౌర్భాగ్యులుగా మిగిలిపోవడం నే చూసాను.

కాంక్షాపరితప్తులైన వారి నిట్టూర్పులను విన్నాను…

అవి మధురాతిమధురమైన స్వరమేళనం కన్నా తియ్యగా ఉన్నాయి.

.

పొద్దువాలడమే తడవు, పంకజం తన రేకలు ముకుళించుకుని

కాంక్షను హత్తుకుని నిద్రకుపక్రమిస్తుంది.

పొద్దుపొడవడమే తడవు, ప్రభాకరుని

కవోష్ణ చుంబనకై తన పెదవులు విచ్చుతుంది.

ఆ విరి జీవితము … ఒక ఆరాటమూ… ఒక అందుకోలూ

ఒక అస్రువూ— ఒక చిరునగవూ.

.

సముద్రజలాలు ఆవిరులై ఎగసి, కలిసి, మేఘాలై రూపుదిద్దుకుంటై.

మేఘం కొండలమీదా, లోయలమీదా

మంద సమీరాన్ని తాకే వరకూ విహరించి,

భోరున పొలాలపై రోదించి, వాగులూ నదులై ప్రవహించి

తన నెలవైన సాగరాన్ని చేరుకుంటుంది.

.

మేఘాల జీవితం… ఒక విధురము … ఒక కలయిక.

ఒక అస్రువూ— ఒక చిరునగవూ.
.

ఆ తీరునే, ఆత్మ తనకంటే ఉన్నతమైన పరమాత్మనుండి వేరై

ఈ ద్రవ్యప్రపంచంలో చరించి,

పారవశ్యాల మైదానాలమీదా,

విషాద నగాగ్రాలమీదా  మేఘమై సంచరించి,

మృత్యుశీకరములు సోకి,

బయలుదేరిన చోటుకే చేరుకుంటుంది.

సౌందర్యానందసింధువైన … భగవంతుడి దగ్గరకి.

.

A Tear And A Smile

.

I would not exchange the sorrows of my heart
For the joys of the multitude.
And I would not have the tears that sadness makes
To flow from my every part turn into laughter.
.
I would that my life remain a tear and a smile.
.
A tear to purify my heart and give me understanding
Of life’s secrets and hidden things.
A smile to draw me nigh to the sons of my kind and
To be a symbol of my glorification of the gods.
.
A tear to unite me with those of broken heart;
A smile to be a sign of my joy in existence.
.
I would rather that I died in yearning and longing than that I live Weary and despairing.
.
I want the hunger for love and beauty to be in the
Depths of my spirit, for I have seen those who are
Satisfied the most wretched of people.
I have heard the sigh of those in yearning and Longing, and it is sweeter than the sweetest melody.
.
With evening’s coming the flower folds her petals
And sleeps, embracing her longing.
At morning’s approach she opens her lips to meet
The sun’s kiss.
.
The life of a flower is longing and fulfillment.
A tear and a smile.
.
The waters of the sea become vapor and rise and come
Together and area cloud.
.
And the cloud floats above the hills and valleys
Until it meets the gentle breeze, then falls weeping
To the fields and joins with brooks and rivers to Return to the sea, its home.
.
The life of clouds is a parting and a meeting.
A tear and a smile.
.
And so does the spirit become separated from
The greater spirit to move in the world of matter
And pass as a cloud over the mountain of sorrow
And the plains of joy to meet the breeze of death
And return whence it came.
.
To the ocean of Love and Beauty—-to God

.

(From English Original:  A Tear  And A Smile: Khalil Gibran)

%d bloggers like this: