అనువాదలహరి

చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి…అజ్ఞాత చీనీ కవి.

చాలా కాలం క్రిందట ఒక కథ చదివేను. పేరు గుర్తు రావటం లేదు. అందులో కథానాయకుడికి ఒక అమ్మాయిమీద మనసుంటుంది. దగ్గర చుట్టం కూడా. అమ్మాయి వాళ్ల దగ్గరనుండి సంబంధం కలుపుకుందామని కబుర్లు వస్తుంటాయి. ఇష్టం లేనపుడు ‘నాకప్పుడే పెళ్లి వొద్దు అనడం ఒక ఆనవాయితీ’. అబ్బాయి వాళ్లింట్లో తల్లీ, వదినా, అన్నా ఒక్కొక్కరే కథానాయకుడి అభిప్రాయం కనుక్కుందికి ప్రయత్నిస్తారు వేర్వేరు సందర్భాలలో. సిగ్గుకొద్దీ ‘నాకప్పుడే పెళ్లి వొద్దు’ అని అనేవాడు వాళ్లతో. దానితో, చివరకి మన కథానాయకుడుకి ఆ అమ్మాయి అంటే ఇష్టంలేదేమోననుకుని విరమించుకుంటారు. చివరకి,  వాళ్ళెప్పుడు ఈ ప్రస్తావన తీసుకువస్తారా, ఒప్పుకుందామా అని అతను చూస్తుంటాడు.

దీనికే, ‘ఇష్టం ఉన్నా బెట్టు పోవడం’ అంటాం. దీన్నే జూలియస్ సీజర్ లో,  షేక్స్పియర్ Casca పాత్రద్వారా చాలా చక్కగా చెప్పిస్తాడు. Antony సీజర్ కి కిరీటాన్ని పెట్టజూసినపుడు he put it by thrice, every time gentler than other మూడూసార్లూ వద్దని నిరాకరించాడట.  కానీ, ‘మొదటిసారి కంటే రెండో సారి, రెండో సారి కంటే మూడవసారీ ఆ వద్దనడంలోని తీవ్రత తగ్గుతూ వచ్చింది’ అని అనిపిస్తాడు. 

ఒకోసారి ఈ బెట్టు పోవడం ఎలా పరిణమిస్తుందంటే, వద్దన్న వస్తువుకోసమే, తర్వాత కావాలని ప్రాకులాడవలసి వస్తుంది. ఈ మనస్తత్వాన్ని ఈ కవిత చాలా చక్కగా పట్టిస్తుంది.

* * *

 

చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి.

పదిలోనూ ఇంకా ఏడు మిగిలున్నాయి.

మీలో ఎవరైనా నన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటే

యువకులూ, ఓ మంచిరోజు చూసుకుని రండి.

చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి.

పదిలోనూ ఇంకా మూడు మిగిలున్నాయి.

మీలో ఎవరైనా నన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటే

యువకులూ, ఇవాళే మంచిరోజు.

చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి.

మీ బుట్టనిండా పళ్ళు నింపుకోవచ్చు.

మీలో ఎవరైనా నన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటే

యువకులూ, ఆ మాట చెప్పండి చాలు!

.

అజ్ఞాత చీనీ కవి

 

.

Fruit Plummets from the Plum Tree

.

Fruit plummets from the plum tree

But seven of ten plums remain;

You gentlemen who would court me,

Come on a lucky day.

Fruit plummets  from the plum tree

But three of ten plums still remain;

You men who want to court me,

Come now, today is a lucky day!

Fruit plummets from the plum tree.

You can fill up your baskets.

Gentlemen if you want to court me,

Just say the word.

.

Anonymous

Translated by: Tony Barnstone and Chou Ping

Poem Courtesy:

https://archive.org/details/worldpoetryantho0000wash/page/66/mode/1up

World Poetry Anthology

Part I: Poets of The Bronze and Iron Ages.

China: The Chou Dynasty and Warring States Period

From  The Book of Songs (800- 500 BCE)

నేను మళ్ళీ ఈ త్రోవలో రాను… అజ్ఞాత కవి

[కాకతాళీయంగా మనకి ఈ మనుజ జన్మ వచ్చిందనీ, మనకున్న జీవితం ఒకటేననీ, మంచి అన్నది ఏది చేద్దామనుకున్నా దాన్ని వాయిదా వెయ్యకుండా ఒంట్లో శక్తీ, మనసులో తలపూ ఉన్నప్పుడే ఆచరించాలనీ సున్నితంగా చెప్పిన కవిత]

ఈ బాధామయ ప్రపంచం లోంచి,

ఒకే ఒక్కసారి నేను నడిచిపోతాను.

ఎవరికయినా మంచి చెయ్యాలన్నా

బాధపడుతున్న ఏ సాటిమానవుడిపట్లనైనా

కరుణ చూపించాలన్నా

నాకు ఒంట్లో శక్తి ఉన్నప్పుడే చెయ్యనీండి.

వాయిదా వెయ్యడానికి లాభం లేదు.

ఎందుకంటే నాకు స్పష్టంగా తెలుసు

ఈ త్రోవలో మళ్ళీ నేను రానని!

.

అజ్ఞాత కవి

I Shall Not Pass This Way Again

.

Through this toilsome world, alas!

Once and only once I pass,

If a kindness I may show,

If a good deed I may do

To a suffering fellow man,

Let me do it while I can.

No delay, for it is plain

I shall not pass this way again.

.

Anonymous

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/i-shall-not-pass-way-again

అది సాధ్యమే… అజ్ఞాత కవి

ఎవడైతే “అది సాధ్యం కాదు” అని అంటాడో

వాడు జీవితంలోని సౌందర్యాన్ని కోల్పోతునట్టే.

అతను గర్వంగా ఒక ప్రక్క నిలబడి

అందరూ చేసే ప్రయత్నాలన్నిటినీ ఆక్షేపిస్తుంటాడు.

వాడికే గనక మానవజాతి చరిత్ర సమస్తాన్నీ

తుడిచిపెట్టే శక్తి ఉండి ఉంటే,

మనకి ఈ నాడు రేడియోలు, మోటారు కార్లు

వీధుల్లో విద్యుద్దీపాల కాంతులూ ఉండేవి కావు;

టెలిఫోన్లూ, తంతివార్తలూ లేక

మన రాతియుగంలో ఉన్నట్టే జీవించే వాళ్లం.

“అది సాధ్యపడదు” అని చెప్పేవాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తే

ప్రపంచం ఎప్పుడో మొద్దునిద్దరలో ఉండేది.

.

అజ్ఞాత కవి

It Can Be Done

.

The Man who misses all the fun,

Is he who says, “It can’t be done”

In solemn pride he stands aloof

And greets each venture with reproof.

Had he the power he’d efface

The history of the human race;

We’d have no radio or motor cars,

No streets lit by electric stars;

No telegraph nor telephone,

We’d linger in the age of stone.

The world would sleep if things were run

By men who say “It can’t be done.”

.

Anonymous.

Poem Courtesy: https://www.poetrynook.com/poem/it-can-be-done  

 

నువ్వు నన్నెప్పుడైనా ప్రేమించదలుచుకుంటే… అజ్ఞాత కవయిత్రి

నువ్వెప్పుడైనా నన్ను ప్రేమించదలుచుకుంటే, అదేదో ఇప్ప్పుడే ప్రేమించు;

నిజమైనప్రేమనుండి వెలువడే తీయని, సున్నితమైన భావనలన్నీ నాకు తెలిసేలా,

నేను బ్రతికున్నప్పుడే నన్ను ప్రేమించు; నేను చనిపోయేదాకా ఎదురుచూడకు,

చల్లని పాలరాతిపలకలమీద రసాత్మకమైన వెచ్చని ప్రేమ కావ్యాలు చెక్కడానికి.

నీకు నా గురించి మధురభావనలుంటే, అవి నా చెవిలో ఎందుకు చెప్పకూడదు?

నీకు తెలీదూ అది నన్ను ఎంత ఆనందంగా ఉండగలనో అంత ఆనందంగా ఉంచుతుందని?

నేను నిద్రించేదాకా నిరీక్షిస్తే, ఇక నేను ఎన్నడూ నిద్రలేవకపోవచ్చు,

మనిద్దరి మధ్యా మట్టిగోడలు లేస్తాయి, అప్పుడు నేను నిన్ను వినలేను.

నీకు ఎవరైనా దాహంతో ఒక చుక్క అమృతంకోసం* అలమటిస్తున్నారని తెలిస్తే

నువ్వు తీసుకురావడానికి ఆలస్యం చేస్తావా? నువ్వు మందగమనంతో వెళతావా?

మనచుట్టూ ప్రేమకోసం తపిస్తున్న ఎన్నో సున్నితమైన హృదయాలున్నాయి;

ప్రకృతిలో అన్నిటికన్నా మిన్నగా వాళ్ళుకోరుకునేది వాళ్ళకి ఎందుకు నిరాకరించడం?

నా మీద గడ్డిమొలిచినపుడు నీ ప్రేమగాని, మృదువైన చేతిస్పర్శగాని అక్కరలేదు

నా కడపటి విశ్రాంతి స్థలంలో నీ ప్రేమకీ, ముద్దుకీ ఎదురుచూడను.

కనుక, నీకు నామీద ఏమైనా ప్రేమ ఉంటే, అది ఇంత పిసరయినా ఫరవాలేదు

నేను బ్రతికుండగానే నాకు తెలియనీ; నేను దాన్ని అందుకుని పదిలంగా దాచుకుంటాను.

.

అజ్ఞాత కవయిత్రి

* అమృతము: నీరు

ఈ కవిత ఖచ్చితంగా ఒక కవయిత్రి మాత్రమే రాయగలదని నా మనసు చెబుతోంది.

.

If You’re Ever Going to Love Me

.

If you’re ever going to love me love me now, while I can know

All the sweet and tender feelings which from real affection flow.

Love me now, while I am living; do not wait till I am gone

And then chisel it in marble — warm love words on ice-cold stone.

If you’ve dear, sweet thoughts about me, why not whisper them to me?

Don’t you know ‘twould make me happy and as glad as glad could be?

If you wait till I am sleeping, ne’er to waken here again,

There’ll be walls of earth between us and I couldn’t hear you then.

If you knew someone was thirsting for a drop of water sweet

Would you be so slow to bring it? Would you step with laggard feet?

There are tender hearts all round us who are thirsting for our love;

Why withhold from them what nature makes them crave all else above?

I won’t need your kind caresses when the grass grows o’er my face;

I won’t crave your love or kisses in my last low resting place.

So, then, if you love me any, if it’s but a little bit,

Let me know it now while living; I can own and treasure it.

.

Anonymous

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/if-youre-ever-going-love-me

సెయింట్ అగస్టీన్ జీవితంలో ఒక రోజు… అజ్ఞాత కవి

సెయింట్ అగస్టీన్ చాలసేపు ఆ పేజీమీద దృష్టిపెట్టాడు,
సందేహాల పరంపర అతని మనసంతా అలముకుంది;
భగవంతుని నిగూఢమైన స్వరూపంలో,
మూడు మూర్తులు కలగలసి ఎలా ఉన్నాయి, అని ఆలోచించాడు.
అతనికి ఆలోచిస్తున్నకొద్దీ అతనికి అసాధ్యంగా కనిపించసాగింది
ఒకదాని తర్వాత ఒకటి ఒరుసుకొస్తున్న సందేహాలు నివృత్తిచెయ్యడం
పెను తుఫానులో చిక్కుకున్న ఓడని
అదృష్టం ఎక్కడకి విసిరెస్తే అక్కడకి చేరినట్టు 
అతని మనసు కకావికలమై, సాంత్వన దొరకక అల్లాడుతోంది.

బుర్రవేడేక్కిపోయి, సంపుటాన్ని మూసి పక్కనబెట్టి
సముద్రపొడ్డుకి కాసేపు మనశ్శాంతికోసం తిరగడానికి వెళ్ళేడు
గుసగుసలాడుతున్న తరగలతో గుసగుసలాడుతూ
మంద్రంగా వీచసాగింది సాయంవేళ చిరుగాలి.
వెడల్పైన ఆ తీరం వెంట సెయింట్ అగస్టీన్
మనసుదొలుస్తున్న సమస్యతో అటూ ఇటూ తిరుగాడుతుంటే
అతని కళ్ళముండు ఒక చిన్న కుర్రాడు కనిపించాడు
పక్కన ఉప్పుటేరు సముద్రంలో కలుస్తున్నచోట
చాల ఏకాగ్రతతో ఏదో పని చేసుకుంటూ…

చక్కగా మెరుస్తున్న ఇసుకలో అట్టే లోతులేని
ఒక చిన్న గొయ్యి ఆ బాలుడు తవ్వడం గమనించాడు.
చాలా మృదువైన గొంతుతో ఆ కుర్రాణ్ణి సంబోధిస్తూ,
“బంగారు తండ్రీ! నువ్వు ఏమిటి చేస్తున్నావు?
ఎందుకు చేస్తున్నావో నాకు అర్థమయేలా చెప్పవా?” అని అడిగేడు.
అప్పుడా కుర్రాడు అన్నాడు, “స్వామీ! చాలా చిన్న పనే,
సముద్రంలో నీరంతా ఈ గొయ్యిలోకి పోయేలా తవ్వుతున్నాను.”

“ఓరి పిచ్చి సన్నాసీ!” సెయింట్ అగస్టీన్ జాలిగా నవ్వేడు,
“ఆ చిన్ని గుంతలో ఈ సముద్రమంతా ఇమడగలదనుకుంటున్నావా?”
“ఓ పిచ్చి సన్యాసీ,” కుర్రాడు బదులు నవ్వేడు, “మీ ప్రయత్నం
నేను పడుతున్న కష్టం కంటే తెలివి తక్కువది కాదూ?!
మీరు భగవంతుని ఆంతర్యాన్నీ, ఆలోచనలనీ
మనిషి మేధ అనే చిన్న పరికరం పరిధిలో కనుక్కోవాలని చూడటం లేదూ?!
ఓ అగస్టీన్ మహామునీ, త్వరలో, అదెంత సుదూర భవిష్యత్తు కానీ,
పరిమితమైన జ్ఞానంతో అపరిమితమైన దైవత్వాన్ని కనుక్కోగలిగే ముందరే
నేను ఈ గుంతలోకి సముద్రాన్ని తప్పకుండా మళ్ళించగలుగుతాను.”
.
అజ్ఞాత కవి

.

A Passage in the Life of Saint Augustine

Long pored Saint Austin o’er the sacred page,

  And doubt and darkness overspread his mind;

On God’s mysterious being thought the Sage,

  The Triple Person in one Godhead joined.

  The more he thought, the harder did he find

To solve the various doubts which fast arose;

  And as a ship, caught by imperious wind,

Tosses where chance its shattered body throws,

So tossed his troubled soul, and nowhere found repose.

Heated and feverish, then he closed his tome,

  And went to wander by the ocean-side,

Where the cool breeze at evening loved to come,

  Murmuring responsive to the murmuring tide;

  And as Augustine o’er its margent wide

Strayed, deeply pondering the puzzling theme,

  A little child before him he espied:

In earnest labor did the urchin seem,

Working with heart intent close by the sounding stream.

He looked, and saw the child a hole had scooped,

  Shallow and narrow in the shining sand,

O’er which at work the laboring infant stooped,

  Still pouring water in with busy hand.

  The saint addressed the child in accents bland:

“Fair boy,” quoth he, “I pray what toil is thine?

  Let me its end and purpose understand.”

The boy replied: “An easy task is mine,

To sweep into this hole all the wide ocean’s brine.”

“O foolish boy!” the saint exclaimed, “to hope

  That the broad ocean in that hole should lie!”

“O foolish saint!” exclaimed the boy; “thy scope

  Is still more hopeless than the toil I ply,

  Who think’st to comprehend God’s nature high

In the small compass of thine human wit!

  Sooner, Augustine, sooner far, shall I

Confine the ocean in this tiny pit,

Than finite minds conceive God’s nature infinite!”

.

Anonymous

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al.

Volume IV. The Higher Life.  1904.

The Divine Element—(God, Christ, the Holy Spirit)

నా భర్తకి… అజ్ఞాత కవయిత్రి

తప్పించుకోలేని ఈ ఐహిక బాధలనుండీ
ఈ జీవితం నుండీ నేను నిష్క్రమించినపుడు
నా కోసం నల్లని దుస్తులు ధరించవద్దు
ప్రియతమా! నువ్వు ఉంగరాన్ని మాత్రం తియ్యకు.

దయచేసి ఆ తళతళల వజ్రాన్ని
నా గుర్తుగా చేతికి ఉంచుకో
అది నీ కళ్ళలో మెరిసినప్పుడు
అది పక్కనుండి నడుస్తున్న నా నీడగా భావించు.

ఎందుకంటే, ఆ వజ్రం కన్నా, ఆ మాటకొస్తే
ఏ రత్నం కన్నాకూడా ప్రకాశవంతంగా నీకు కనిపిస్తాను.
అక్కడ ఏదో జరగకూడనిది జరిగినట్టు
ఇంటిని నల్లని అలంకరణలతో నింపకు.

నా సమయం సమీపించి నేను పోయినపుడు
నీకు దుఃఖించవలసిన పని లేదు
నా స్మృతికి చిహ్నంగా, గుర్తుగా
నా వస్తువు దేనినీ భావించవద్దు.

నేను నా అదృష్టం కొద్దీ శాశ్వతుడైన
భగవంతుని స్వర్గధామం నుండి వచ్చేను
నేను అతని నివాసానికి వారసు రాలిని,
అది అతని వాగ్దానం, దేముడు మాట తప్పడు.

నన్ను నా సోదరుడి సమాధిపక్కనే నిద్రపుచ్చండి
అలా చేస్తానని మీరు మాట ఇచ్చేరు.
ఇక నేను శలవు తీసుకోవలసిన సమయం వచ్చింది
మీ నుండి నేను వీడ్కోలు తీసుకోక తప్పదు.

.

అజ్ఞాత కవయిత్రి

 

To My Husband

 . 

When from the world I shall be ta’en,

And from earth’s necessary pain,       

Then let no blacks be worn for me,    

Not in a ring, my dear, by thee.

 

But this bright diamond let it be

Worn in remembrance of me.   

And when it sparkles in your eye,      

Think ’tis my shadow passeth by.       

 

For why, more bright you shall me see,        

Than that or any gem can be.    

Dress not the house with sable weed,  

As if there were some dismal deed      

 

Acted to be when I am gone,    

There is no cause for me to mourn.    

And let no badge of herald be   

The sign of my antiquity.

 

It was my glory I did spring     

From heaven’s eternal powerful King:

To his bright palace heir am I,  

It is his promise, he’ll not lie.    

 

By my dear brother pray lay me,        

It was a promise made by thee, 

And now I must bid thee adieu,

For I’m a parting now from you.

.

Anonymous

 (1652)

Poem Courtesy:

A Book of Women’s Verse.  1921.

Ed: J. C. Squire. 

http://www.bartleby.com/291/10.html

దైవమే నా వెలుగు … అజ్ఞాత ఇంగ్లీషు కవి

జీవితం మీద భ్రమ తొలగి, మరణ మాసన్నమైన వేళ,

గుండె కొట్టుకోవడం మందగించి కళ్ళు మసకబారుతున్నపుడు

శరీరంలోని ప్రతి అవయవమూ బాధతో అలసిపోయినపుడు

దేవుని ప్రేమించేవాడు అతన్నే నమ్ముకుంటాడు.

జీవితలక్ష్యాలగురించిన ఇచ్ఛ మరుగునపడిపోయి,

మతి స్థిమితం తప్పుతోందన్న అపవాదు పైబడుతున్నపుడు,

తనపేరేమిటో తనకి తెలియనిస్థితిలో మనిషి ఉన్నప్పుడు—

భగవంతుని కరుణే అన్ని లోపాలనీ పూరిస్తుంది.

చివరి శ్వాస వెలువడి, చివరి కన్నీటిచుక్క రాలి

మంచం ప్రక్కనే శవపేటిక ఎదురుచూస్తున్నప్పుడు,

పిల్లలూ, భార్యా కూడా మృతుడి ఉనికే మరిచినపుడు…

దేవదూత అతని తలని ఎత్తి సంబాళిస్తుంది.

అలౌకికమైన ఆనందమైనా విసుగు తెప్పించవచ్చు,

అధికారం అంతరించవచ్చు, గర్వము ఖర్వము కావొచ్చు,

ఆత్మీయులైన స్నేహితుల ప్రేమకూడా పల్చబడవచ్చు,

కానీ, భగవంతుని కృపయే చివరకి మిగిలేది.

.

అజ్ఞాత కవి

ఇంగ్లీషు

19వ శతాబ్ది.

.

Dominus Illuminatio Mea

(Lord Is My Light – Psalm 27)

.

In the hour of death, after this life’s whim,

When the heart beats low, and the eyes grow dim,

And pain has exhausted every limb—

The lover of the Lord shall trust in Him.

When the will has forgotten the lifelong aim,

And the mind can only disgrace its fame,

And a man is uncertain of his own name—

The power of the Lord shall fill this frame.

When the last sigh is heaved, and the last tear shed,

And the coffin is waiting beside the bed,

And the widow and child forsake the dead—

The angel of the Lord shall lift this head.

For even the purest delight may pall,

And power must fail, and the pride must fall,

And the love of the dearest friends grow small—

But the glory of the Lord is all in all.

.

Anonymous Poet

 English

19th Century

The Oxford Book of English Verse: 1250–1900.

Ed: Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/883.html

మూడు బొంతకాకులు … అజ్ఞాత కవి , 17 వ శతాబ్దం

మూడు బొంతకాకులు చెట్టుమీద కూచున్నాయి,
అవి ఎంతనల్లగా ఉండగలవో అంత నల్లగా ఉన్నాయి.

అందులో ఒకటి  మిగతావాటితో అంది:
“మనం ఊదయాన్నే ఫలహారం ఎక్కడ చెయ్యడం?” అని

“అదిగో! దూరాన పచ్చనిపొలాల్లో
ఒక వీరుడు చనిపోయి తన డాలుక్రింద పడి ఉన్నాడు.”

“లాభం లేదు. అతని వేట కుక్కలు పాదాల చెంత ఉన్నాయి.
అవి తమ యజమానిని జాగ్రత్తగా కాపాడతాయి.”

అతని పెంపుడు డేగలు ఆకాశంలో పహారా కాస్తున్నాయి
అతని దగ్గరకి ఏ పక్షీ రానియ్యవు.

కొంతసేపటికి అతని ప్రియురాలు వచ్చింది
వయసులో ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉంది.

అతని రక్తమోడుతున్న తలని పైకి ఎత్తింది.
తడి ఆరని అతని గాయాల్ని ముద్దు పెట్టుకుంది.

అతన్ని తన భుజానికి ఎత్తుకుంది
దగ్గరనే ఉన్న సెలయేటిదగ్గరకి తీసుకెళ్ళింది.

ప్రభాతవేళ కాకుండా అతన్ని ఖననం చేసింది
సంధ్యావందనం వేళకి తనూ ప్రాణం త్యజించింది.

ప్రతి సాధుపురుషుడికీ భగవంతుడు అటువంటి
వేటకుక్కల్నీ, డేగల్నీ, ప్రియురాళ్ళనీ అనుగ్రహించుగాక!
.
అజ్ఞాత కవి
17 వ శతాబ్దం

.

The Three Ravens

.

There were three ravens sat on a tree,

They were as black as they might be.

The one of them said to his make,

‘Where shall we our breakfast take?’

‘Down in yonder greene field

There lies a knight slain under his shield;

‘His hounds they lie down at his feet,

So well they can their master keep;

‘His hawks they flie so eagerly,

There ‘s no fowl dare come him nigh.’

Down there comes a fallow doe

As great with young as she might goe.

She lift up his bloudy head

And kist his wounds that were so red.

She gat him up upon her back

And carried him to earthen lake.

She buried him before the prime,

She was dead herself ere evensong time.

God send every gentleman

Such hounds, such hawks, and such a Leman

 

.

Anonymous

17th Century

 

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900

Ed. Arthur Quiller-Couch.

తబ్బిబ్బైన శతపాది… అజ్ఞాత కవి

ఒక శతపాది ఎంతో హాయిగా ఉండేది

అనుకోకుండా ఒక రోజు ఒక కప్ప నవ్వులాటకి:

“నీకు ఏ కాలు తర్వాత ఏ కాలు పడుతుందో కాస్త చెప్పవా?” అని అడిగేదాకా.

ఆ ప్రశ్న దాని మనసుని ఎంతగా అతలాకుతలం చేసిందంటే

అది తబ్బిబ్బై తన గుంతలో

ఎలా పరిగెత్తాలో ఆలోచిస్తూ ఉండిపోయింది.

.

అజ్ఞాత కవి

ఈ  లిమరిక్కు(కవిత)లో సౌందర్యం ఒక్కోసారి మనం ఎలా Self-conscious అవుతామో తెలియజెయ్యడమే.  మామూలు సమయంలో ఎంత నేర్పుగా, అలవోకగా ఒక పనిచేయ్యగలిగినా, ఎవరైనా గమనిస్తున్నప్పుడు,లేదా  పరీక్షిస్తున్నప్పుడు చాలా మంది దృష్టి చేస్తున్న పనిమీద కాకుండా, గమనిస్తున్నారనుకున్నవాళ్ళమీదకి మరలడంతో తప్పులు చేస్తుంటారు.  అది చాలా సహజం. అంతేకాదు, కొందరిని  అలా మోసగించడానికి కూడా ఈ ఎత్తు వేస్తుంటారు.

.

The Distracted Centipede

.

A centipede was happy quite,

Until a frog in fun

Said, “Pray, which leg comes after which?”

This raised her mind to such a pitch,

She lay distracted in the ditch

Considering how to run.

.

Anonymous

మన వియోగం విలక్షణమైనది … అజ్ఞాత కవి

మిత్రులకీ, బ్లాగు సందర్శకులకీ క్రిస్మస్ శుభాకాంక్షలు

.

మనం ఎడబాసినపుడు అందరిలా ఉండకూడదు…

నిట్టూరుస్తూ, కన్నీరు కారుస్తూ. ఇద్దరం

శరీరాలు వేరయినా, ఒకరికొకరు దూరమయినపుడు

ఒకరి హృదయంలో రెండోవారిని నిలుపుకుంటాం.

ఎవరు వెదకి పట్టుకోగలరు నేను లేకుండా

నువ్వు మాత్రమే ఉండగలిగే జీవిని?     

సిసలైన ప్రేమకి రెక్కలుంటాయి; తలచినంత మాత్రమే

అది ప్రపంచాన్ని చుట్టి రా గలదు  సూర్యచంద్రుల్లా.

ఇతరులు అందరూ ఎడబాటుకి వగచి విలపించే చోట

మన విజయాలు ఎడబాటుని మరపింపజేస్తాయి.

దానివల్లే, స్వర్గంలో ఉన్నవాళ్ళకి మల్లే

ఈ భూమిమీద కూడా బ్రతకడానికి కావలసిన శక్తి వస్తుంది.

.

అజ్ఞాత కవి 

.

We Must Not Part As Others Do

 .

 We must not part, as others do,

With sighs and tears, as we were two,

Though with these outward forms, we part;

We keep each other in our heart.

What search hath found a being, where

I am not, if that thou be there?

True love hath wings, and can as soon

Survey the world, as sun and moon;

And everywhere our triumphs keep

Over absence, which makes others weep:

By which alone a power is given

To live on earth, as they in heaven.

.

Anonymous

Poem Courtesy: The Book of Restoration Verse.  1910. Ed. William Stanley Braithwaite

(The poem is taken by the Editor from the Egerton MS., 2013, printed by Dr. Arber in his English Garner, vol. III. p. 396.)

%d bloggers like this: