అనువాదలహరి

మిడత – కీచురాయి … జాన్ కీట్స్

వర్డ్స్ వర్త్ అతన్ని తీసిపారేసినా, అతని Endymionకి వచ్చిన కువిమర్శకి తట్టుకోలేక Here lies one whose name is writ in water అన్న మాటలు పేరులేని తన స్మృతిఫలకం మీద రాయమని చెప్పినా, తర్వాతితరం కవులు, ముఖ్యంగా  లే హంట్ (Leigh Hunt), మాత్యూ ఆర్నాల్డ్ (Mathew Arnold) వంటి వాళ్ళు అతని కవిత్వ ప్రతిభ గుర్తించడమే గాక, రెండు  దశాబ్దాలు తిరగకముందే, రొమాంటిక్ మూవ్ మెంట్ కి ఆద్యులుగా పేరువహించిన వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్ ల కంటె ఎక్కువ పేరుప్రతిష్టలతో పాటు, కొన్ని వేలమంది అనుయాయుల్ని సంపాదించుకోగలిగేడు కీట్స్. ప్రకృతి వర్ణనలో అతను మిగతాకవులలో తలమానికంగా నిలిచేడు. షెల్లీ తన Adonais కవితతో అతన్ని అమరుణ్ణిచేశాడు.

ప్రకృతికి పులకరించిపోయే కీట్స్ తన వైయక్తిక అనుభవాలనుండి సార్వజనీనకమైన అనుభూతిని రాయడంలో దిట్ట. బహుశా అది గ్రీకు సంప్రదాయం నుండితీసుకుని ఉండవచ్చు. అతనికి కవిత్వమూ, అందమూ, జీవితమూ వేరు కావు. అతని జీవితములో కళా కవిత్వమూ పెనవేసుకుపోయాయి. అతనికి సత్య, శివ, సుందరాల మధ్య అబేధం కనిపించింది.  అతని ఇంద్రియాలకి ప్రకృతిలోని అన్ని వస్తువులలో సౌందర్యాన్నిదర్శించగల ఒక అతీత శక్తి ఉందనిపిస్తుంది. “ఈ ధరణి కవిత్వసరణి ఎన్నడూ ముగియదు (The poetry of the world is never dead)” అన్న ఈ కవితలో, తన అనుభవంలోనుండి ఒక అందమైన చిత్రీకరణ చేశాడు. అతని దృష్టిలో కవిత్వం అంటే ప్రకృతి సౌందర్యానికి కవిమనసులో కలిగే ప్రతిస్పందన. సౌందర్యము మూర్తీభవించిన ఈ ప్రకృతి  శాశ్వతమైనది గనుక, కవిత్వం కూడా ప్రకృతి ఉన్నంతకాలం శాశ్వతమని అతని సూత్రీకరణ.

.

ఈ ధరణి కవిత్వ సరణి ఎన్నడూ ముగియదు
వేసవి వేడిమికి వడదెబ్బ తిన్న పక్షులు చెట్టు నీడన దాగి
సేదదీరుతుంటే, ఒక గొంతు కంచె నుండి కంచె దాటుతూనూ
అప్పుడే కోసిన పచ్చికమైదానాలనుండీ వినిపిస్తుంది.

ఆ గొంతు ఒక మిడతది… వేసవి వైభవానికి పులకించి
ఇంతకుముందెన్నడూ ఎరుగని ఉత్సాహంతో వేసే ఉరకలవి.
అది తన త్రుళ్ళింతలకు అలసిపోయినపుడు
ఏ రమ్యమైన కలుపుమొక్క నీడనో విశ్రాంతి తీసుకుంటుంది.

ఈ ధరణి కవిత్వ సరణికెన్నడూ ముగింపు ఉండదు;  
ఒక ఏకాంత శీతకాలపు సాయంత్రాన, బయట
గడ్డకట్టించే చలి నిశ్శబ్దాన్ని ఏలుతున్నప్పుడు

లోపల వేడిమితో పెరిగే మూడరుపుల కీచురాయి సంగీతం
సగం నిద్రలో జోగుతున్న వ్యక్తికి,  అది ఎక్కడో
గరికనిండిన కొండలలోంచివచ్చే మిడత గొంతులా వినిపిస్తుంది

.

(గమనిక: శీతకాలం లో పాశ్చాత్యులు Room heaters వాడతారు. కనుక బయటనున్న చలి కీచురాయిని లోపలికి తరిమితే, గదిలోని వెచ్చదనం దానికి ఉత్సాహం కలిగించింది.

మలేసియా విజ్ఞాన సర్వస్వము ప్రకారం, చాలా దేశాల్లో మిడతలకీ, కీచురాళ్ళకీ అవి చేసే పంటనష్టానికి భయపడితే, మలేసియాలో మాత్రం అవిచేసే అనుకరణకీ సంగీతానికి పేరుపడ్డాయిట.)

.

Image Courtesy: http://upload.wikimedia.org

జాన్ కీట్స్

.

On the Grasshopper and Cricket

.

The poetry of earth is never dead:

When all the birds are faint with the hot sun,

And hide in cooling trees, a voice will run

From hedge to hedge about the new-mown mead;

That is the Grasshopper’s—he takes the lead

In summer luxury,—he has never done

With his delights; for when tired out with fun,

He rests at ease beneath some pleasant weed.

The poetry of earth is ceasing never:

On a lone winter evening, when the frost

Has wrought a silence, from the there shrills

The Cricket’s song, in warmth increasing ever,

And seems to one, in drowsiness half lost,

The Grasshopper’s among some grassy hills.

.

John Keats.

1819లో ఇంగ్లండు స్వరూపం … షెల్లీ, ఇంగ్లీషు కవి

Image Courtesy: http://1.bp.blogspot.com

.

[ఈ కవిత చదువుతుంటే, ఇందులో పేర్కొన్న ప్రతి రాజ్యాంగ వ్యవస్థలోని భాగానికీ…  సమాంతరంగా ఉన్న నేటి మన రాజకీయ వ్యవస్థ అచ్చం అలాగే పనిచేస్తున్నాదని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. బలహీనమైన కేంద్రాన్ని బెదిరించి గడుపుకుంటున్నాయి చిన్న పార్టీలు. బ్రిటనులోపార్లమెంటు క్రమేపీ ప్రవేశపెట్టిన “Enclosure” చట్టాలద్వారా గ్రామాలలోని రైతులు భూమి హక్కులు కోల్పోయి, ముందు పాలెగాళ్ళుగాను తర్వాత రైతుకూలీలుగానూ మారినట్టు, ఈ రోజు భూసేకరణపేరుతో పంటభూములని కార్పొరేటు సంస్థలకు, తమ తాబేదార్లకూ అప్పనంగా అప్పచెబుతున్న ప్రభుత్వాలు, వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి, రైతులు “Crop Holiday”కి దిగే పరిస్థితులు తీసుకొస్తున్నాయి.  ఇక ప్రజా ప్రతినిధుల, చిన్నా చితకా అధికారులదగ్గరనుండి ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచే అధికారం ఉన్నవారిదాకా అవినీతి రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతోంది. సహ చట్టలవంటివి ఉన్నా వాటిని ఎలా నీరుగార్చాలో ప్రభుత్వాలకీ, నియమింపబడిన అధికారులకీ బాగా తెలుసు. న్యాయవ్యవస్థ కలుగజేసుకోగలిగిన సందర్భాలూ, పరిమితులూ స్వల్పం. మతం ప్రజల నైతిక ప్రవర్తనని ప్రభావితం చెయ్యలేక పోవడంతో, మతం, నైతిక వర్తనా దేనికదే, గాలికూడా చొరలేని ఇరుకు గదులైపోయాయి.

కవిత ముగించిన తీరులోనే,  మనం కూడా చెయ్యగలిగింది … ఏ అద్భుతమో జరిగి, ఈ దేశంకోసం, స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన ఏ మహానుభావుడైనా పునర్జన్మించి ఈ అల్లకల్లోలవాతావరణంలో దేశానికి ఒక మార్గదర్శనం చేస్తాడని ఆశగా  ఎదురుచూడడమే.]

.

రాజు …

           అంధుడూ, వివేకశూన్యుడూ, ఉన్మత్తుడూ,

           కాటికికాళ్ళుజాచుకుని అందరూ అసహ్యించుకునే ముదుసలి;

రాజ వంశీయులు …

           పసలేని జాతి కుక్కమూతిపింజలు,

           ప్రజలు చీదరించుకునే మందులు,

           మురుగునీటి మీది మురుగు;

పాలకులు…

           చూడరూ, తెలీదు, తెలుసుకోలేరు.

           అప్పటికే నీరసించిపోయిన దేశపు రక్తాన్ని తాగితాగి

           ఆ మైకంలో కళ్ళుమూసుకుపోయి పట్టురాలి పడిపోయేదాకా వేలాడే జలగలు;

ప్రజలు…

          ఆకలితో అలమటించి, బీడుబారిన తమ పొలాల్లో హత్యచేయబడ్డవాళ్ళు

సైన్యం …

          రెండంచులకత్తిలా ఒకపక్క స్వేచ్ఛని హత్యచేస్తూ, ఇంకొకపక్క దోచుకుంటుంది

చట్టం …

          ఆశావహం, ఉత్తమం అయినప్పటికీ వక్రభాష్యాలకుగురై నిరుపయోగం

మతం …

          క్రీస్తూ లేక, దేముడూ లేక పుస్తకంలో బందీ అయిపోయింది.

పార్లమెంటు…

         కాలం రద్దుచెయ్యని ఒక చట్టం.

.

         ఇక ఈ సమాధుల్లోంచి అద్భుతమైన ఏ  ప్రేతాత్మో పునరుజ్జీవించి

         ఈ  కారుచీకటిలో వెలుగు చూపించుగాక!

.

Image Courtesy: http://upload.wikimedia.org

                                                   పెర్సీ బిష్ షెల్లీ

                                        (4 August 1792 – 8 July 1822)

ఇంగ్లీషు రొమాంటిక్ మూవ్ మెంట్ లో కీట్స్ లా రెండవ తరానికి ప్రాతినిధ్యం వహించే కవి షెల్లీ. అతనిలాగే  చిన్నవయసులోనే కీర్తిశేషుడయ్యాడు. అతని జీవితకాలంలో సమకాలీన మత, రాజకీయ విశ్వాసాలకు చాలాభిన్నమైన అభిప్రాయాలు గలిగిఉన్నందుకు అతన్ని పక్కకితోసిపెట్టినా మరణానంతరం అతని అభిప్రాయాలకి, అతని కవిత్వంతోపాటే సమున్నతమైన గౌరవం దక్కింది. కార్ల్ మార్క్స్, బెర్నార్డ్ షా, WB Yeats, ఆస్కార్ వైల్డ్ వంటి ప్రముఖులు అతన్ని ఇష్టపడ్డారు.  చారిత్రక ప్రథానమైన కథనంలో అతను అందెవేసిన చెయ్యి. అతని  Ozymandias, Ode to the West Wind, To a Skylark అన్న కవితలు అతనికి అజరామరమైన కీర్తి  సంపాదించిపెట్టేయి. కీట్స్ స్మృత్యర్థం షెల్లీ Adonais అన్న Pastoral Elegy వ్రాసేడు.

షెల్లీ “పీటర్లూ మారణహోమం” గా పిలవబడే …  మాంచెస్టర్ లోని సెయింట్ పీటర్ ఫీల్డ్ లో 1819లో ప్రశాంతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలపై, ఆశ్వికదళం జరిపిన దాడికి … నిరశనగా ఈ కవిత వ్రాసేడు. (ఈ దాడిలో 15 మంది మరణించి కనీసం 600 మంది గాయపడ్డారు)

.

English in 1819 … PB Shelly

.

An old, mad, blind, despised, and dying king,–

Princes, the dregs of their dull race, who flow

Through public scorn, mud from a muddy spring,–

Rulers who neither see, nor feel, nor know,

But leech-like to their fainting country cling,

Till they drop, blind in blood, without a blow,–

A people starved and stabbed in the untilled field,–

An army which liberticide and prey

Makes as a two-edged sword to all who wield,–

Golden and sanguine laws which tempt and slay;

Religion Christless, Godless, a book sealed,–

A Senate—Time’s worst statute unrepealed,–

Are graves from which a glorious Phantom may

Burst to illumine our tempestuous day.

.

Percy Bysshe Shelly

(4 August 1792 – 8 July 1822)

Shelly belongs to the second generation poets of English Romanticism but, like Keats, is one of the major poets of Romantic Movement and died as young. He was closely associated with Byron too. Ozymandias, Ode to the West Wind, To a Skylark among others are his most quoted and critically acclaimed works. He immortalised Keats through his dedicatory poem Adonais. Because of his radical and outspoken views against oppression, religion and call for revolution and change, he was somewhat unpopular. However, after his death he was largely admired for his poetry and political views by people such as  Shaw, Marx, Oscar Wilde, Yeats etc.

This poem was written as a response to the brutal Peterloo Massacre  at St Peter’s Field, Manchester when 15 were killed and at least 600 injured by cavalry attacking a mass peaceful demonstration  in August 1819.

 

%d bloggers like this: