ఈ శతాబ్దం ఖచ్చితంగా ఖగోళానిదే. శతాబ్దాంతానికి మనిషి చంద్రుడి మీదో, కుజుడి మీదో ఆవాసాలని ఏర్పరచుకుంటే, కాంతి వేగాన్ని మించి ప్రయాణించగల మార్గాలని కనుక్కుంటే, సమాంతర సృష్టి ఉందంటే, లేదా ఇప్పటివరకూ కనుక్కోలేని కృష్ణ పదార్థం (Black Matter), కృష్ణశక్తి (Black Energy) ల పూర్తి స్వరూపస్వభావాలను ఆవిష్కరించి మనిషి మేథకి అవధులు విశాలం చేస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే, ఇవన్నీ మనిషి ప్రగతికి దోహదం చెయ్యాలి తప్ప మనుగడని ప్రశ్నార్థకం చెయ్యకూడదు.
భారతీయులకూ (ఇప్పటి భౌగోళిక పరిమితులు కాకుండా, ఒకప్పటి అఖండ భారతదేశం) ఈ విషయంలో కొంత చరిత్ర ఉంది. అయితే, చరిత్రనీ, చారిత్రక ఆధారాలనీ పరిరక్షించుకో దురదృష్టవశాత్తూ మనకి ఆనాడే కాదు, ఈనాటికీ శ్రద్ధలేదు. కనీసం, వంద సంవత్సరాల క్రిందట శ్రీ శంకర్ బాలకృష్ణ దీక్షిత్ వ్రాసిన భారతీయ ఖగోళశాస్త్ర చరిత్రకి ఇప్పటివరకు తెలుగులో అనువాదం నాకు కనిపించలేదు. అయితే, మన ఖగోళశాస్త్ర చరిత్ర తెలుసుకుందికి కుతూహలపడే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ పుస్తకాన్ని అనువదించడానికీ, అలాగే నాకు తెలిసిన కొన్ని ఖగోళశాస్త్ర విషయాలు పంచుకుందికీ ప్రయత్నిస్తాను. ఇక్కడ ఒక్క విషయం స్పష్టం చెయ్యదలుచుకున్నాను. నాకు ఖగోళశాస్త్రం మీదనే తప్ప జ్యోతిషంగా ఇప్పుడు ప్రచారంలో ఉన్న విషయం మీద నమ్మకం గాని, ఆసక్తి గాని లేవు. ఆ విషయాలు ఇందులో మీకు చరిత్రలో భాగంగా అవసరమయితే తప్ప, వాటి ప్రస్తావన ఇందులో కనిపించదు. దీనికి ఇష్టపడని వారికి నేను సవినయంగా చేసే విన్నపం మీరు ఈ వ్యాసాల్ని చదవనక్కరలేదు. మీరు వ్యాఖ్యానించినా అవి ప్రచురింపబడవు. మీకు సమయం వృధా.
అప్పుడప్పుడు అనువాదాల్ని ప్రచురించినా, ఇకమీదట ఖగోళశాస్త్ర (Astronomy) కి చెందిన విషయాలు మీతో పంచుకుంటానని తెలియజేస్తూ, ఆ క్రమంలో ఇది మొదటి వ్యాసం.
స్పందించండి