1
ఓ జలజలా రాలుతున్న మంచు!
ఈ తుచ్ఛమైన జీవితాన్ని
నీలో ప్రక్షాళన చేసుకోనీ!
2
రోడ్డువార చిన్ని మొక్క
దారినపోతున్న వారిని చూడాలని ముందుకి వంగింది.
దారినపోతున్న ఓ గాడిద దాన్ని నమిలి మింగింది.
3
ఓ పిచ్చుక మిత్రమా! వేడుకుంటాను.
నా పూల రెమ్మల్లో రాగాలుతీస్తూ
ఆడుకుంటున్న కీటకాల జోలికి పోకేం?
4
ఎక్కడో దూరంగా, ఒంటరిగా ఉన్న తటాకం
అందులోకి చెంగున ఒక కప్ప దూకీ దాకా
నిశ్చలంగా, యుగాలనాటి నిర్వికల్ప సమాధిలో ఉంది.
5
ఇరవై వేలకు పైగా వీరులు హతులైన
ఆ యుద్ధభూమి ఏనాటిదో! ఆ కలకి స్మృతిచిహ్నంగా
ఇప్పుడక్కడ మిగిలింది వసంతశోభకు తిరిగి పూచిన పూలే!
6
పూర్వీకుల సమాధుల ముంగిట, పండు ముసళ్ళు
ఆ కుటుంబానికి చెందిన వారే అందరూ
ఇపుడు ఒంటరిగా ఎవరి పెట్టెల్లో వారు చేరబడి ఉన్నారు.
7
ఓ ఇలకోడీ! నీ కేకలూ, త్రుళ్ళింతలూ చూస్తూ
నువ్వు ఎంత తొందరలో గతించనున్నావో
ఎవరూ పసిగట్టలేరు సుమా!
.
బాషో
(1644- 1694)
జపనీస్ కవి
అనువాదం: కర్టిస్ హిడెన్ పేజ్ )
స్పందించండి