కాన్రాడ్! నీ జీవితం ఏ మార్పూలేక విసుగ్గా ఉందంటావేమి?
లంగరువేసి ఆలోచనలో పడ్డావెందుకు? అన్నిపక్కలా పాకిరిపోయిన
ఈ కలుపు తగ్గేది కాదు, పైపెచ్చు, నీటివాలు అంతా అల్లుకుంటుంది.
జీవిత నౌక చేరడానికి అందమైన తీరాలు అనేకం ఉన్నాయి
కానీ, నువ్వెప్పుడూ ఒక్క తీరాన్నే చేరాలని ఆరాటపడుతుంటావు.
ఆ తెడ్లని పైకిలాగి పడవకి అడ్డంగా గిరాటు వేశావేమి?
ప్రయత్నం లేకుండా పడవ దానంతట అది వాలులోకి ప్రయాణించదు.
ఈ జీవన కెరటాన్ని వెంటతరిమి ముందుకు తోసే అల ఉండదు.
మన మనుగడే అవరోధాల్ని అధిగమించి ముందుకు సాగడం మీద ఉంది.
జీవితంలో ఉత్తమ పార్శ్వమంతా మన కోరికల ఆరాట ఫలితమే.
మహా అయితే, ఎగుబోటు లేని నీ పడవ కాసేపు నిలకడగా ఉంటుందేమో గాని
ఆగిపోదు. దాన్ని రెండుపక్కలనుండి అశాంతి తాడిస్తూనే ఉంటుంది.
విను! ఆ ప్రశాంతతని నిర్లిప్తంగా సాగే కెరటాలకు విడిచిపెట్టి
బద్ధకంనుండిపుట్టిన కలుపుని వివేకంతో ముందుకు సాగుతూ జయించు.
.
ఆల్ఫ్రెడ్ టెన్నిసన్
(6 August 1809 – 6 October 1892)
ఇంగ్లీషు కవి
స్పందించండి