ఆ గుండ్రటి చిన్ని కిటికీలోంచి అంతా నీలిమయం
నేల నీలం, లేత నీలం, ఆకాశవర్ణం,
అంతా నీలి నీలి రంగు.
నీలవర్ణపు సరస్సులు, నీలి నీలి మడుగులు,
నీలి రంగు అగ్నిపర్వతాలు
ఇంకా దూరంగా ఉన్న నేలంతా నీలమే
నీలి రంగు దీవులూ, కాసారాలూ.
దాస్యశృంఖలాలు త్రెంచుకున్న నేల తీరే అంత!
నా ఉద్దేశ్యంలో. ఎక్కడైతే ప్రేమకోసం అందరూ పోరాడుతారో,
ఎక్కడ దోపిడీ, ద్వేషమూ లేక జీవిస్తారో,
ఒకర్నొకరు ఆప్యాయతతో చూసుకుంటుంటారో,
ఆ నేల చాలా సౌందర్యంగా ఉంటుంది.
ఆ సౌందర్యం ప్రకృతి సిద్ధ సౌందర్యం కాదు,
అక్కడ నివసించే మనుషుల ప్రవృత్తి వల్ల వచ్చింది.
అందుకనే భగవంతుడు మనకందరికీ ఇంత విశాలమైన నేల ఇచ్చాడు
ఇక్కడ ఒక సమాజంగా బ్రతకమని.
అక్కడ కనిపిస్తున్న నీలి నీలి ప్రదేశాలన్నీ
ప్రేమకోసం పోరాడినవీ,
ప్రేమసమాజంకోసం బాధలు భరించినవీ
ఈ నేలా అలాంటిదే.
ఇక్కడ ఒక నీలి భూఖండం మరింత నీలంగా కనిపిస్తోంది
నాకు అన్ని పోరాడిన నేలలూ ఇందులో గోచరిస్తున్నాయి.
ఇక్కడ అన్ని ప్రాణత్యాగాలూ కనిపిస్తున్నాయి.
ఆ చిన్ని గుండ్రటి కిటికీ లోంచి
అంతా నీలంగా
నీలిలోని అన్ని రకాల ఛాయా భేదాలూ కనిపిస్తున్నాయి.
.
ఎర్నెస్టో కార్డెనల్
నికరాగువా కవి
(20 జనవరి 1925 – 1 మార్చి 2020)
.

స్పందించండి