చాలా కాలం క్రిందట ఒక కథ చదివేను. పేరు గుర్తు రావటం లేదు. అందులో కథానాయకుడికి ఒక అమ్మాయిమీద మనసుంటుంది. దగ్గర చుట్టం కూడా. అమ్మాయి వాళ్ల దగ్గరనుండి సంబంధం కలుపుకుందామని కబుర్లు వస్తుంటాయి. ఇష్టం లేనపుడు ‘నాకప్పుడే పెళ్లి వొద్దు అనడం ఒక ఆనవాయితీ’. అబ్బాయి వాళ్లింట్లో తల్లీ, వదినా, అన్నా ఒక్కొక్కరే కథానాయకుడి అభిప్రాయం కనుక్కుందికి ప్రయత్నిస్తారు వేర్వేరు సందర్భాలలో. సిగ్గుకొద్దీ ‘నాకప్పుడే పెళ్లి వొద్దు’ అని అనేవాడు వాళ్లతో. దానితో, చివరకి మన కథానాయకుడుకి ఆ అమ్మాయి అంటే ఇష్టంలేదేమోననుకుని విరమించుకుంటారు. చివరకి, వాళ్ళెప్పుడు ఈ ప్రస్తావన తీసుకువస్తారా, ఒప్పుకుందామా అని అతను చూస్తుంటాడు.
దీనికే, ‘ఇష్టం ఉన్నా బెట్టు పోవడం’ అంటాం. దీన్నే జూలియస్ సీజర్ లో, షేక్స్పియర్ Casca పాత్రద్వారా చాలా చక్కగా చెప్పిస్తాడు. Antony సీజర్ కి కిరీటాన్ని పెట్టజూసినపుడు he put it by thrice, every time gentler than other మూడూసార్లూ వద్దని నిరాకరించాడట. కానీ, ‘మొదటిసారి కంటే రెండో సారి, రెండో సారి కంటే మూడవసారీ ఆ వద్దనడంలోని తీవ్రత తగ్గుతూ వచ్చింది’ అని అనిపిస్తాడు.
ఒకోసారి ఈ బెట్టు పోవడం ఎలా పరిణమిస్తుందంటే, వద్దన్న వస్తువుకోసమే, తర్వాత కావాలని ప్రాకులాడవలసి వస్తుంది. ఈ మనస్తత్వాన్ని ఈ కవిత చాలా చక్కగా పట్టిస్తుంది.
* * *
చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి.
పదిలోనూ ఇంకా ఏడు మిగిలున్నాయి.
మీలో ఎవరైనా నన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటే
యువకులూ, ఓ మంచిరోజు చూసుకుని రండి.
చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి.
పదిలోనూ ఇంకా మూడు మిగిలున్నాయి.
మీలో ఎవరైనా నన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటే
యువకులూ, ఇవాళే మంచిరోజు.
చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి.
మీ బుట్టనిండా పళ్ళు నింపుకోవచ్చు.
మీలో ఎవరైనా నన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటే
యువకులూ, ఆ మాట చెప్పండి చాలు!
.
అజ్ఞాత చీనీ కవి
స్పందించండి