Nongtongpaw… ఛార్లెస్ డిబ్డిన్, ఇంగ్లీషు గీత రచయిత
నా చిన్నతనంలో బొత్తిగా సంస్కృతం చదువుకోని అల్లుడిని, పండగకి అత్తవారింటికి వచ్చినపుడు ఆటపట్టిస్తూ చేసిన గందరగోళం గురించి ఒక చిన్న నాటకం పాఠ్యభాగంలో ఉండేది. అలాగే, ఈ “Nongtongpaw” కూడా. Jonathan Swift, Alexander Pope కీ మిత్రుడైన John Arbuthnot తొలిసారిగా, United Kingdom నీ మరీ ముఖ్యంగా ఇంగ్లాండుని ఆటపట్టిస్తూ సృష్టించిన రాజకీయ వ్యంగ్య పాత్ర John Bull.
ఈ John Bull కి ఒకసారి ఫ్రాన్సు చూడాలన్న కోరిక కలిగింది. అక్కడ అతనికి ఎదురైన అనుభవాన్ని వ్యంగ్యంగా చెబుతుంది ఈ కవిత.
జాన్ బుల్ కి ఫ్రెంచి బొత్తిగా అర్థంకాదు. నేర్చుకోవాలన్న కోరిక ఉండదు. పైగా, అదొక అనాగరిక భాష అన్న అభిప్రాయం ఉంది. ఇంగ్లీషు తప్ప ఫ్రెంచిలో అడుగలేడు. ఇతను ఇంగ్లీషులో అదిగిన ప్రతిదానికీ వాళ్ళు ఫ్రెంచిలో “”Je ne vous entends pas” (I cannot understand what you say)” అని చెబితే, ఆ ఫ్రెంచి మాటలు అతనికి Nongtongpaw గా వినిపిస్తాయి. అదొక వ్యక్తి పేరుగా పొరబడుతాడు.
.
కొన్నాళ్ళ క్రిందట జాన్ బుల్ కి ఏమీ తోచక
ఫ్రాన్సును చూద్దామనీ, అక్కడి కళలగురించీ
విజ్ఞానం గురించీ తెలుసుకుని ఇక్కడ
మాటాడదామనీ ఆవేశం వచ్చి బయలుదేరాడు.
అయ్యా , అన్నీ వినయంగా ఇంగ్లీషులోనే అడిగేవాడు
ఏమడిగినా వచ్చీరాని గ్రీకులో సమాధానం చెప్పేవాడు.
అతను చూసిన ప్రతిదానికీ, అడిగిన ప్రతిదానికీ
వాళ్ల సమాధానం,”ఆర్యా! మీరంటున్నది నాకు అర్థంకాలే”దని.
జాన్ ముందుగా Palais-Royal కి వచ్చాడు
దాని వైభవం చూసి కాసేపు నోటమాట రాలేదు.
“ఎవరిదండీ ఈ ఇల్లు ఇక్కడ ఇంత అందంగా ఉంది?”
“ఇది ఇల్లా? అయ్యా మీరంటున్నది నాకు అర్థం కావటం లేదు”
“ఏమిటీ? మళ్ళీ Nongtongpawమాటేనా?” అని కెవ్వు మన్నాడు జాన్.
“అతను తప్పకుండా చాల పెద్ద దొర అయి ఉండాలి.
సందేహం లేదు, అతనికి భుక్తికి ఏ రకమైన ఢోకా లేదు.
ఈ Nongtongpaw తో ఎలాగైనా ఒకరోజు ఫలహారం చెయ్యాలి.”
మార్లీ రాజప్రాసాదం ఎత్తునుండి వెర్సైల్ ని దర్శించాడు.
ఆ సుందరదృశ్యాన్ని చూసి సంతోషం పట్టలేక పోయాడు.
“ఎవరిదబ్బా ఇక్కడ ఇంత విశాలమైన భూ వసతి?”
“భూ వసతా? ఆర్యా, మీరంటున్నది నాకు అర్థం కావటం లేదు.”
“మళ్ళీ అతనే? ఈ భూమీ ఇళ్ళూ అన్నీ అతనివేనా?
అయితే అతను ఏ యూదువ్యాపారికన్నా ధనవంతుడన్నమాటే.
అతను పట్టినదంతా బంగారమే నన్నమాట.
నేనీ Nongtongpawతో ఓ మధ్యాహ్నం కలిసి భోంచెయ్యాలి.”
తర్వాత అతన్ని దాటుకుంటూ ఒక నాగరిక స్త్రీ వెళ్ళింది.
ఆమె అందాన్ని చూసి జాన్ ముగ్ధుడైపోయి గుటకలు మింగాడు.
“ఎవరీ పడుచు ఇక్కడ ఇంత అందంగా కనిపిస్తోంది?”
“పడుచు? అయ్యా, మీరంటున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు.”
“ఏమిటి? మళ్ళీ అతనిపేరేనా? నా మీద ఒట్టేసిచెప్పగలను:
ఆ భవనం, ఈ భూసంపద, అంత అందమైన భార్య
బహుశా దేముడుకూడ హుషారుగా అన్నీ జోడించి ఉంటాడు.
ఈ Nongtongpaw ఎవరో అతనితో రాత్రి తప్పక భోంచెయ్యాలి.”