సదయులారా! సహృదయులారా!
నా కథని ఒకసారి ఆలకించండి!
ఇందులో మీకు కొత్తదనం కనిపించకపోతే
మిమ్మల్ని ఎక్కువసేపు నిలబెట్టదు.
అనగనగా ఇస్లింగ్టన్ అనే ఊరిలో
ప్రపంచమంతటా కీర్తిగణించిన,
ప్రార్థనచెయ్యడంలో అతన్ని మించినవాడు
లేడనిపించుకున్న ఒక భక్తుడుండేవాడు.
శత్రువునైనా, స్నేహితుడినైనా సమదృష్టితో చూసి
సాంత్వననీయగల కరుణార్ద్ర హృదయుడాతడు
అతనికి వస్త్రధారణపై మమకారం లేక
ఎప్పుడూ దిగంబరిగానే తిరిగే వాడు.
అన్ని ఊళ్ళలో ఉన్నట్టే ఆ ఊరిలోకూడా,
ఒకానొక కుక్క ఉండేది,
అక్కడ మేలుజాతి వేటకుక్కనుండి, సంకరజాతి,
ఊరకుక్కల వరకు అన్నిరకాలూ ఉన్నాయి.
మొదట్లో ఆ వ్యక్తీ, ఈ కుక్కా స్నేహంగా ఉండేవారు
కానీ ఎందుకో కోపం వచ్చి స్నేహం చెడింది.
అంతే, దాని ప్రతాపం చూపించడానికి,
పిచ్చెత్తినట్టు ఒకసారి అతన్ని బాగా కరిచేసింది.
అయ్యో అంటూ చుట్టుపక్కల వీధులవాళ్ళు
ఆశ్చర్యంతో, పరిగెత్తుకుంటూ వచ్చారు
ఈ కుక్కకి నిజంగా పిచ్చెక్కిందనీ, లేకపోతే
అంతమంచి మనిషిని కరుస్తుందా అని కొందరన్నారు.
దేముడిని నమ్మిన ఏ వ్యక్తి కంటికైనా
ఆ గాయం తీవ్రమైనదని తెలుస్తూనే ఉంది.
కొందరు ఆ కుక్క నిజంగా పిచ్చిదని నిర్థారిస్తే
ఆ మనిషి ఇక బతకడని మరికొందరు నిర్థారించేరు.
కాని, కొద్దిరోజుల్లోనే ఒక వింత జరిగి
ఆ ధూర్తులు చెప్పినదంతా అబద్ధమని తేల్చింది.
ఆ మనిషి కుక్కకాటునుండి బయట పడ్డాడు
కానీ, పాపం, చచ్చిపోయింది మాత్రం ఆ కుక్కే!
.
(వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అన్న నవలనుండి)
ఆలివర్ గోల్డ్ స్మిత్
ఐరిష్ కవి, నవలాకారుడు, నాటక కర్తా.
Image Courtesy: http://upload.wikimedia.org
స్పందించండి