మీరు ఇతను స్టీఫెనే అంటారు.
అలా అయితే నేను నిజమో కాదో రూఢి చేసుకోవాలి.
నా జాగ్రత్తలో నేనుండడం ఎప్పుడైనా మంచిదే కదా!
చూశారా! ఇక్కడే పప్పులో కాలు వేశారు. జుత్తు చూస్తున్నారు గదా,
ఇది నల్లగా ఉంది. స్టీఫెన్ జుత్తు తెల్లగా ఉంటుంది…
ఏమిటీ? ఏమయిందీ? విస్ఫోటనం జరిగిందా?
అలా అయితే నల్లగా మాడిపోతుంది. నా మతి మండినట్టే ఉంది.
నా బుర్రకి ముందే తట్టి ఉండాలి. సరే, మిగతావి పరీక్షిద్దాం.
ఆ ముఖం, ఆ ముఖం గురించే నే నడుగుతున్నది?
నల్లగా కొరకంచులా మాడిపోయిన చర్మం,
పొక్కిపోయి, మచ్చలు తేరి పోయింది
అది పిల్లవాడి ముఖం అంటే ఎవరైనా నమ్ముతారా?
అయితే, కాలిపోగా మిగిలిన చోట్ల కనిపిస్తున్న స్వెట్టరు
మాత్రం బాగా పరిచయం ఉన్నట్టు కనిపిస్తోంది.
కానీ, రూఢిచేసుకోవడం ఎందుకైనా మంచిది.
ఓ, స్కౌటు బెల్టు. అది మాత్రం అతనిదే.
ఈ మధ్యనే, నిండా వారం కూడా తిరగలేదు,
దానికి కన్నాలు వెయ్యడం నాకు గుర్తుంది.
పిల్లలకు వాళ్ళు వేసుకునే దుస్తులమీద
ఎక్కువ దృష్టి ఉండే వయసు కదా.
ఇది ఖచ్చితంగా స్టీఫెనే. కానీ రూఢి
చేసుకోవడం, అన్ని సందేహాలు తీర్చుకోవడం మంచిది.
ఏ చిన్నపాటి ఆశ ఉన్నా నిలబెట్టుకోవడం మంచిది.
జేబులో! జేబులు ఖాళీ చెయ్యండి.
చేతి రుమాలా? అది ఏ విద్యార్థిదైనా అయి ఉండొచ్చు.
ఎంత మురికిగా ఉండాలో అంత మురికిగా ఉంది. సిగరెట్లా?
అయితే ఇది స్టీఫెన్ ఖచ్చితంగా కాదు.
మీకు తెలుసుగా, నేను సిగరెట్లు తాగనియ్యనని.
వాడు నా మాట పెడచెవిని పెట్టడు. వాళ్ళ నాన్నలా కాదు.
కాని ఆ పెన్-నైఫ్ వాడిదే. అది వాడిదేనని ఒప్పుకుంటున్నా.
ఆ తాళాలగుత్తికున్న తాళంచెవి కూడా వాడిదే
ఈ మధ్యనే వాళ్ళ నానమ్మ ఇచ్చింది.
అంటే ఇది తప్పకుండా స్టీఫెనే.
ఇప్పుడర్థం అయింది నాకు ఏంజరిగిందో…
అదే సిగరెట్ల విషయం.
ఖచ్చితంగా వాడు వాటిని
వాడికంటే పెద్ద కుర్రాళ్ళకోసం తెచ్చి ఉంటాడు.
అంతే! అంతే! మరోలా అవడానికి అవకాశం లేదు.
ఇది వాడే.
ఇది మా స్టీఫెనే!
.
రోజర్ మెగోఫ్
జననం 1943
ఇంగ్లీషు కవి.

Image Courtesy: https://ryedalefestival.com/wp-content/uploads/6-Roger-McGough.jpg
స్పందించండి