వసంతంలో పారిస్ నగరం… సారా టీజ్డేల్ , అమెరికను కవయిత్రి
కాసేపు కనిపించీ కాసేపు కనిపించని
సూర్యుడి వెలుగులో నగరం ప్రకాశిస్తోంది.
పిల్లగాలి హుషారుగా ఈదుకుంటూ పోతోంది.
ఒక చిన్న జల్లు కురిసి ఆగిపోయింది.
నీటిబొట్లు మాత్రం చూరుకి వేలాడుతూ
ఒకటొకటిగా క్రిందకి రాలుతున్నాయి.
ఆహ్! ఇది పారిస్, ఇది పారిస్,
వసంతం అడుగుపెట్టింది.
బోయిస్ పార్కు చిత్రమైన స్పష్టాస్పష్ట కాంతితో
మిలమిలా మెరుస్తుండడం నాకు తెలిసినదే.
పొడవైన ఛాంప్స్ రాచవీధిలో ఆర్క్ డ ట్రీయోంఫ్
ప్రాచీనతకి చిహ్నంగా నిశ్చలంగా, హుందాగా నిలబడుతుంది.
కానీ మహోన్నతంగా పెరిగిన అకేసియా చెట్లమీద పడే
వెలుతురుకి కాలిబాటమీద నీడలు దోబూచులాడుకుంటాయి.
ఓహ్, ఇది పారిస్, ఇది పారిస్,
చెట్ల ఆకులు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి.
సూర్యాస్తమయం అయింది, వెలుగు తిరోగమించింది,
పడీ పడనట్టు నాలుగు చినుకులు రాలేయి.
కానీ సియాన్ నదిమీదనుండి ఇంత హాయిగా గాలి
వీస్తుంటే, దాన్ని ఎవరు పట్టించుకుంటారు?
అయినా, అందమైన యువతి ఒకతె కిటికీ
అద్దం పక్కన కూచుని ఏదో కుట్టుకుంటోంది.
అది పారిస్, అది పారిస్ నగరం అయి
అది వసంతం అయితే, మరోసారి తప్పక రండి.
.
సారా టీజ్డేల్
(8th Aug 1884 – 29th Jan 1933)
అమెరికను కవయిత్రి
.
