నీ శకం ముగిసింది… లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి
నీ శకం ముగిసింది, ఇక నీ కీర్తి ప్రారంభమైంది.
ఈ దేశవాసులు గీతాలు రచిస్తారు
తమ ప్రియతమ పుత్రుడు
సాధించిన ఘనకార్యాలూ, గెలిచిన యుద్ధాలూ,
నిలబెట్టిన స్వాతంత్య్రమూ,
గెలిచిన పోరాటాలనూ స్మరించుకుంటూ!
నువ్వు నేల రాలి, మేము స్వేచ్ఛగా మిగిలినా
నీకు మరణం ఎంతమాత్రం లేదు;
నీ శరీరంనుండి వెల్లువై పెల్లుబికిన రక్తం
ఈ నేలలో ఇంకడానికి ఇష్టపడక,
మా రక్తనాళాల్లో తిరిగి ప్రవహిస్తూంది
నీ ఆత్మ మా ఊపిరులున్నంతవరకు శాశ్వతం!
నీ నామస్మరణే తక్కిన వీరసైనికులని
ముందుకి నడిపే యుద్ధ నినాదం!
నీ త్యాగమే, గొంతెత్తి పాడే
యువ గాయకబృందాల ఆలాపనల పల్లవి.
నీ గురించి దుఃఖించడం నీ యశస్సుకి అపచారం
అందుకే, నీకై ఎవరూ వగవరు!
.
జార్జ్ గార్డన్, లార్డ్ బైరన్
(22 January 1788 – 19 April 1824)
ఇంగ్లీషు కవి
.