వాళ్ళు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో వచ్చిన గొప్ప కవితలలో ఇదొకటి. యుద్ధంలో స్వయంగా పాల్గొని, మృత్యువుని దగ్గరగా చూసిన అనుభవంతో యుద్ధం ఎంత నిష్ప్రయోజనమో ససూన్ చాలా చక్కగా వివరించడంతో పాటు, అందులో పాల్గొనకుండా, యుద్ధాన్ని గొప్పగా కీర్తించే వాళ్ళ ఆత్మవంచన స్వభావాన్ని ఎండగడుతుంది ఈ కవిత.
.
బిషప్ మాతో ఇలా అన్నాడు: “వాళ్ళు యుద్ధం నుండి తిరిగొచ్చేక
మునపటిలా ఉండరు; కారణం వాళ్ళు క్రీస్తుకి వ్యతిరేకులపై
చిట్టచివరి ధర్మ యుద్ధం చెయ్యడానికి వెళ్ళేరు;
వాళ్లు కళ్ళజూసిన తోటి సైనికుల రక్తం
జాతి తలెత్తుకు జీవించడానికి కొత్త అధికారాన్నిచ్చింది.
వాళ్ళు మృత్యువుకి ఎదురునిలిచి మరీ పోరాడేరు.”
“అవును, మాలో ఎవ్వరం మునపటిలా లేము,” అన్నారు కుర్రాళ్ళు.
“జార్జికి రెండు కాళ్ళూ పోయాయి; బిల్ కి కళ్ళు అసలు కనపడవు,
పాపం ఊప్రితిత్తులలోంచి గుండు దూసుకెళ్ళి, జిం చావే నయమనుకుంటున్నాడు;
బెర్ట్ కి సిఫిలిస్ వ్యాధి సోకింది. అసలు యుద్ధానికి వెళ్ళిన వాడు
ఒక్కడైనా ఏదో ఒకటి పోగొట్టుకోకుండా తిరిగొస్తే ఒట్టు!”
దానికి బిషప్, “భగవంతుని లీలలు చిత్రంగా ఉంటాయి!” అన్నాడు.
.
సీ ప్రై ససూన్
(8 September 1886 – 1 September 1967)
ఇంగ్లీషు కవి
.

Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm